Ganesh Immersion: గణేష్ నిమజ్జనానికి భాగ్యనగరం సిద్ధం

Ganesh Immersion: హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి నలువైపులా ఏర్పాట్లు

Update: 2021-09-19 00:58 GMT

గణేష్ నిమజ్జనానికి సిద్దమైన భాగ్యనగరం (ఫైల్ ఇమేజ్)

Ganesh Immersion: హైదరాబాద్‌లో గణేష్ చతుర్థి వేడుకలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. వాడ వాడలా 9రోజులు పూజలందుకున్న గణనాథులు.. నిమజ్జనానికి సిద్ధమయ్యారు. మొత్తం రెండున్నర లక్షల గణేష్‌ విగ్రహాలు నిమజ్జనం కోసం తరలిరానున్నాయి. ఇక.. శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. 27వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది మొదటిసారిగా పీవీ మార్గ్‌లో కూడా నిమజ్జనానికి అనుమతులు ఇవ్వడంతో.. పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. హోంగార్డు స్థాయి అధికారి నుంచి ఉన్నతస్థాయి అధికారి వరకు శోభాయాత్ర విధులు నిర్వహించనున్నారు. రాపిడ్ యాక్షన్ ఫోర్స్, గ్రే హౌండ్స్, ఆక్టోపస్ తో నిఘా పెంచారు. సమస్యాత్మక , అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. జియో ట్యాగింగ్ ద్వారా విగ్రహాల నిమజ్జనం ప్రక్రియను పర్యవేక్షించనున్నారు.

భాగ్యనగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నిమజ్జన శోభాయాత్ర కోసం 162 గణేష్ యాక్షన్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఈ యాక్షన్ టీమ్ లలో మొత్తం 8 వేల116 మంది సిబ్బందిని నియమించారు. హుస్సేన్ సాగర్ తో పాటు, చెరువులు, కుంటలలో నిమజ్జనం జరుపబోతున్నారు. మొత్తం 33 చెరువులు, 25 ప్రత్యేక కొలనుల్లో నిమజ్జన ప్రక్రియ జరగనుండగా.. ట్యాంక్ బండ్ దగ్గర 33, ఎన్టీఆర్ మార్గ్ వద్ద 11 క్రేన్లను ఏర్పాటు చేశారు. అలాగే.. వివిధ కెపాసిటిగల 330 క్రేన్లను అందుబాటులో ఉంచారు. నిమజ్జన వ్యర్థాలను తొలగించేందుకు 20 ఎక్స్ లేటర్లు, 21 జేసీబీలు, 39 మినీ టిప్పర్లు, 10 టన్నుల సామర్థ్యం కలిగిన 44 వాహనాలను ఏర్పాటు చేశారు.

ఖైరతాబాద్‌లో కొలువుదీరిన అతిపెద్ద గణనాథుడైన శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతి నిమజ్జన ఘట్టానికి సర్వం సిద్ధమైంది. కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో నిమజ్జన కార్యక్రమాలను ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ ముందస్తుగానే ప్రారంభించింది. ఇవాళ ఉదయం చివరి పూజలు అందుకోగా.. అనంతరం మహాగణపతిని ట్రాలీ ఎక్కించనున్నారు. ఆ తర్వాత ట్రాలీపై వెల్డింగ్ పనులు నిర్వహించి, ఉదయం 9 గంటల సమయానికి ట్రాలీ అలంకరణ పూర్తి చేస్తారు. ఇక.. 9 గంటలకు శోభాయాత్ర ప్రారంభమై.. దాదాపు రెండున్నర కిలోమీటర్ల వరకు సాగనుంది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి నిర్ణీత క్రేన్‌ దగ్గరకు భారీ గణనాధుడు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల సమయంలో ఖైరతాబాద్‌ గణేష్‌ నిమజ్జనం పూర్తికానుంది.

