ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన నలుగురు నిందితుల మృతదేహాలను భారీ బందోబస్తు మధ్య రాత్రి మహబూబ్ నగర్ నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను గాంధీ ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. మృతదేహాల లోపలికి బాక్టీరియా వెళ్లే అవకాశం ఉందని ఫోరెన్సిక్ నిపుణులు అంటున్నారు. అయితే శుక్రవారం వరకు మృతదేహాలు గాంధీ ఆస్పత్రిలోనే ఉండనున్నాయి.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులైన మహ్మద్ ఆరిఫ్, జొల్లు నవీన్, చెన్నకేశవులు, జొల్లు శివలను పోలీసులు ఈ నెల 6న చటాన్‌పల్లి వద్ద ఎన్‌కౌంటర్ చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌పై విచారణకు హైకోర్టు ప్రత్యేక న్యాయవాదిని నియమించింది. దీంతో విచారణ నిమిత్తం శుక్రవారం వరకూ గాంధీ ఆస్పత్రిలోనే మృతదేహాలను భద్రపరచనున్నారు.