అంతా వాళ్లే చేస్తున్నారని శ్రీధర్‌ బాబు గుస్సా

Update: 2020-02-29 09:26 GMT
అంతా వాళ్లే చేస్తున్నారని శ్రీధర్‌ బాబు గుస్సా

కాంగ్రెస్ పార్టీలో ఆయనో సీనియర్ లీడర్. మాజీ మంత్రి. తెలంగాణ పిసిసి కాబోతున్నారంటూ ప్రచారం జరిగింది. మరోవైపు అధికార టీఆర్ఎస్‌లోకి కూడా వెళ్తున్నారంటూ మరో ప్రచారం మొదలయ్యింది. ఏకంగా డేట్‌ కూడా ఫిక్స్‌ చేశారంటూ, ఒక డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆయన మాత్రం వీటిపై ఎక్కడా స్పందించడం లేదు. బయట ఇంతగా ధూంధాం జరుగుతున్నా, ఆ మాజీ మంత్రిగారి మౌనరాగానికి కారణమేంటి?

దుద్దిళ్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంథని నియోజకర్గం ఎమ్మెల్యే. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌లో ఉన్న ఉన్నత శ్రేణి నాయకుల్లో ఒకరు. అంతేకాదు మొన్నటి అంసెబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. అయితే, శ్రీధర్ బాబుపై ఇటీవల వరుసగా ఏదోక ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ ఆయన మాత్రం ఈ ప్రచారాలపై ఎక్కడా స్పందించడం లేదు. మరోవైపు జరుగుతున్న ఈ ప్రచారాల్లో రాజకీయ కుట్ర ఉందంటున్నారు ఆయన అనుచరులు.

శ్రీధర్ బాబు తెలంగాణ కాంగ్రెస్‌ అద్యక్షుడిగా నియామకం అవుతారంటూ మొదటి నుంచీ ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పు జరుగుతుందని, పీసీసీ రేస్‌లో శ్రీధర్ బాబు కూడా ఉన్నారన్న ఊహాగానాలు వినిపించాయి. అయితే, పీసీసీ రేసులో తానున్నంటూ, కావాలనే తనపై ప్రచారం చేస్తున్నారని, నెగెటివ్‌గా కథలు అల్లుతున్నారన్నది శ్రీధర్ బాబు ఆవేదన.

ఇక శ్రీధర్ బాబు కాంగ్రెస్‌ను వీడి అధికార టీఆర్ఎస్‌లో చేరుతున్నట్టుగా మరో ప్రచారం జరుగుతోంది. నిజానికి ఇదిప్పుటి ప్రచారం కాదు. అసెంబ్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు టీఆర్ఎస్‌ కండువా కప్పుకున్న సమయంలోనే, శ్రీధర్ బాబు పేరు కూడా వినిపించింది. కానీ అప్పుడు ఆయన ఈ ప్రచారాన్ని తిప్పికొట్టారు. ఎట్టి పరిస్దితుల్లోనూ కాంగ్రెస్‌ను వీడేది లేదంటూ ప్రకటించారు. అయితే ఇప్పుడు మరోసారి శ్రీధర్ బాబుపై ఈ ప్రచారం స్టార్ట్ అయ్యింది. మార్చ్ 7న శ్రీధర్ బాబు ప్రగతి భవన్‌లో సిఎం కేసీఆర్‌ సమక్షంలో గలాబీ పార్టీలో చేరుతున్నారంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అంతే కాదు శ్రీధర్ బాబు విషయంలో మంత్రి ఈటెల రాజేందర్ మధ్యవర్తిగా మాట్లాడారంటూ కూడా ఊహాగానాలు వినపడ్తున్నాయి.

అయితే శ్రీధర్ బాబు కాంగ్రెస్‌ను వీడుతున్నారనే ప్రచారంలో నిజం లేకపోగా, ఆ ప్రచారం వెనక రాజకీయం ఉందంటున్నారు ఆయన అనుచరులు. పీసీసీ రేసులో శ్రీధర్ బాబు పేరు వినిపిస్తున్న క్రమంలో, కావాలనే కొందరు వ్యతిరేకులు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇందులో ఆయనకు పీసీసీ పదవి రాకుండా చేయాలనే రాజకీయ కుట్ర వుందంటూ అనుచరులు అంటున్నారు. ఈ ప్రచారం చేస్తున్న వారిలో, టీఆర్ఎస్ పార్టీతో పాటు సొంత పార్టీ నేతలు కూడా ఉన్నారంటూ మండిపడుతున్నారు.

ఇవన్నీ ఎలా ఉన్నా శ్రీధర్ బాబు మాత్రం మౌనంగా ఉంటున్నారు. ఈ ప్రచారాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారట. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానంటూ తనను కలిసిన కార్యకర్తలకు చెబుతున్నారట శ్రీధర్‌ బాబు. పరిస్థితులన్నీ కుదుటపడ్డాక, సరైన సమయంలో స్పందిస్తానని, తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నవారిని వదిలిపెట్టేదిలేదని రగిలిపోతున్నారట శ్రీధర్ బాబు.


Full View

 

Tags:    

Similar News