సోమవారం ఉదయానికి సామూహిక నిమజ్జన శోభాయాత్ర పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్న పోలీసులు.. వినాయక విగ్రహాలు తరలించే వాహనాలకు కలర్ కోడింగ్ ఇచ్చారు. బ్లూ, ఆరెంజ్ అండ్ రెడ్ అండ్ గ్రీన్ కేటాయించారు. కలర్ కోడ్ ఆధారంగా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు ట్రాఫిక్‌ పోలీసులు. ఇక.. వినాయక నిమజ్జనంలో మహిళల భద్రత కోసం 80కి పైగా షీ టీమ్స్ ను ఏర్పాటు చేశారు. మరోవైపు.. సోమవారం ఉదయం వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు పోలీసులు. బాలాపూర్ నుండి వచ్చే శోభాయాత్ర, ఫలకనుమా నుంచి వచ్చే శోభాయాత్ర చార్మినార్, అఫ్జల్గంజ్, గౌలీగూడా చమాన్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్‌బాగ్‌ మీదుగా ట్యాంక్‌బండ్‌ లేదా ఎన్టీఆర్‌ మార్గ్‌కు చేరుకోనుంది. అలాగే.. బేగం బజార్, ఉస్మాన్ గంజ్ , అఫ్జల్‌గంజ్‌, గౌలిగూడా మీదుగా శోభాయాత్ర వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు.

సికింద్రాబాద్‌ నుంచి వచ్చే శోభాయాత్ర.. ఆర్పీ రోడ్, కర్బాల మైదానం, కవాడిగుడ, ముషీరాబాద్ కూడలి, హిమయత్ నగర్ జంక్షన్, లిబర్టీ మీదుగా ట్యాంక్ బ్యాండ్ లేదా ఎన్టీఆర్ మార్గ్ వైపు మళ్లించనున్నారు. ఉప్పల్ నుంచి వచ్చే శోభాయాత్ర రామాంతపూర్, అంబర్‌పేట్‌ కూడలి, శివంరోడ్, ఫీవర్ ఆస్పత్రి, నారాయణగూడ కూడలి, లిబర్టీ మీదుగా కొనసాగేలా ఏర్పాట్లు చేశారు. దిల్‌సుఖ్‌నగర్‌, ఐఎస్ సదన్ వైపు నుంచి వచ్చే శోభాయాత్ర.. సైదాబాద్, నల్గొండ క్రాస్ రోడ్, చాదర్ ఘాట్, ఎంజే మార్కెట్ మీదుగా కొనసాగనుంది. టోలిచౌకి, రేతిబౌలి, మెహదీపట్నం నుంచి వచ్చే శోభాయాత్ర.. మాసబ్ ట్యాంక్, నిరంకారి భవన్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ వైపు మళ్లించారు.

గణేష్‌ నిమజ్జనం సందర్భంగా.. టీఎస్‌ ఆర్టీసీ జీహెచ్‌ఎంసీ జోన్‌ పరిధిలో 565 ప్రత్యేక బస్సులను నడపనుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని దాదాపు 31 డిపోలకు.. ఒక్కో డిపో నుంచి 15 నుంచి 20 బస్సులను ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి తర్వాత కూడా ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. అలాగే.. రాత్రి మూడు గంటల వరకు మెట్రో రైళ్లతో పాటు.. 8 ప్రత్యేక MMTS రైళ్లు నడవనున్నాయి. ఇక.. హైద‌రాబాద్‌లోని మూడు క‌మిష‌న‌రేట్ల ప‌రిధిలో ఇవాళ, రేపు మ‌ద్యం దుకాణాలు బంద్ ఉండ‌నున్నాయి. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలోని వైన్‌ షాపులు, బార్లు, ప‌బ్‌లు మూతపడనున్నాయి. ఇవాళ ఉదయం 9 గంట‌ల నుంచి రేపు సాయంత్రం 6 గంటల వరకు అన్నిరకాల మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.

Tags:    

Similar News