కార్పొరేషన్ చైర్మన్ల పదవుల భర్తీపై కాంగ్రెస్ ఫోకస్

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ పాలనతో పాటు కార్పొరేషన్ ఛైర్మన్ పదవులపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

Update: 2024-06-11 02:30 GMT

కార్పొరేషన్ చైర్మన్ల పదవుల భర్తీపై కాంగ్రెస్ ఫోకస్

దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగిసింది.. ఫలితాలు కూడా వచ్చేశాయ్. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ పాలనతో పాటు కార్పొరేషన్ ఛైర్మన్ పదవులపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. త్వరలోనే కార్పొరేషన్ ఛైర్మన్‌ నియమకాలు ఉంటుందనే చర్చ గాంధీభవన్‌ వేదికగా జరుగుతోంది. మరో వైపు ఆశావహులంతా సీఎం, మంత్రులు, కాంగ్రెస్ పెద్దల చుట్టూ తిరుగుతున్నారనే టాక్ వినిపిస్తోంది.

ఎన్నికల కోడ్ ముగియడంతో వీలైనంత త్వరగా అన్ని రకాల పదవులు భర్తీ చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ కసరత్తు స్టార్ట్ చేసింది. గతంలో ఎన్నికల కోడ్‌కు ఒక్క రోజు ముందే 37 మంది నేతలను కార్పొరేషన్ ఛైర్మన్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఓ హింట్ ఇచ్చింది. అయితే ఎన్నికల కోడ్ కారణంగా అధికారికంగా జీవో రిలీజ్ కాలేదు. అయితే గతంలో ఇచ్చిన 37 కార్పొరేషన్‌లకు తోడుగా మరో 17 కార్పొరేషన్ ఛైర్మన్లను నియమించే ఆలోచనలో సర్కార్ ఉన్నట్లు సమాచారం.

 ఇక కార్పొరేషన్ ఛైర్మన్ల పదవులపై రేవంత్ కసరత్తు చేస్తుందనే సమాచారంతో ఆశావహులంతా సీఎం రేవంత్, మంత్రులు, గాంధీభవన్‌ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలో తమకు పార్టీ ఇచ్చిన హామీలు, పార్టీ కోసం తాము చేసిన సేవను నేతల ముందు ప్రస్తావిస్తూ ఒత్తిడి చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కార్పొరేషన్ ఛైర్మన్ల కోసం రాష్ట్ర నేతలతో పాటు ఢిల్లీలోని ముఖ్య నేతలతోనూ ఆశావహులు లాబీయింగ్ చేస్తున్నారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే కార్పొరేషన్ ఛైర్మన్ల ఎంపిక మరింత ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది.

 ఇప్పటికే ప్రకటించిన 37 మంది ఛైర్మన్‌లు కాకుండా కొత్తగా ప్రకటించబోయే 17 కార్పొరేషన్ పదవుల కోసం చాలా మంది నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ ఉంది. ఇందులో పార్టీలో వివిధ హోదాలో పనిచేసిన నేతలు కూడా కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఆశిస్తున్నారు. అంతేకాకుండా పార్టీలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చినవారు సైతం వివిధం పోస్టుల కోసం ట్రై చేస్తున్నారు. అయితే సామాజిక సమీకరణాలు, పార్టీకి విధేయత అన్న అంశాల ఆధారంగా ఎంపిక చేస్తారనే ప్రచారం ఉంది. అయితే పోస్టులు తక్కువగా ఉండడం, ఆశావహులు మాత్రం ఎక్కువ సంఖ్యలో ఉండడంతో నామినేటెడ్ పదవుల భర్తీ కాంగ్రెస్ సర్కార్‌కు కత్తిమీద సాములా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆలస్యం చేస్తే నేతల్లో అసంతృప్తి పెరిగే అవకాశముందని పార్టీ భావిస్తోంది. ఏదేమైనా ఈ నెల 15 లోపు కార్పొరేషన్ ఛైర్మన్ల ఎంపికను పూర్తి చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

Tags:    

Similar News