TS News: ఇవాళ తుక్కుగూడలో కాంగ్రెస్ జన జాతర సభ
TS News: లోక్‌సభ ఎన్నికకు ప్రచార శంఖారావాన్ని పూరించనున్న హస్తం పార్టీ
TS News: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ శంఖారావం పూరించబోతుంది. అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన ఉత్సాహంతో లోక్‌సభ ఎన్నికల్లోనూ రాష్ట్రంలో మెజార్టీ సీట్లు సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోంది. అందుకోసం అసెంబ్లీ ఎన్నికల సమరాన్ని ఏ వేదిక నుంచి ప్రారంభించిందో.. అదే వేదిక నుంచి లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించి సెంటిమెంట్‌ను రిపీట్ చేయాలని చూస్తోంది. హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో జనజాతర పేరుతో భారీ బహిరంగ నిర్వహించబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సభకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ ముఖ్యనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు.
తుక్కుగూడలో జరిగే జనజాతర సభకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. 60 ఎకరాల విశాలమైన మైదానంలో సభ జరగనుంది. జన జాతర సభకు సంబంధించి మూడు వేదికలతో సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై మూడు వందల మంది ప్రముఖులు కూర్చునే వీలుగా ఏర్పాట్లు చేశారు. వీవీఐపీ అతిధులతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అభ్యర్ధులు అందరు ప్రధాన వైదికపైనే ఉంటారు. రెండో వేదికపై పీసీసీ, డీసీసీ కార్యవర్గ ప్రతినిధులు ఆసీనులు కానున్నారు. మూడో వేదికపై వంద మంది కళాకారులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
అసెంబ్లీ ఎన్నికల విజయ పరంపరను కొనసాగిస్తూ త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త జోష్ కనిపిస్తోంది. ఆదిలాబాద్ మొదలు ఆలంపూర్ వరకు, జహీరాబాద్ నుంచి భద్రాచలం వరకు అన్నిగ్రామాలు, పట్టణాలు, నగరాల నుంచి ప్రజలను పెద్ద ఎత్తున తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కనీసం పది లక్షల మంది జనజాతరకు హాజరవుతారని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. మంత్రులు, ఎమ్మేల్యేలు, పార్లమెంట్ ఇంఛార్జిలు ,DCC అధ్యక్షులు, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు జన సమీకరణ భాద్యతలు అప్పగించింది పార్టీ. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభా ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఎంత పెద్ద మొత్తంలో ప్రజలు తరలివచ్చినా ఎటువంటి లోటుపాట్లు జరగొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మేనిఫెస్టో విడుదలతో పాటు దేశం మొత్తం జనజాతర సభ వైపు చూసేలా ఉంటుందన్నారు. ఒకటి, రెండు సీట్లకు మినహా అన్ని స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించడంతో.. తుక్కుగూడ సభతో ప్రచారపర్వాన్ని ప్రారంభించబోతున్నారు.