Gandhi Hospital: గాంధీ ఆసుపత్రిలో ముదురుతున్న వివాదం
-కలకలం రేపుతోన్న డాక్టర్ వసంత్ ఆరోపణ -గాంధీ ఆస్పత్రిలో కోట్ల స్కాం జరుగుతోందని ఆరోపణ
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి డాక్టర్ వసంత్ కుమార్ వ్యవహారం రోజు రోజుకు ముదురుతోంది. వసంత్ ఆరోపణలు గాంధీ ఆస్పత్రిలో కలకలం సృష్టిస్తున్నాయి. తన ఆరోపణలను ఎవరూ పట్టించుకోవడం లేదని వసంత్ ఆవేదన చెందుతున్నారు. కరోనావైరస్ లీకేజీ వ్యవహారంలో తనను బలి చేశారన్న ఆయన హౌస్ సర్జన్ సర్టిఫికెట్ల జారీలో భారీ కుంభకోణం జరిగిందని.. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్ కుమార్ పాత్ర ఇందులో ఉందని ఆరోపించడం కలకలం రేపుతోంది.
డీఎంఈ రమేష్ రెడ్డి, గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రవణ్ వ్యక్తిగత కక్షలతోనే తనను డీహెచ్‌కు సరెండర్ చేశారని డాక్టర్ వసంత్ ఆరోపించారు. గాంధీ హాస్పిటల్‌లో అవినీతి అక్రమాలు రాజ్యమేలుతున్నాయని అన్నారు. రమేష్ రెడ్డి పెద్ద బ్లాక్‌మెయిలర్ అని, పోస్టింగ్ కోసం డబ్బులు తీసుకుంటారని ఆరోపించారు. ఈ విషయాలపై ప్రశ్నిస్తున్నందుకే తనకు ఈ గతి పట్టిందని వసంత్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత ఏడాదిపాటు హౌస్ సర్జన్ చేయాల్సిన జూనియర్ డాక్టర్లు హాస్పిటల్‌కు రాకుండానే డబ్బులిచ్చి సర్టిఫికెట్లు పొందుతున్నారని వసంత్ ఆరోపిస్తున్నారు. డాక్టర్ శ్రావణ్ గాంధీలో గడిపే సమయం తక్కువని.. సొంత ప్రాక్టీస్‌కే ఎక్కువ సమయం కేటాయిస్తారని విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా... 2017,2018, 2019 బ్యాచ్‌కు చెందిన విద్యార్ధుల సర్టిఫికెట్స్ తారుమారు చేసే ప్రయత్నం బయటపడటంతో తీవ్ర గందరగోళానికి దారితీసింది. పైగా ఆస్పత్రిలో ఏం జరుగుతుందో తెలియని గందరగోళం నెలకొంది.
గాంధీ ఆస్పత్రిలో కరోనా చిచ్చుతో మొదలైన రచ్చ.. రోజు రోజుకు ముదురుతున్నా... సర్కారు పట్టించుకోవడం లేదు. గాంధీలో ఏం జరుగుతుంది... అసలేందుకు సర్కారు ఎందుకు జోక్యం చేసుకోవడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా డాక్టర్ వసంత్ చెప్పిన మాటల్లో నిజం ఉన్నందుకే అతన్ని సరెండర్ చేశారా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోజు రోజుకు ముదురుతున్న వివాదంపై సర్కారు కమిటీ వేస్తుందా లేదా అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి