Assembly Elections 2023: ఎన్నికల రంగలోకి దిగనున్న గులాబీ బాస్ కేసీఆర్
CM KCR: 17న సిద్దిపేట,సిరిసిల్ల, 18న జడ్చర్ల, మేడ్చల్ సభల్లో పాల్గొననున్న కేసీఆర్
CM KCR: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సంరంభం ప్రారంభమైంది. ప్రచారానికి గులాబీ బాస్ రంగంలోకి దిగుతున్నారు. కొద్దిరోజులుగా ఆరోగ్య రీత్యా కామ్‌గా ఉన్న కేసీఆర్.. భారీ బహిరంగసభలతో అదరగొట్టనున్నారు. మాటల మాంత్రికుడిగా పేరొందిన కేసీఆర్... ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా మళ్లీ ఎన్నికల రణ నినాదం చేయనున్నారు. మాటల మంత్రాలతో 17 రోజుల్లో 42 సెగ్మెంట్లలో ఎన్నికల ప్రచారసభలు ఏర్పాటు చేసేందుకు షెడ్యూలు ఖరారు చేశారు. రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్... హ్యాట్రిక్ దిశగా ప్లాన్ చేసింది. రోజుకు రెండు సభలకు తక్కువ కాకుండా గులాబీ బాస్ ఒక్కో నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు. ఓటర్లను ఆకట్టుకునేలా అక్టోబరు 15న పార్టీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు కేసీఆర్...
రానున్న ఎన్నికల్లో విజయం సాధించే దిశగా బీఆర్‌ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కొట్లాడి తెలంగాణ తెచ్చిన పార్టీగా.. సొంత ఇమేజ్‌ని కాపాడుకుంటూ హ్యాట్రిక్ విక్టరీ చేజిక్కించుకోవాలన్న టార్గెట్‌తో గులాబీ పార్టీ దూసుకెళుతోంది. ప్రతిపక్షాలకంటే చాలా ముందే అభ్యర్థులను ప్రకటించి... వారికి సవాల్ విసిరింది బీఆర్‌ఎస్.... సిట్టింగుల్లో కొందరిపై వ్యతిరేకత ఉన్నా.. కేసీఆర్ చరిష్మాకు తోడు ప్రభుత్వ పథకాలతో ప్రజలు మళ్లీ తమకే పట్టం కడతారన్న నమ్మకంతో ఆ పార్టీ ఉంది. విపక్షాలు బలం పుంజుకున్న చోట తనదైన వ్యూహంతో బీఆర్‌ఎస్ ముందుకెళుతోంది.
ఈసారి కేసీఆర్ వ్యూహాత్మకంగా ఆడుగులు వేస్తున్నారు.. రెండు చోట్ల పోటీ చేయాలనుకోవడం అందులో భాగమే... ఇప్పటికే ప్రాతనిధ్యం వహిస్తున్న గజ్వేల్‌తోపాటు.. కామారెడ్డి నుంచి పోటీకి కేసీఆర్ నిర్ణయించుకోవడం ఆ వ్యూహంలో భాగమే అంటున్నారు. కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతోపాటు చుట్టుపక్కల జిల్లాలపైన కూడా ఎఫెక్ట్ ఉంటుందనేది బీఆర్‌ఎస్ అధినేత అంచనా.... అందుకే మొదటి నుంచి సీఎం కేసీఆర్ తమకు కంచుకోటలా ఉన్న ఉత్తర తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.
కేసీఆర్‌కు తోడుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీష్‌రావు పలు నియోజకవర్గాల పర్యటనలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ రావడంతో అధినేత కూడా రంగంలోకి దిగనున్నారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. తాము అధికారంలోకి రాకముందు... వచ్చిన తర్వాత... మార్పును ప్రజలు గమనించాలని కోరుతోంది బీఆర్ఎస్.... అధికారంలోకి రావాలని తాపత్రయపడుతున్న కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రజలకు ఏం చేశారని బీఆర్‌ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
బీజేపీ అగ్రనేతలు రంగంలోకి దిగడం... కాంగ్రెస్ హామీలతో బీఆర్‌ఎస్ కూడా మరిన్ని ప్రజాకర్షక హామీలు, పథకాలకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 15న తెలంగాణ భవన్‌లో పార్టీ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేయనున్నారు కేసీఆర్... దాంతోపాటు పార్టీ మేనిఫెస్టో విడుదల చేసి.. విపక్షాల ఎత్తులను చిత్తు చేయాలనుకుంటోంది గులాబీ పార్టీ.... రెండు సార్లు అధికారంలో ఉండటంతో సహజంగా ఉండే ప్రజావ్యతిరేకతతో నష్టం జరగకుండా చూసుకునే ఎత్తుగడ వేస్తోంది బీఆర్ఎస్... ఎంఐఎం మద్దతుతో మైనారిటీ ఓటు బ్యాంకు చేజారకుండా జాగ్రత్తపడే ప్రయత్నాల్లో ఉంది. కాంగ్రెస్, బీజేపీ రెండింటినీ టార్గెట్ చేసుకుంటూ ప్రచారంలో స్పీడ్ పెంచారు బీఆర్‌ఎస్ అగ్రనేతలు...
అందరికంటే ముందుగా ఆగస్టు 15న 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు కేసీఆర్.... దీంతో ఆయా సెగ్మెంట్లలో అభ్యర్థులు రంగంలోకి దిగి ప్రచారాన్ని ప్రారంభించారు.. ఇప్పటికే 50 రోజుల పాటు ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు.. ప్రచారం కోసం ఎంతో ఖర్చు చేశారు. ఎన్నికల షెడ్యూలు విడుదల కాగానే ప్రచారం ముమ్మరం చేశారు. ఇంకా 50 రోజులపాటు బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారం కొనసాగించాల్సిందే.. ఈ నేపథ్యంలో ప్రచారం కోసం ఇంకా ఖర్చు చేయాల్సిందే.. అంటే మిగితా రెండు పార్టీలు ఇప్పటివరకు అభ్యర్థులను పూర్తిస్థాయిలో ప్రకటించలేదు. అంటే ఆ ఇరు పార్టీలకన్నా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎక్కువ ఖర్చు చేయాల్సిందే..
ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో.. సీఎం కేసీఆరే రంగంలోకి దిగనున్నారు. వరుస బహిరంగ సభలు.. ఎమ్మెల్యే అభ్యర్థులతో భేటీ.. వ్యూహాలకు ప్రతివ్యూహాలను రచిస్తూ.. విపక్ష పార్టీలకు సవాల్ విసరనున్నారు.. తాను సెంటిమెంట్‌గా భావించే హుస్నాబాద్ నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు కేసీఆర్... 16న జనగాం, భువనగిరి, 17న సిద్దిపేట, సిరిసిల్ల బహిరంగ సభల్లో, 18 జడ్చర్ల, మేడ్చల్ నియోజకవర్గాల పరిధిలో కేసీఆర్ ప్రచారం చేయనున్నారు.
మొత్తానికి గులాబీ పార్టీ అభ్యర్థులంతా ఇప్పటికే అధినేత రాక కోసం ఎదురు చూస్తున్నారు.. ఆయన ప్రచారానికి వస్తే అంతా సర్దుకుంటుందనే ధీమాలో ఉన్నారు బీఆర్ఎస్ నేతలు.. తమ అధినేత ఆ ప్రచార సభలను విజయవంతం చేసేందుకు రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళుతున్నారు.