రేవంత్‌ కొత్త రూటు వర్కౌట్‌ అవుతుందా?

Update: 2020-02-19 08:38 GMT
రేవంత్‌ కొత్త రూటు వర్కౌట్‌ అవుతుందా?

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి, రూటు మార్చాలని డిసైడయ్యారా? స్పీడందుకోవడానికి గేరు మార్చాలని ఫిక్సయ్యారా? మార్పు మంచిదేనని భావిస్తున్నారా? ఇంతకీ ఆ మార్పేంటి? ఆ మార్పుతో రేవంత్‌ రెడ్డి భావిస్తున్న మలుపేంటి?

సొంత నియోజ‌క‌వ‌ర్గం కాక‌పోయినా కొడంగ‌ల్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ప‌నిచేసిన రేవంత్ రెడ్డి, ఇదే నియోజ‌క‌వ‌ర్గాన్ని త‌న స్వంత నియోజ‌క‌వ‌ర్గంగా మార్చుకున్నారు. 2009, 2014 ఎన్నిక‌ల్లో ఇక్కడి నుంచి ప్రతికూల ప‌రిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీ త‌ర‌పున గెలిచి, కొడంగ‌ల్‌ను త‌న అడ్డాగా మార్చుకున్నారు. రేవంత్‌ను దెబ్బకొట్టేందుకుగానూ కొడంగ‌ల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన టీఆర్ఎస్, 2018 ఎన్నిక‌ల్లో ఆయ‌న‌ను ఓడించింది. రేవంత్‌కు ఎదురేలేద‌నుకున్న కొడంగ‌ల్‌లో ఆయన ఓట‌మిని ఎవ‌రూ ఊహించ‌లేదు.

రేవంత్‌పై విజ‌యం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి ప‌ట్నం న‌రేంద‌ర్‌రెడ్డి, ఇప్పుడు కొడంగ‌ల్‌లో ప‌ట్టు పెంచుకుంటున్నారు. ఎమ్మెల్యేగా ఓడిన త‌ర్వాత మ‌ల్కాజ్‌గిరి ఎంపీగా గెలిచిన రేవంత్, గ‌తంలో మాదిరి కొడంగ‌ల్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టలేక‌పోతున్నారు. దేశంలోనే పెద్ద లోక్‌సభ నియోజ‌క‌వ‌ర్గమైన మ‌ల్కాజ్‌గిరికి ఎంపీ కావ‌డంతో, ఆయ‌న పూర్తి స‌మ‌యం ఇక్కడే కేటాయించాల్సి వ‌స్తోంది. మేడ్జల్, మాల్కాజ్ గిరిలో కూడా కాంగ్రెస్‌కు సరైన క్యాడర్ లేకున్నా, ఇప్పుడు పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టారు రేవంత్. క్యాడర్‌ను కలుపుకుని నియోజకవర్గ అభివృద్ది కోసం కృషి చేస్తున్నారు. యాక్సిడెంటల్‌గా మల్కాజిగిరి పార్లమెంట్‌కొచ్చిన రేవంత్‌, దీన్నే పర్మనెంట్‌ అడ్రస్‌గా మార్చుకోవాలని డిసైడయ్యారన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఇక్కడే ఏదో ఒక అసెంబ్లీ స్థానంలో, పోటీ చెయ్యాలని, రేవంత్ తపిస్తున్నట్టు మాటలు వినపడ్తున్నాయి. అయితే, కొడంగల్‌కు బైబై చెప్పడానికి, కొత్త నియోజకవర్గాన్ని వెతుక్కోవడానికి చాలా పరిణామాలు నిదర్శనంగా కనిపిస్తున్నాయి.

కొడంగల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రేవంత్‌రెడ్డిని ఓడించిన టీఆర్ఎస్, స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లోనూ దెబ్బ కొట్టింది. నియోజ‌క‌వ‌ర్గంలోని ఐదు మండ‌లాల్లో, నాలుగు జెడ్పీటీసీల‌ను గెలుచుకుంది టీఆర్ఎస్. మెజారిటీ ఎంపీటీసీలతో ఎంపీపీల‌ను కైవ‌సం చేసుకుంది. ఈ ఎన్నిక‌ల్లో రేవంత్ రెడ్డి ప్రచారం చేసినా, ఆయ‌న‌కు చేదు ఫ‌లితాలే వ‌చ్చాయి. తాజాగా మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లోనూ ఇవే ఫ‌లితాలు పున‌రావృత‌మ‌య్యాయి. కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని రెండు మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగిరింది. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లోనూ రేవంత్ వెళ్లి ప్రచారం చేసినా, చేదు అనుభవం తప్పలేదు. క్రమంగా నియోజ‌క‌వ‌ర్గంలో టీఆర్ఎస్ మ‌రింతగా బ‌ల‌ప‌డుతుండ‌టంతో, రేవంత్ రెడ్డి బ‌ల‌హీన‌ప‌డుతున్నారు. దీంతో ఆయ‌న కొడంగ‌ల్‌ను పూర్తిగా తమ సోదరుడికి వదిలేస్తారన్న ప్రచారం జోరందుకుంది.

2014లోనే టీడీపీ త‌ర‌పున మల్కాజిగిరి ఎంపీ సీటు కావాల‌ని, రేవంత్ రెడ్డి కోరినా, అప్పుడు మ‌ల్లారెడ్డికి ఇచ్చారు చంద్రబాబు. ఈసారి పార్లమెంటు ఎన్నిక‌ల్లో రేవంత్‌కు, అనూహ్యంగా అవ‌కాశం రావ‌డంతో ఎంపీగా గెలిచారు. కొడంగల్ నుంచి ఓడినా మాల్కాజ్ గిరి ఆయనకు కలిసొచ్చింది. ఈ నియోజకవర్గంలో ఆయన సామాజిక వర్గంతో పాటు టిడీపీ క్యాడర్ సానుభుతి ప్లస్సయ్యింది. కొద్దికాలంగా మ‌ల్కాజ్‌గిరి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఆయ‌న చురుగ్గా వ్యవ‌హ‌రిస్తున్నారు. దీంతో ఆయ‌న ఈ పార్లమెంటు ప‌రిధిలోనే ఏదైనా ఒక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎంచుకునే అవ‌కాశాలున్నాయన్నది జోరుగా సాగుతున్న చర్చ.

పార్లమెంటు ఎన్నిక‌ల్లో రేవంత్‌కు మెజారిటీ ఇచ్చిన నియోజకవర్గాలు ఉప్పల్‌, ఎల్బీన‌గ‌ర్‌. ఈ రెండు సెగ్మెంట్ల నుంచి రేవంత్‌కు భారీగా ఓట్లు పడ్డాయి. అయితే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి స‌రైన నాయ‌క‌త్వం లేదు. కొడంగ‌ల్‌ను వ‌దిలేస్తే ఈ రెండింటిలో ఏదైనా నియోజ‌క‌వ‌ర్గాన్ని రేవంత్ ఎంపిక చేసుకునే అవ‌కాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఏదేమైనా కొడంగ‌ల్ మాత్రం రేవంత్ రెడ్డికి అంత సేఫ్ సీట్ కాద‌నేది మాత్రం అర్థమవుతోంది. అందుకే తన పార్లమెంట్‌ పరిధిలోనే, ఏదోక అసెంబ్లీ సెగ్మెంట్‌ను సెట్‌ చేసుకోవాలన్నది రేవంత్‌ ఆలోచనగా తెలుస్తోంది.


Full View


Tags:    

Similar News