కేసీఆర్‌పై పోటీకి సై అంటున్న ఈటల
Etela Rajender: టీఆర్ఎస్ బాస్ కేసీఆర్‌పై ఈటల అస్త్రం ప్రయోగిస్తున్న బీజేపీ
Etela Rajender: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్‌పై పోటీకి సై అంటున్నారు. సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌లో గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసినట్లు ఈటల రాజేందర్ చెబుతున్నారు. గజ్వేల్‌లో బీజేపీ జెండా ఎగరేయడం, కేసీఆర్‌కు ఓటమి రుచి ఎలా ఉంటుందో చూపించడం టాస్క్‌గా పనిచేస్తున్నట్లు ఈటల స్పష్టం చేస్తున్నారు. ఒకప్పుడు టీఆర్ఎస్‌లో వెలుగువెలిగిన ఈటల రాజేందర్ అనూహ్య పరిస్థితుల్లో మంత్రి పదవి కోల్పోవడం, హుజురాబాద్‌లో బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచి టీఆర్ఎస్‌పై గెలవడం తెలంగాణ రాజకీయాల్లో ఒక చరిత్రగా నిలిచిపోయింది.
ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను ఈటల రాజేందర్ రూపంలో తిప్పి కొట్టేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. బీజేపీ హైకమాండ్ డైరెక్షన్ ప్రకారమే ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్‌పై సై అంటున్నారని, గజ్వేల్‌లో కేసీఆర్‌పై బలమైన అభ్యర్థిని నిలిపి టీఆర్ఎస్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే వ్యూహంగా కమలదళం అడుగులు వేస్తున్నట్లు టాక్ వస్తోంది.
బెంగాల్ సీఎం మమత బెనర్జీపై తృణమూల్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరిన సువేందును బరిలో నిలిపినట్లుగానే తెలంగాణలోనూ టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఈటలను కేసీఆర్‌పై అభ్యర్థిగా నిలపబోతున్నట్లు పార్టీలో ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ఈటల రాజేందర్ తాను కేసీఆర్‌పై గజ్వేల్‌లో పోటీకి సిద్దమైనట్లు చెబుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.