Revanth Reddy: నేడు ఇంద్రవెల్లిలో దళిత ఆత్మగౌరవ దండోరా సభ
Revanth Reddy: ఈరోజు నుంచి సెప్టెంబరు 17వరకూ జరిగే దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా
Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.. గిరిజన, దళిత ఆత్మగౌవర దండోరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇవాళ ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో దళిత ఆత్మగౌరవ దండోరా సభ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కాంగ్రెస్ శ్రేణులు పూర్తి చేశాయి. ఈ సభను విజయవంతం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. దండోరా సభకు లక్ష మందికి ఒక్కరు తక్కువైనా సీఎం కేసీఆర్‌కు గులాంగిరీ చేస్తామని ఇప్పటికే రేవంత్ ప్రకటించారు. కేసీఆర్ ఏడున్నరేళ్ల పాలనలో దళితులు, గిరిజనులకు జరిగిన మోసాలను ఎండగట్టేందుకే ఈ దళిత దండోరా సభను నిర్వహిస్తున్నామని చెప్పారు.
ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సభకు ప్రజలను పెద్ద సంఖ్యలో తరలించి, సభను విజయవంతం చేసేందుకు పార్టీ కార్యకర్తలంతా అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. రేపటి నుంచి సెప్టెంబరు 17వరకూ జరిగే దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరాలో ఏదో ఒకరోజున కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పాల్గొనే అవకాశముంది. వరంగల్‌ను రాహుల్ సభకు ఎంచుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సభలోనే హుజూరాబాద్ అభ్యర్థిని ప్రకటించవచ్చని కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది.
కేసీఆర్ అరాచక నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగానే దళిత,గిరిజన ఆత్మగౌరవ దండోరా జరుపుతున్నామని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల కోసం దళిత బంధు పేరుతో కొత్త నాటకం ఆడుతున్నారని ఆరోపిస్తున్నారు. కేసీఆర్‌కు ఎన్నికలు వచ్చినప్పడే దళిత, గిరిజన, అట్టడుగు వర్గాలు గుర్తుకు వస్తారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.