GHMC Elections 2020: చివరి ఘడియలు.. ఆశల పల్లకీ..తిరుగుబాట్లు.. జంపింగ్ పర్వాలు!

* ఆశావహుల్లో తారస్థాయికి టెన్షన్‌ * టికెట్‌ రాకుంటే పార్టీ మారాలనే యోచన * రెండో రోజు 522 నామినేషన్లు

Update: 2020-11-20 07:32 GMT

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలుకు ఇవాళే చివరి రోజు. మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. అయితే ఆ సమయాని కంటే ముందుగానే నామినేషన్లు స్వీకరించే సంబంధిత మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న అభ్యర్ధులందరి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. కాగా నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రచారంపై దృష్టి సారిస్తున్నాయి.

ఇక మరోవైపు బల్దియా ఎన్నికల నామినేషన్ల పర్వం ఊపందుకుంది. రెండవ రోజు ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు వేశారు. గురువారం ఒక రోజే 522 మంది అభ్యర్థులు 580 నామినేషన్లను దాఖలు చేశారు. దీంతో రెండు రోజులు కలిపి 537 మంది 597 నామినేషన్లను వేశారు. నిన్న మంచిరోజు కావడం, పంచమి తిథి కూడా కలిసి రావడంతో.. అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం పెద్ద ఎత్తున నామినేషన్లను దాఖలు చేశారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల పర్వం ముగియనుండడంతో.. పలు పార్టీల అభ్యర్థులు గురువారమే నామినేషన్లు వేసేందుకు ఆసక్తి చూపారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నామినేషన్లు ఇవాళ్టితో ముగియనున్నాయి. ప్రధాన పార్టీల నుంచి టికెట్‌ ఆశిస్తున్న వారిలో టెన్షన్‌ తారా స్థాయికి చేరింది. అవకాశం వస్తుందా..? రాదా..? అనే ఉత్కంఠ ఆశావాహుల్లో కొనసాగుతోంది. కొందరైతే టికెట్‌ రాకుంటే మరో పార్టీలోకి జంప్‌ చేద్దామా? అని ఆలోచిస్తున్నారు. నామినేషన్లకు గడువు దగ్గర పడుతుండటంతో పార్టీల అభ్యర్థుల ప్రకటన జోరందుకుంది. తొలుత 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్‌, రెండోరోజు 20 స్థానాలకు ప్రకటించింది. దీంతో ఆ పార్టీ 125 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లయింది.

బీజేపీ గురువారం 18, 23 మంది అభ్యర్థులతో జాబితాలను విడుదల చేసింది. తొలిరోజు 21 మందితో జాబితా ప్రకటించడంతో కమలం పార్టీ ఇప్పటిదాకా 73 మంది అభ్యర్థులను ప్రకటించినట్లయింది. కాంగ్రెస్‌ మరో 36 పేర్లతో జాబితా విడుదల చేసింది. బుధవారం 45 డివిజన్లలో కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించడంతో ఇప్పటికి 81 డివిజన్లలో అభ్యర్థులను ప్రకటించినట్లయింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 90 డివిజన్లలో పోటీచేయాలని నిర్ణయించిన టీడీపీ, అన్ని స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించింది.

ఇక 27 మంది అభ్యర్థుల పేర్లతో టీజేఎస్‌ తొలి జాబితాను విడుదల చేసింది. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని, పోటీ చేయడానికి ఆసక్తి ఉన్న విద్యావంతులు 9848287001కు ఫోన్‌ చేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం కోరారు. వామపక్షాల తరఫున పోటీచేసే 15 మంది అభ్యర్థులతో రెండో జాబితాను ఆ పార్టీ ప్రతినిధులు విడుదల చేశారు.

మొదటి జాబితాలో 11 మంది పేర్లు ప్రకటించారు. రెండో జాబితాలో సీపీఐ నుంచి 8, సీపీఎం నుంచి ఏడుగురు అభ్యర్ధుల పేర్లను ప్రకటించారు. గ్రేటర్‌లో 40 స్థానాలకు పోటీ చేయాలని వామపక్షాలు నిర్ణయించాయి. ఈ ఎన్నికలో వైసీపీ పోటీ చేయడం లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.

వెంగళరావునగర్‌ సిటింగ్‌ అభ్యర్థి బీజేపీలోకి

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోని వెంగళరావునగర్‌ డివిజన్‌ ్డటీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఖరారు కాలేదు. అయితే అప్పటిదాకా ఎదురుచూడకుండా అక్కడి టీఆర్‌ఎస్‌ సిటింగ్‌ కార్పొరేటర్‌ కిలారి మనోహర్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఇదే నియోజకవర్గంలోని మరో రెండు డివిజన్ల సిటింగ్‌లు కాంగ్రెస్‌, బీజేపీతో టచ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. రామచంద్రాపురం టీఆర్‌ఎస్‌ సిటింగ్‌ కార్పొరేటర్‌ అంజయ్య యాదవ్‌ గురువారం ఉదయం బీజేపీ కండువా కప్పుకొని సాయంత్రానికి మళ్లీ టీఆర్‌ఎ్‌సలో చేరారు.

2016లో నాచారం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటి చేసిన జ్యోతి మల్లికార్జున్‌ గౌడ్‌, కాంగ్రె్‌సలో చేరారు. రెండో జాబితాలో ఆ పార్టీ ఆయన పేరును ఖరారు చేసింది. ఇదే డివిజన్‌లో కాంగ్రెస్‌ నుంచి విజయం సాధించిన శాంతి సాయిజెన్‌ శేఖర్‌ గతంలోనే కారెక్కారు. కాగా గురువారం 150 డివిజన్లకు 522 నామినేషన్లు దాఖలయ్యాయి. 522 మంది అభ్యర్థులు 580 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.

తొలి రోజు 17 మంది అభ్యర్థులు 20 సెట్ల నామినేషన్లను దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో రెండు రోజుల్లో కలిసి 537 మంది అభ్యర్థులు 597 సెట్లను దాఖలు చేశారు. గురువారం దాఖలు చేసిన వారిలో బీజేపీ నుంచి 140, సీపీఐ-1, సీపీఎం-4, కాంగ్రెస్‌-68, ఎంఐఎం-27, టీఆర్‌ఎస్‌-195 మంది ఉన్నారు. 


Tags:    

Similar News