రియల్ లైఫ్ హీరో.. చావును ముందుగానే ఊహించిన హర్షవర్ధన్‌.. ముందుగానే భార్యకు విడాకులు..

Doctor Harshavardhan: మనిషి జీవితంలో ఊహించనది చావు.. అది ఎప్పుడు వస్తుందో.. ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేరు.

Update: 2023-04-07 12:01 GMT

రియల్ లైఫ్ హీరో.. చావును ముందుగానే ఊహించిన హర్షవర్ధన్‌.. ముందుగానే భార్యకు విడాకులు..

Doctor Harshavardhan: మనిషి జీవితంలో ఊహించనది చావు.. అది ఎప్పుడు వస్తుందో.. ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేరు. కానీ అతడు మాత్రం తన చావును ముందుగానే ఊహించాడు. తన జీవిత భాగస్వామి కోసం కావాల్సిన ఏర్పాట్లు చేశాడు. తల్లిదండ్రులు, తోబుట్టువులకు ధైర్యం చెప్పాడు. విదేశాల్లో ఉంటున్న తన మృతదేహం స్వదేశానికి చేరేలా ముందుగానే ఏర్పాట్లు చేసుకున్నాడు. ఖమ్మంలో నివాసముంటున్న రామారావు, ప్రమీలకు ఇద్దరు సంతానం. వారిలో పెద్ద కుమారుడు హర్షవర్ధన్‌.

బీఫార్మసీ చేసిన హర్షవర్ధన్‌ 2013లో ఆస్ట్రేలియా వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించి.. ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. కరోనాకు ముందు 2020 ఫిబ్రవరిలో ఖమ్మం వచ్చి వివాహం చేసుకున్నాడు. వీసా వస్తే భార్యను ఆస్ట్రేలియా తీసుకెళ్లాలని అన్ని ఏర్పాట్లు చేసుకోగా కరోనా లాక్‌డౌన్‌ వచ్చిపడింది. 2020 అక్టోబర్‌లో జిమ్‌ చేస్తున్న హర్షవర్ధన్‌కు ఆరోగ్యంలో మార్పులు కనిపించాయి. టెస్టులు చేయించుకోగా లంగ్‌ క్యాన్సర్‌ సోకినట్లు తేలింది. తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో కన్నీరుమున్నీరయ్యారు. ఇంటికి రావాలని తల్లిదండ్రులు కోరగా.. వారికి ధైర్యం చెప్పి ఆస్ట్రేలియాలోనే చికిత్స తీసుకున్నాడు.

క్యాన్సర్‌ వ్యాధి సోకిన తనకు ఇక చావు తప్పదని నిర్ణయించుకున్న హర్షవర్ధన్‌ ముందుగానే భార్యకు విడాకులిచ్చి ఆమె స్థిరపడేందుకు ఏర్పాట్లు చేశాడు. చికిత్స తీసుకుంటున్న సమయంలో క్యాన్సర్‌ వ్యాధి నయమైందని డాక్టర్లు చెప్పడంతో 2022 సెప్టెంబర్‌లో ఖమ్మం వచ్చి 10రోజులు తల్లిదండ్రులతో గడిపాడు. తిరిగి వెళ్లాక క్యాన్సర్‌ తిరగబడింది. ఇక చావు తప్పదని నిశ్చయించుకున్నాడు. రోజూ కుటుంబ సభ్యులతో వీడియో కాల్‌లో మాట్లాడుతూ ధైర్యం చెప్తూ వచ్చాడు. తమ్ముడి పెళ్లి నిశ్చయమైందని తెలిసి వీలుంటే వస్తానంటూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన తీరు అందరినీ ఆశ్చర్యపర్చింది.

తను చనిపోయాక మృతదేహాన్ని స్వదేశానికి తరలించడంపై దృష్టి సారించాడు హర్షవర్ధన్‌. తన మృదేహాన్ని స్వదేశానికి తరలించడంలో తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం ఓ లాయర్‌ను మాట్లాడుకుని ఫార్మాలిటీస్‌ పూర్తి చేశాడు. మార్చి 24న హర్షవర్ధన్‌ కన్నుమూశాడు. ఏప్రిల్‌ 5న అతని మృతదేహం ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు చేరింది. చావును ముందుగానే ఊహించి.. భాగస్వామికి అన్యాయం చేయకుండా ఆమెకు విడాకులివ్వడం.. స్థిరపడటానికి ఏర్పాట్లు చేయడం.. మృతదేహాన్ని స్వదేశానికి తరలించడంలో తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయడం.. ఇవన్నీ స్థానికుల హృదయాలను కదలించాయి. చావును ముందుగా ఊహించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన హర్షవర్ధన్‌ మృతదేహాన్ని చూసిన స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. 

Tags:    

Similar News