ఆకాశాన్నంటుతున్న గణేష్ విగ్రహాల రేట్లు
Ganesh Idol Prices: గతేడాది కంటే రెండింతలు పెరుగుదల
Ganesh Idol Prices: ఆరు అడుగులు ఉండే పీవోపీ గణేష్ విగ్రహం గతేడాది 6 వేల రూపాయలకే దొరికేది. ఇప్పుడు 6 వేల నుంచి 20 వేల రూపాయల వరకు పలుకుతోంది. ఏడు, ఎనిమిది అడుగుల విగ్రహాల 30వేల రూపాయల నుంచి 40వేల రూపాయల వరకు ఉంది.
హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఇదేవిధమైన ధరలు ఉండటంతో ఉత్సవ నిర్వాహకులు హడలిపోతున్నారు. 10వేలతో భారీ విగ్రహం కొనాలని నగర శివారు ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా ధరలను చూసి నిరాశతో వెనుదిరుగుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో పీవోపీ గణేష్ విగ్రహాల ధరలు మండిపోతున్నాయి.
రెండేళ్లుగా కరోనా మహమ్మారి వల్ల చాలా మంది విగ్రహాలను కొనలేదు. తయారీ కూడా కొంత మేర తగ్గింది. ప్రస్తుతం పీవోపీ విగ్రహాల ధరలు గతంతో పోల్చితే రెండింతలు పెరిగాయి. మట్టి విగ్రహాల ధరలు కూడా తక్కువేం లేవు. నాలుగు అడుగుల మట్టి ప్రతిమకు 20వేల రూపాయలు కాగా.. ఆరు అడుగుల మూర్తి 30వేల రూపాయలకు పైగా ధర పలుకుతోంది.
ముడిసరుకు ధరలు భారీగా పెరగడం వల్లే విగ్రహాల ధరలను పెంచాల్సి వచ్చిందని తయారీదారులు చెబుతున్నారు. ఏడాదికి క్రితం 50 కిలోల పీవోపీ బ్యాగ్ 250రూపాయలు ఉండగా... ప్రస్తుతం 600రూపాయలకు పైగా ఉంది. గతంలో కొబ్బరి పీచు 50కిలోల బండిల్..300రూపాయల వరకు ఉండగా.. ప్రస్తుతం 700రూపాయల వరకు పలుకుతోంది. నాలుగు అడుగులు, ఆపైన విగ్రహాలకు స్టీల్ అవసరం ఉంటుంది. స్టీల్ ధర గతేడాదితో పోల్చితే రెట్టింపయింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి విగ్రహాలు తయారు చేస్తున్న కూలీల రేట్లు కూడా పెరిగాయని తయారీదారులు చెబుతున్నారు.