Ramoji Rao: మీడియా మొఘల్ చెరుకూరి రామోజీ రావు అస్తమయం
మీడియా దిగ్గజం చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు. కొద్దిరోజులుగా అస్వస్థతగా ఉన్న ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
Ramoji Rao: మీడియా దిగ్గజం చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు. కొద్దిరోజులుగా అస్వస్థతగా ఉన్న ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రామోజీ రావు ఈనాడు గ్రూపు సంస్థలతో పాటు అనేక వ్యాపారాలు చేస్తున్నారు. తెలుగు దినపత్రిక ఈనాడు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు, ప్రచురణ కర్త.తోపాటు మార్గదర్శి చిట్‌ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి తదితర వ్యాపార సంస్థల నడుపుతున్నారు. రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూపు ఆధీనంలో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. 2016లో భారత ప్రభుత్వం ఆయన్ని దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ తో సత్కరించింది.
గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్ నానక్‌రాంగూడలోని స్టార్ ఆస్పత్రిలో తెల్లవారు జామున 3:45నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఈనెల 5న గుండెసమస్యలతో ఆయనకు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. దీంతో హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షల అనంతరం గుండెకు స్టెంట్ వేశారు. అనంతరం ఐసీయూలో చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్సపొందుతూ తెల్లవారుజామున మృతిచెందారు. ఆయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలిస్తున్నారు రెండు రోజులుగా ఐసీయూలో ఉన్న ఆయన ఆరోగ్యం.. శుక్రవారం రాత్రి విషమించింది. శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు ఆయన స్వర్గస్తులయ్యారు. గత కొద్ది రోజులుగా రామోజీరావు వయసు సంబంధిత అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన వయసు 88 ఏళ్లు..
రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 16న రైతుకుటుంబంలో జన్మించారు. ఈయన తాత రామయ్య చనిపోయిన కొద్ది రోజులకే రామోజీరావు జన్మించారు. తాత రామయ్యపేరునే ఆయనకు పెట్టారు. అయితే, స్కూలుకు వెళ్లేటప్పుడు రామయ్య అనే పేరు నచ్చక రామోజీరావుగా స్వయంగా ఆయనే మార్చుకున్నారు. గుడివాడలో బీఎస్సీ పూర్తి చేసిన రామోజీరావు ఢిల్లీలోని ఒక అడ్వర్ టైజింగ్ ఏజెన్సీలో ఉద్యోగంలో చేరారు. మూడు సంవత్సరాలు అక్కడే పనిచేసి తరువాత హైదరాబాద్ కు తిరిగి వచ్చారు.
ప్రస్తుతం రామోజీరావు వయస్సు 88 ఏళ్లు. వ్యాపార దిగ్గజంగా ఆయనకు గొప్ప పేరుంది. మీడియాతో పాటు అనేక వ్యాపారాల్లో రాటుదేలారు రామోజీరావు. ఈనాడు సంస్థలు, మార్గదర్శి చిట్‌ఫండ్స్, ప్రియా ఫుడ్స్ వంటి వ్యాపారాలు నెలకొల్పి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అంతేగాక రామోజీ ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేసి హైదరాబాద్, సినీ పరిశ్రమ అభివృద్ధిలో భాగమయ్యారు రామోజీరావు. చిన్నతనం నుంచే ఆయనకు సాహిత్యంపట్ల అభిరుచి అబ్బింది.
రామోజీరావు 1962 అక్టోబరులో హైదరాబాద్‌లో మార్గదర్శి చిట్ ఫండ్ ప్రారంభించారు.. ఆయన జీవితంలో తొలి వ్యాపారం. 1965లో కిరణ్ యాడ్స్ అన్న అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీ ప్రారంభించారు. . 1967 - 1969 మధ్యకాలంలో ఖమ్మం ప్రాంతంలో వసుంధర ఫెర్టిలైజర్స్ పేరిట ఎరువుల వ్యాపారాన్ని కూడా ప్రారంబించారు. 1970లో ఇమేజెస్ అవుట్‌డోర్ అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీ ప్రారంభించారు..
1974 ఆగస్టు 10న విశాఖ సాగర తీరంలో ఈనాడు దినపత్రిక ప్రారంభించారు. ప్రారంభించిన నాలుగేళ్లలోనే పాఠకుల మానసపుత్రికగా ఈనాడు మారింది. ఈనాడుతో పాటు కీలక మైలురాయిగా సితార సినీ పత్రిక నిలిచింది రైతులకోసం అన్నదాత పత్రికను ప్రారంభించారు. .బహుముఖ ప్రజ్ఞ.. కఠోర సాధన.. ఇదే రామోజీ అస్త్రాలు. నలుగురు నడిచిన బాట కాదు.. కొత్త దారులు సృష్టించడం ఆయన నైజం. లక్ష్య సాధనకు దశాబ్దాలపాటు నిర్విరామంగా పరిశ్రమించిన యోధుడు. రైతుబిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించారు. మీడియా మహాసామ్రాజ్యాన్ని నిర్మించిన రామోజీరావు.. చైతన్యదీప్తుల్లాంటి చిత్రరాజాలను సృజించారు. అద్భుత ఫిల్మ్‌సిటీని సృష్టించారు. తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. అంతే కాదు ఈనాడు ప్రతిక ద్వారా కేవలం వార్తలు అందించడమే కాకుండా అనేక ప్రజా ఉద్యమాలకు అండగా నిలిచింది. ముఖ్యంగా సారా వ్యతిరేక ఉద్యమంలో ఈనాడు పత్రిక కీలక పాత్ర పోషించింది. రామోజీరావు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఆఖరి క్షణం వరకూ ప్రజా శ్రేయస్సు కోసమే పరితపించారు. పనిలోనే విశ్రాంతి అనేది ఆయన ప్రాథమిక సూత్రం. చివరి క్షణం వరకు పనిలోనే విశ్రాంతి సిద్ధాంతాన్ని పాటించిన మహనీయుడు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన రామోజీరావు అంచలంచలుగా పైకి ఎదిగారు. ఆయన జీవితం యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. రామోజీరావు మృతికి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్ కు సీఎస్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.