Modern Crematorium for Funerals: అంత్యక్రియలకు ఆధునిక వసతులు.. జీహెచ్ఎంసీలో ఐదు చోట్ల ఏర్పాటు
Modern Crematorium for Funerals: కరోనా వైరస్ పుణ్యమాని మరణాలు అధికంగానే సంభవిస్తున్నాయి.
Modern Crematorium for Funerals: కరోనా వైరస్ పుణ్యమాని మరణాలు అధికంగానే సంభవిస్తున్నాయి. వీటికి అనుగుణంగా మృతులను తీసుకెళ్లేందుకు అధిక శాతం మంది వెనుకడుగువేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ భాద్యత అంతా తెలంగాణ రాజధానికి సంబంధించి జీహెచ్ఎంసీపై పడింది. అయితే వరుసగా మరణాలు సంభవిస్తుండటంతో ఈ ప్రక్రియ ఆలస్యం అవుతోంది. దీనిని గుర్తించిన ప్రభుత్వం తొందరగా అంత్య క్రియలకు ఉపయోగపడే యంత్రాలను రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రస్తుతం రాజధానిలో ఐదు చోట్ల వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు చేసిన ప్రభుత్వం, వాటికి అవసరమైన నిర్మాణ పనులను పూర్తి చేస్తున్నారు.
కరోనా వైరస్ కారణంగా అంత్యక్రియల ప్రక్రియకు ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు GHMC మరో ప్రత్యమ్నాయ మార్గాన్ని ఆలోచించింది. రోజు రోజుకి కరోనా బారినపడి చనిపోయిన వారి సంఖ్య పెరిగిపోతుండటంతో.. ఆయా మృతదేహాలను వీలైనంత త్వరగా దహనం చేసేందుకు ఆధునిక యంత్రాలను అందుబాటులోకి తీసుకురానుంది. LPG గ్యాసుతో నడిచే ఈ యంత్రాలను.. జీహెచ్ఎంసీ పరిధిలోని పలు శ్మశాన వాటికల్లో అమర్చేందుకు సన్నాహలు చేస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి పలుచోట్ల ప్లాట్ ఫాం నిర్మాణాలు మొదలుపెట్టింది.
ఈ యంత్రంతో కేవలం రెండు గంటల్లోనే ఒక మృతదేహం దహనం పూర్తికానుంది. అదే ఎలక్ట్రిక్ మెషిన్‌తో అయితే ఈ ప్రక్రియకు 4 గంటల సమయం పడుతుంది. కొత్త యంత్రం నిర్వహణ ఖర్చు కూడా తక్కువేనని అధికారులు చెబుతున్నారు. అలాగే పర్యావరణానికి హాని కూడా తక్కువేనని అంటున్నారు. ఒక్కో యంత్రానికి 70 లక్షలు ఖర్చుపెట్టి… ప్రస్తుతం 5 యంత్రాలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసింది.
చార్మినార్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, ఉప్పల్, కూకట్‌పల్లి జోన్లలోని శ్మశాన వాటికల్లో వీటిని అమర్చాలని భావిస్తున్నారు. వారం రోజుల్లో రెండు యంత్రాలు అందుబాటులోకి రానుండగా.. మిగిలిన వాటి ఫిట్టింగ్‌కు మరో 15 రోజులు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎల్‌పీజీ గ్యాస్ మెషిన్‌తో కనీసం ఒక్క రోజు 12 మృతదేహాలను దహనం చేయొచ్చని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం సిబ్బందిని షిఫ్టుల్లో పనిచేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.