HYDRA Commissioner AV Ranganath Report: ప్రభుత్వానికి రంగనాథ్ ఇచ్చిన నివేదికలో ఏముంది ?

హైడ్రా ఏర్పాటయినప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్లు ఏమేం కూల్చేశారు, ఏమేం సర్వే చేశారు అనే పూర్తి వివరాలను పొందుపరుస్తూ సీఎం రేవంత్ రెడ్డికి హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ఓ రిపోర్ట్ అందజేశారు.

Update: 2024-08-25 11:48 GMT

What is there in HYDRA report: హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ఇప్పటివరకు హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై తాజాగా ప్రభుత్వానికి ఓ నివేదిక అందజేశారు. నగరం నలువైపులా కొన్ని చెరువులు, కుంటలు, నాలాలతో పాటు ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ నిర్మాణాలపైకి హైడ్రా బుల్డోజర్స్ వెళ్తోన్న సంగతి తెలిసిందే. నిన్నటి వరకు హైడ్రా చేపట్టిన కూల్చివేతలు ఒక ఎత్తయితే.. నిన్న కూల్చిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ మరో ఎత్తు.

ఇదేకాకుండా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం చెరువులను, కుంటలను కబ్జా చేసి నిర్మించిన స్థలాల్లోని నిర్మాణాలను సైతం హైడ్రా కూల్చివేసింది. దీంతో చెరువులను, నాలాలను ఆక్రమించి అక్రమ కట్టడాల నిర్మాణం చేపట్టిన వాళ్ల గుండెల్లో హైడ్రా రైళ్లు పరిగెత్తిస్తోంది. హైడ్రా కూల్చబోయే తరువాతి జాబితాలో ఇంకా ఎవరెవరు ఉండుంటారు అనే సస్పెన్స్ అందరిలోనూ ఉంది.

ఈ నేపథ్యంలోనే హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నివేదిక అందించడం ప్రస్తుతం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. హైడ్రా నివేదికలో ఏముందనేదే ఆ ఆసక్తికి కారణమైంది.

ఇంతకీ హైడ్రా నివేదికలో ఏముంది ?

హైదరాబాద్ నగరం పరిధిలో ఇప్పటివరకు 18 వేర్వేరు చోట్ల కూల్చివేతలు చేపట్టినట్లు హైడ్రా నివేదికలో పేర్కొంది. ఆ జాబితాలో అక్కినేని నాగార్జున, కావేరి సీడ్స్ యజమాని భాస్కర్ రావు, బహదూర్‌పుర ఎమ్మెల్యే మహ్మద్ ముబిన్, ఎంఐఎం ఎమ్మెల్సీ మహ్మద్ మీర్జా, మంథని బీజేపి నేత సునిల్ రెడ్డి, నందగిరి హిల్స్‌లో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ అనుచరుడు నిర్మించిన కట్టడం, ప్రొ కబడ్డి లీగ్ యజమాని అనుపమ, కాంగ్రెస్ నేత పల్లంరాజు సోదరుడికి చెందిన నిర్మాణాలు ఉన్నాయి.

ఇవేకాకుండా బంజారాహిల్స్, లోటస్ పాండ్, అమీర్‌పేట, గాజుల రామారం, మన్సూరాబాద్ ప్రాంతాల్లోనూ అక్రమ నిర్మాణాలపై ఫోకస్ చేసినట్టు హైడ్రా నివేదికలో పొందుపరిచారు. 18 చోట్ల కూల్చిన నిర్మాణాల మొత్తం స్థలం 43.94 ఎకరాల వరకు ఉందని హైడ్రా తమ నివేదికలో స్పష్టంచేసింది. ఈ అధికారిక నివేదిక ప్రభుత్వానికి అందకముందు వరకు హైడ్రా కూల్చిన నిర్మాణాల స్థలాల మొత్తం దాదాపు 100 ఎకరాల వరకు ఉంటుందనే టాక్ వినిపించింది. కానీ అసలు స్థలం అందులో సగమేనని ఈ నివేదిక వెల్లడించింది.

ఎన్ కన్వెన్షన్ సెంటర్ కేసు..

ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత వ్యవహారం కోర్టు వరకు వెళ్లడంతో పాటు నాగార్జున నుండి తీవ్రమైన ప్రతిస్పందన వచ్చినందున.. ఈ అంశంపై నివేదికలో ఇంకాస్త వివరంగానే వివరాలు పొందుపర్చినట్టు తెలుస్తోంది. 

భగవద్గీత హైడ్రాకు స్పూర్తి అంటున్న రేవంత్ రెడ్డి.. ఎలాగంటే..

ధర్మం గెలవాలంటే అధర్మం ఓడాల్సిందేనని రేవంత్ రెడ్డి అన్నారు. భగవద్గీతలోని ఈ వ్యాఖ్యాలే హైడ్రాకు స్పూర్తి అని పేర్కొన్నారు. కోకాపేటలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలకు హాజరైన సందర్భంగా భగవద్గీతలోని సారాంశాన్ని గుర్తుచేస్తూ రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. చెరువులు, కుంటలు కబ్జా చేసుకుని పెద్దపెద్ద భవనాలు నిర్మించుకున్న శ్రీమంతులు చాలామంది ప్రభుత్వాన్ని ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో ప్రభావం చేస్తున్నారని అన్నారు. అయితే, ఎవరెన్ని ఒత్తిళ్లు చేసినా హైడ్రా మొదలుపెట్టిన పని ఆపేది లేదని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు.  

Tags:    

Similar News