మరోసారి కార్ రేసింగ్‌కు సిద్ధమైన హుస్సేన్ సాగర్ తీరం

* మొత్తం 6టీంలు, 12 కార్లు, 24 మంది డ్రైవర్లు... 250 నుంచి 500 కి.మీ వేగంతో దూసుకుపోనున్న స్పోర్ట్స్ కార్లు

Update: 2022-12-10 07:52 GMT

మరోసారి కార్ రేసింగ్‌కు సిద్ధమైన హుస్సేన్ సాగర్ తీరం

Hyderabad Race League: హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ తీరంలో మరోసారి కార్ రేసింగ్ జరగనుంది. ఇవాళ, రేపు ఇండియన్ రేసింగ్ లీగ్ చివరి సిరీస్ నిర్వహించనున్నారు. నెక్లెస్ రోటరీ నుంచి తెలుగు తల్లి జంక్షన్, సెక్రటేరియట్ నుంచి ఎన్టీఆర్ గార్గెన్, మింట్ కాంపౌండ్, ఐమ్యాక్స్ వరకు లీగ్ కొనసాగనుంది. ఈ రేసులో మొత్తం 6 టీంలు, 24 మంది డ్రైవర్లు, 12 కార్లలో పోటీల్లోకి దిగనున్నారు. 250 నుంచి 500 కిలోమీటర్ల మెరుపువేగంతో స్పోర్ట్స్ కార్లు దూసుకుపోనున్నాయి. టికెట్స్ బుక్ చేసుకున్న వారికి గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ మార్గ్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈనెల 11 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. దీంతో ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, ఐమ్యాక్స్ థియేటర్ల వైపు వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.

హైదరాబాద్ వేదికగా హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో ఫిబ్రవరి 11న అసలైన ఇండియన్ రేస్ పోటీలు జరగనున్నాయి. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఆటోమొబైల్, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్ రేసింగ్ పోటీలకు వివిధ ప్రపంచ దేశాల నుంచి దాదాపు 30వేల నుంచి 35వేల మంది ప్రేక్షకులు హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో రేసింగ్ పోటీలకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. నవంబర్‌లో నిర్వహించిన రేసింగ్‌లో రేసర్లకు ప్రమాదాలు జరగడంతో ట్రయల్‌ రన్‌తోనే సరిపెట్టారు. మిగతా రెండు సిరీస్‌లను చెన్నైలో నిర్వహించారు. చివరి సిరీస్‌ ఇవాళ, రేపు హైదరాబాద్‌లో జరగనుంది.

ఖైరతాబాద్ వీవీ విగ్రహం వైపు నుంచి నెక్లెస్ రోటరీ వైపు ట్రాఫిక్‌ అనుమతి లేదు. వీవీ విగ్రహం వద్ద షాదన్ కాలేజీ, రవీంద్ర భారతి వైపు ట్రాఫిక్‌ను మళ్లిస్తారు. బుద్ధభవన్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను నల్లగుట్ట జంక్షన్ నుంచి రాణిగంజ్, ట్యాంక్‌బండ్ వైపు మళ్లిస్తారు. రసూల్‌పురా, మినిస్టర్ రోడ్డు నుంచి నెక్లెస్ రోటరీ వైపు నల్లగుట్ట మీదుగా వచ్చే వాహనాలను నల్లగుట్ట జంక్షన్ వద్ద రాణిగంజ్ వైపు మళ్లిస్తారు. ఇక ఇక్భాల్ మినార్ నుంచి తెలుగుతల్లి జంక్షన్, ట్యాంక్‌బండ్ వైపు వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను ఫ్లై ఓవర్ పైనుంచి కట్టమైసమ్మ ఆలయం, లోయర్ ట్యాంక్‌బండ్ వైపు మళ్లిస్తారు.

ట్యాంక్‌బండ్, తెలుగు తల్లి జంక్షన్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వాహనాలకు అనుమతి లేదు. తెలుగు తల్లి జంక్షన్ నుంచి ఇక్భాల్ మినార్, రవీంద్ర భారతి జంక్షన్ వైపు ట్రాఫిక్‌ను మళ్లిస్తారు. బీఆర్‌కే భవన్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను తెలుగు తల్లి జంక్షన్ నుంచి ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతి జంక్షన్ వైపు మళ్లిస్తారు. ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి మింట్ కాంపౌండ్ వైపు వాహనాలకు అనుమతిలేదు. ఈ వాహనాలను రవీంద్ర భారతి జంక్షన్ వైపు మళ్లిస్తారు. ఖైరతాబాద్ బడా గణేష్ వైపు నుంచి ప్రింటింగ్ ప్రెస్, నెక్లెస్ రోడ్ వైపు వాహనాలకు అనుమతిలేదు. ఈ వాహనాలను బడా గణేష్ వద్ద రాజ్‌దూత్ లైన్‌లోకి మళ్లిస్తారు. 

Tags:    

Similar News