బీజేపీ విజయ సంకల్ప సభకు సర్వం సిద్ధం
BJP: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో సా. 6 గంటలకు సభ
BJP: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో విజయ సంకల్ప సభకు సర్వం సిద్ధమైంది. సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్టేట్ బీజేపీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హైదరాబాద్‌లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముగింపు సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో సాయంత్రం 6 గంటలకు విజయ సంకల్ప సభ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. పది లక్షల మందితో భారీ ఎత్తున సభకు సన్నాహాలు చేశారు.
బహిరంగ సభ వేదికపై ప్రధాని మోడీతో పాటు 40మంది ముఖ్య నేతలు ఆశీనులు కానున్నారు. ప్రధానికి ఒక వైపు నడ్డా, మరోవైపు బండి సంజయ్ ఉంటారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రాజ్‌నాథ్ సింగ్, కిషన్‌రెడ్డి, నితిన్ గడ్కరీతో పాటు బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు 18మంది వేదికపై కూర్చుంటారు. ప్రధాన వేదికకు ఎడమవైపున 103 మంది కూర్చుండేలాగ మరో వేదిక, కుడివైపున 70-80 మంది కూర్చుండేలాగ ఇంకో వేదిక ఏర్పాటు చేశారు.
బేగంపేట ఎయిర్ పోర్టుకు సాయంత్రం 6గంటల 15 నిమిషాలకు ప్రధాని మోడీ చేరుకుంటారు. అక్కడి నుంచి 6గంటల 20 నిమిషాలకు బయల్దేరి సభాస్థలికి 6గంటల 30 నిమిషాలకు చేరుకుంటారు. రాత్రి 7 గంటల 30 నిమిషాలకు సుమారు గంట పాటు ప్రజలను ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తారు.
అయితే విజయ సంకల్ప సభలో బీజేపీ అగ్రనేతలు ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. ఇటు తెలంగాణపై ఏమైనా ప్రకటన ఉంటుందా అన్న చర్చ సాగుతోంది. సభ విజయవంతం కోసం అన్ని జిల్లాల నుంచి భారీ స్థాయిలో జన సమీకరణ చేశారు. హైదరాబాద్‌కు తరలించేందుకు 18 ట్రైన్స్‌తో పాటు వందలాది ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాలు ఏర్పాటు చేశారు.