CM KCR: ఇవాళ బెంగళూరుకు సీఎం కేసీఆర్... మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ
KCR Bangalore Tour: *మాజీ ప్రధాని దేవెగౌడ, కుమారస్వామితో భేటీ *తాజా రాజకీయాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ
KCR Bangalore Tour: జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే పలు దఫాలుగా కీలక నేతలతో సమావేశం అయ్యారు. బీజేపీ, కాంగ్రెస్‌యేతర ప్రత్యామ్నాయ కూటమిపై మంతనాలు జరిపారు. ఇందులోభాగంగా తాజాగా సీఎం కేసీఆర్ ఇవాళ బెంగళూరు వెళ్లనున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 10 గంటలకు బయలుదేరి వెళ్తారు. గురువారం 12.30 గంటలకు మాజీ ప్రధాని దేవెగౌడ నివాసానికి కేసఈార్ చేరుకుంటారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు, జాతీయ రాజకీయాలు, రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై దేవెగౌడ, కుమారస్వామితో చర్చిస్తారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా బెంగళూరులో కటౌట్‌తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దేశ్‌కి నేత అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. కేసీఆర్ బెంగళూరు పర్యటనలో పలు అంశాలు చర్చకు రానున్నాయి. త్వరలో జరగనున్న రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు అంశాన్ని కూడా చర్చించనున్నారు.
ఇటీవల కేసీఆర్ ఆలిండియా పర్యటనకు కేసీఆర్ శ్రీకారం చుట్టారు. దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి అక్కడి సీఎం కేజ్రీవాల్‌తో మంతనాలు జరిపారు. పంజాబ్‌లో సాగు చట్టాల ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు, అమర జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. ఢిల్లీలో సర్వోదయ స్కూల్‌ను సీఎం కేజ్రీవాల్‌తో కలిసి సందర్శించారు. ఢిల్లీలో సీఎం కేసీఆర్ కేజ్రీవాల్‌తో పాటు , ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు. బీజేపీ, కాంగ్రెస్ యేతర ప్రత్యామ్నాయ కూటమిపై సమాలోచనలు జరిపారు.
గతకొంతకాలంగా బీజేపీ తీరుపై సీఎం కేసీఆర్ మండిపడుతున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఇరుపార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. మరోవైపు రేపు ప్రధాని మోదీ..హైదరాబాద్‌కు వస్తున్నారు. ఈక్రమంలోనే ప్రధాని టూర్ నుంచి దూరంగా ఉండేందుకే బెంగళూరుకు వెళ్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల పలు సందర్భాల్లో ఇదే జరిగింది. సమతామూర్తి ప్రారంభోత్సవం సందర్భంలోనూ ప్రధాని టూర్‌కు సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. దీనిపై అప్పట్లో రాజకీయ దుమారం రేగింది. బెంగళూరు టూర్ తర్వాత కేసీఆర్ మరోసారి తమిళనాడు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.