Crop Loan Waiver - Telangana: డైడ్‌లైన్ లోగా రైతులకు ఇచ్చిన మాటను సీఎం రేవంత్ నిలబెట్టుకుంటారా..?

Rythu Runa Mafi: తెలంగాణ ప్రభుత్వం కొత్త కార్పోరేషన్స్ దిశగా అడుగులు వేస్తోందా..? రైతు రుణ మాఫీ కోసం కొత్త కార్పోరేషన్ ఏర్పాటు తప్పదా..?

Update: 2024-05-24 06:14 GMT

Crop Loan Waiver - Telangana: డైడ్‌లైన్ లోగా రైతులకు ఇచ్చిన మాటను సీఎం రేవంత్ నిలబెట్టుకుంటారా..?

Crop Loan Waiver - Telangana : తెలంగాణ ప్రభుత్వం కొత్త కార్పోరేషన్స్ దిశగా అడుగులు వేస్తోందా..? రైతు రుణ మాఫీ కోసం కొత్త కార్పోరేషన్ ఏర్పాటు తప్పదా..? దీని ద్వారా ఎన్ని నిధులు అప్పుగా తెచ్చుకోవచ్చు..? బడ్జెటేతర రుణాలు కూడా FRBM పరిధిలోకి వస్తున్న నేపథ్యంలో కొత్త అప్పు పుట్టడం సాధ్యమా...? అసాధ్యమేనా..? డైడ్‌లైన్ లోగా రైతులకు ఇచ్చిన మాటను సీఎం రేవంత్ నిలబెట్టుకుంటారా..?

తెలంగాణలో రైతు రుణమాఫీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి నిధుల సేకరణపై దృష్టి సారించింది. రైతులకు 2లక్షల రుణ మాఫీ కోసం.. 35వేల నుంచి 40వేల కోట్ల వరకు నిధులు అవసరం. అంత పెద్ద మొత్తంలో ఒకేసారి నిధులు సమకూర్చడం తెలంగాణ సర్కార్‌కు చాలా క్లిష్టమైన పని. ఓ వైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదంటూనే.. ఆగస్టు 15లోగా 2లక్షల రైతు రుణాలను మాఫీ చేసి తీరాలనే పట్టుదలతో ఉన్నారు సీఎం రేవంత్. అందుకు ఆర్థిక వనరుల సమీకరణ కోసం.. రైతు సంక్షేమం పేరిట కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి రైతుల అప్పులను బదలాయించాలని భావిస్తున్నారు.

మాఫీ కోసం తీసుకున్న వేల కోట్లను వాయిదాల పద్ధతిలో బ్యాంకులకు ప్రభుత్వం చెల్లించనుంది. అయితే ఫార్మర్‌ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ కి చట్టబద్ధత తప్పనిసరి. అందుకే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి, ఆమోదం తీసుకొని కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పిస్తారు. రుణమాఫీ కోసం తీసుకున్న అప్పును నెలవారీ వాయిదాల్లో 10-15 ఏళ్లలో కార్పొరేషన్‌ ద్వారానే బ్యాంకులకు సర్కారు చెల్లించనుంది. ఇందుకు హామీగా ఎక్సైజ్‌, రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నుల రూపేణ ఆదాయాన్ని చూపనుంది. ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లపై సెస్సును వసూలు చేసే దిశగా అధ్యయనం చేయాలని అధికారులను రేవంత్‌ ఆదేశించారు.

2023-24 సంవత్సరంలో రాష్ట్ర మొత్తం రుణ చెల్లింపుల భారం 32వేల 939 కోట్లకు చేరిందని అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్ తెలిపింది. రాష్ట్రం మొత్తం రెవెన్యూ రాబడిలో రుణాల చెల్లింపుల భారం రాష్ట్రం ఏర్పడిన తొలి రోజుల్లో14 శాతం.. గత బడ్జెట్ సమావేశాల నాటికి 34 శాతంకి పెరిగిందని ప్రభుత్వం తెలిపింది. ఈ అప్పుల చెల్లింపు ద్వారా ఇతర ఖర్చులకు తక్కువ నిధులు కేటాయించవలసి వస్తుందని కూడా తెలిపింది. అప్పుల చెల్లింపు కోసం కమర్షియల్‌ ట్యాక్స్, రవాణా, ఎక్సైజ్‌, రిజిస్ట్రేషన్ & స్టాంప్స్, మైనింగ్ శాఖల నుంచి ఆదాయ సేకరణకు ఉన్న అవకాశాలపై ముఖ్యమంత్రి ఆరా తీస్తున్నారని ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి.

2022 నుంచి కార్పోరేషన్ల ద్వారా తీసుకునే రుణాలు కూడా ఎఫ్ఆర్బీఎం పరిధిలోకే వస్తాయి. ఇది ఆర్టికల్ 293 (3) అధికరణం ద్వారా తీసుకొచ్చిన చట్టం అని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త కార్పోరేషన్‌ను ఏర్పాటు చేసి ఎఫ్ఆర్బీఎం లిమిట్ ను దాటి 40 వేల కోట్ల అప్పు తీసుకురావడం ఎలా సాధ్యం అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే మరో 7 వేల కోట్ల అప్పు తీసుకోవచ్చని..అంతేకానీ 40 వేల కోట్ల రుణం పొందడం ప్రస్తుత పరిస్థితుల్లో అసాధ్యం అని అధికారుల్లో చర్చ జరుగుతుంది.

కార్పోరేషన్ ఏర్పాటు చేసినా ప్రభుత్వం అప్పులు తెచ్చుకోవడానికీ అవకాశం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో రుణమాఫీ కోసం ప్రభుత్వం ఏ విధంగా అడుగులు వేస్తోందో అన్న చర్చ కొనసాగుతుంది.

Tags:    

Similar News