Khammam: ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు
Khammam: పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
Khammam: ఖమ్మం జిల్లాలో దంచి కొడుతున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. నిన్నటి వరకూ నీరు లేక అడుగంటిన జిల్లాలోని రిజర్వాయర్లు ఉహించని భారీ వర్షాలతో పూర్తిస్థాయి నీటిమట్టంతో కళకళలాడుతున్నాయి. దీంతో అన్నదాతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం జిల్లా జలాశయాల్లో జలకళపై ప్రత్యేక కథనం.
19 అడుగులకు చేరిన వైరా రిజర్వాయిర్
జాలిముడి ఎడమ కాల్వకు గండి
బేతుపల్లి పెద్ద చెరువు నీటిమట్టం 13.6 అడుగులు
లంకాసాగర్ నీటిమట్టం 12.7 అడుగులు
ఉధృతంగా ప్రవహిస్తున్న చౌటవాగు
వర్షాలకు ఖమ్మం జిల్లాలోని వాగులు, ప్రాజెక్టులు, రిజర్వాయిర్లకు పెద్దఎత్తున నీరు వచ్చి చేరుతోంది. చెరువులు అలుగులు పారుతున్నాయి. వాగులు ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వైరా రిజర్వాయిర్ గరిష్ఠ నీటిమట్టం 18.3 అడుగులు కాగా 19 అడుగులకు చేరింది. మధిరలోని జాలిముడి సాగునీటి ప్రాజెక్టు ఎడమ కాల్వకు సిరిపురం, వంగవీడు గ్రామాల మధ్య గండిపడింది. సత్తుపల్లి నియోజకవర్గంలోని బేతుపల్లి పెద్ద చెరువు పూర్తిస్థాయి నీటిమట్టం 16 అడుగులు కాగా 13.6 అడుగులకు చేరింది. లంకాసాగర్ 12.7 అడుగులకు చేరింది. సత్తుపల్లి కిష్టారం, చెరుకుపల్లి గ్రామాల మధ్య చౌటవాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
వర్షాలకు రైల్వే ట్రాక్ పై బండరాళ్లు
ఉధృతంగా ప్రవహిస్తున్న బుగ్గవాగు
మూడు జిల్లాలకు నిలిచిన రాకపోకలు
పెనుబల్లి మండలం కొత్త లంకపల్లి కుక్కల గుట్ట వద్ద కురుస్తున్న వర్షాలకు రైల్వే ట్రాక్ పై బండరాళ్లు పడ్డాయి. లోకోపైలేట్ అప్రమత్తతలో ట్రైన్ కు ప్రమాదం తప్పింది. స్నానాల లక్ష్మీపురం రామలింగేశ్వరస్వామి దేవస్థానంవద్ద ఏరు వంతెనపై ఉధృతంగా ప్రవహిస్తుండటంతో లక్ష్మీపురం, సిరిపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కామేపల్లి మండలంలోని కొత్త లింగాల, డోర్నకల్ ప్రధాన రహదారిలో బండిపాడు వద్ద బుగ్గవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కొణిజర్ల మండలం మల్లుపల్లి వద్ద పగిడేరు పొంగి రహదారి మద్య వంతెన పై నుంచి ప్రవహిస్తుంది.
పాలేరు రిజర్వాయర్ నీటిమట్టం 18 అడుగులు
వైరా రిజర్వాయర్ నీటిమట్టం 18.5అడుగులు
పాలేరు జలాశయానికి వర్షాల కారణంగా భారీగా వరద నీరువచ్చి చేరింది. ప్రస్తుతం 18 అడుగుల గరిష్ట స్థాయిలో రిజర్వాయర్ కళకళలాడుతోంది. దీంతో ఆయకట్టుపరిధిలోని సాగునీరు, తాగునీటి కష్టాలు తీరినట్లేనని జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మధ్యతరహాకు చెందిన వైరా రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టాన్ని దాటి స్వల్పంగా పొంగి ప్రవహిస్తుంది. రిజర్వాయర్ నిండుకుండలా జలకళను సంతరించుకుంది. శనివారం ఉదయానికి పూర్తిస్థాయి నీటిమట్టం 18.3అడుగులు దాటింది. ప్రస్తుతం నీటిమట్టం 18.5అడుగులుగా ఉంది. రిజర్వాయర్ పరివాహాక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలతో ఏర్లు, వాగులు పొంగి ప్రవహించి రిజర్వాయర్‌కు భారీగా వరదనీరు వచ్చిచేరింది.
మొత్తం మీద భారీ వర్షాలతో జిల్లాలోని అన్ని సాగు నీటి రిజర్వాయర్లకు భారీగా నీరు వచ్చి గరిష్ట స్థాయికి చేరడం పట్ల అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఖరీఫ్ సాగు పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి.