ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రమైనా రాష్ట రాజకీయాల్లో, ఆ జిల్లా నాయకుల ప్రస్తావనలేని రోజుండదు. మంత్రి పదవుల నుంచి ప్రధాన మంత్రి దాకా పదవులు పొందిన లీడర్లు ఉన్నారక్కడ. ఇప్పుడు ప్రధాన పార్టీల అధ్యక్షులు కూడా అక్కడి నుంచే ప్రాతినిధ్యం. ఇంతకీ ఏదా జిల్లా? నాయకులకు, అంత సెంటిమెంట్‌గా ఎందుకు మారింది?
ఉమ్మడి కరీంనగర్ జిల్లా, నాయకులకు కలిసొస్తోంది. ఈ జిల్లా నుంచే లీడర్లు, పార్టీల అధ్యక్షులుగా పని చేసే అవకాశం దక్కించుకున్నారు. ఇప్పుడు ఈ వరుసలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేరారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కెటిఆర్ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ప్రస్తుత కరీంనగర్ ఎంపి బండి సంజయ్‌కి బిజెపి అధిష్టానం పార్టీ పగ్గాలను అప్పగించింది. జిల్లాకు చెందిన ఇందుర్తి మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కాగా జగిత్యాలకు చెందిన ఎల్.రమణ తెలంగాణ టిడిపి అద్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇక పిసిసి పదవి కోసం మాజి ఎంపి పోన్నం ప్రభాకర్, మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఈ ఇద్దరిలో ఎవరికి దక్కినా, రాష్ట ప్రధాన పార్టీల అధ్యక్షులంతా కరీంనగర్ వారే అవుతారు.
గతంలోనూ పాతతరం జిల్లా నాయకులు, నాటి రాజకీయాలను శాసించారు. రాష్ట్ర రాజకీయాల్లో అన్ని ప్రధాన పార్టీల్లో కరీంనగర్‌కు చెందిన వారు కనీసం ఒక్కరైనా ఉండేవారు. నాటి పీవీ కాలం నుంచి నేటి వరకు అదే ట్రెండ్ కొనసాగుతోంది. దేశ ప్రధాన మంత్రిగా చేసిన అపర చాణుక్యుడు పివి నరసింహరావు ఈ జిల్లా వాస్తవ్యులే. ఆయన రాజకీయల్లో కీలకంగా ఉన్న సమయంలో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో చక్రంతిప్పారు. ఆ తరువాత అంచెలంచెలుగా సిఎం నుంచి ప్రధానమంత్రిగా ఎదిగారు. ఆ తరువాత రాజకీయ కురవృద్దుడు ఎమ్మెస్సార్ సైతం జిల్లాకు సంబంధించిన వారే. రాజకీయాల్లో కాకగా పిలుచుకునే గడ్డం వెంకటస్వామి సైతం ఇదే జిల్లా లీడరే.
ఇటు బిజెపి పార్టీలోనూ రాష్ట్ర, కేంద్ర రాజకీయల్లో కీలకంగా వ్యవహరించిన వారు సైతం కరీంనగర్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. 1998-99 లో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీని నడిపించారు. ఆ తరువాత ఎమ్మెల్యేగా, ఎంపిగా, కేంద్ర మంత్రిగా, గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించారు.
ఇక ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సైతం కరీంనగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించి తిరుగులేని నేతగా ఎదిగారు. అదే మార్గంలో ఆయన వారసుడు కేటీఆర్ సైతం జిల్లా నుంచే శక్తివంతమైన లీడర్‌గా దూసుకుపోతున్నారు. ఇలా వీరంతా రాత్రికి రాత్రే నాయకులుగా మారలేదు. దీనికి వెనుక ఎన్నో వ్యుహలు ఎంతో రాజకీయ చతురత ఉన్నాయి. వీటికితోడు కరీంనగర్ సెంటిమెంట్ కూడా కలిసి వచ్చిందని, ఆయన అనుచరులు చెప్పుకుంటారు. ఇప్పుడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్, మున్ముందు ఎలా చెలరేగిపోతారోనన్నది ఆసక్తిగా మారింది.