కేసీఆర్ మూడు అక్షరాలు మూడున్నర కోట్ల ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక

Update: 2020-02-17 06:31 GMT
కేసీఆర్ మూడు అక్షరాలు మూడున్నర కోట్ల ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక

కేసీఆర్..ఓ రాష్ర్టానికి ముఖ్యమంత్రి మాత్రమే కాదు సకల జనులను సమరబాట పట్టించి తెలంగాణ ప్రత్యేక రాష్ర్టం సాధించిన ధీరుడు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని చావు చివరిదాక వెళ్లి తెలంగాణ ప్రజలకు స్వేచ్చ ప్రసాధించిన విముక్తి ప్రథాత. అంతటి మహోన్నత ఉద్యమ శిఖరం 66 వసంతాలను పూర్తి చేసుకుని 67వ వడిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్.

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు క్లుప్తంగా కేసీఆర్. ఈ మూడు అక్షరాలు మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అయ్యింది. ప్రత్యేక తెలంగాణ రాష్టానికి పర్యాయపదం. ప్రత్యేక రాష్ట సాధన నుంచి తెలంగాణను అగ్రభాగంలో నిలపడం వరకు అహో రాత్రులు తెలంగాణ గురించే పరితపించే పని పిపాసి. ఉద్యమమే జీవితమని ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్ని కంతుల వంతెనపై ప్రయాణం సాగించి తెలంగాణను సాధించారు. ఎన్నికలు, ఉప ఎన్నికలు, ఉద్యమాలు, రాజీనామాలతో వ్యూహం పన్ని తెలంగాణను సాధించి పెట్టారు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏనాడు రాజీపడలేదు. ఢిల్లీ పాలకులను ఒప్పించేందుకు హస్తినలో 36 పార్టీల మద్దతు కూడగట్టిన ఏకైక ప్రాంతీయ నేత కేసీఆర్ నిలిచారు.

భారత దేశ చిత్రపటంలో తెలంగాణను చిత్రీకరించిన చిత్రకారుడు కేసీఆర్. 2001 నుంచి 2004 వరకు అసెంబ్లీలో ఒక్కడే అయినా వెనక్కు తగ్గకుండా తెలంగాణ స్వరాన్ని వినిపించారు. 2009 నుంచి 2014 వరకు పార్లమెంటులో ఇద్దరు ఎంపీలతోనే ప్రత్యేక రాష్ట ఆకాంక్షకు దేశ మద్దతు కూడగట్టారు. తన వాక్చాతుర్యంతో యావత్ పార్లమెంటునే స్థంబింప చేశారు. ఉద్యమ సారధిగానే గాక చక్కటి పరిపాలన దక్షుడిగా నిరుపించుకున్నారు. తెలంగాణ వచ్చేనా అనే అనుమానం వ్యక్తం చేసినోల్లతోనే తెలంగాణ నిలిచి గెలిచింది దేశానికే దిక్సుచిగా నిలిచింది అని కీర్తింప చేసిన అంతటి మహోన్నత వ్యక్తి కేసీఆర్ 66 వసంతాలు పూర్తి చేసుకుని 67 వసంతంలోకి అడుగు పెడుతుండటంతో యావత్ తెలంగాణ సంబరాలు చేసుకుంటుంది. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కించుకుని పార్టీ, ప్రభుత్వ యంత్రాంగమంతా మొక్కలు నాటుతూ హరిత తెలంగాణ కార్యక్రమాన్ని చేపట్టింది.

కేసీఆర్ జీవితం వడ్డించిన విస్తరి కాదు. పెద్ద కుటుంబంలో పుట్టినప్పటికీ సొంత మేలు కోరుకోలేదు. సామజహితమే తన హితమని చిన్న వయస్సు నుంచే ప్రజా సేవకు అంకితమయ్యారు. విద్యార్ధి దశలోనే రాజకీయాల్లో చురుగ్గా ఉండే వారు. విద్యార్ధి సంఘం అధ్యక్ష పదవికి పోటీ చేసి పోరాట దీక్షను కనబరిచారు.

ఉమ్మడి మెదక్ జిల్లాలోని చింతమడక గ్రామంలో 1954 ఫిబ్రవరి 17న రాఘవరావు, వెంకటమ్మ దంపతులకు జన్మించారు కేసీఆర్. కేసీఆర్ కుటుంబం ఎగువ మానేరు డ్యాం నిర్మాణంలో భూమి కోల్పోయి చింతమడక గ్రామానికి వచ్చి స్థిరపడింది. సిద్ధిపేట డిగ్రీ కళాశాలలో చరిత్ర, రాజనీతి శాస్త్రం, తెలుగు సాహిత్యం సబ్జెక్టులుగా బి.ఎ. పూర్తిచేసారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎం.ఎ తెలుగు సాహిత్యం పూర్తి చేశారు.

నాటి కాంగ్రెస్ నాయుకుడు అనంతుల మదన్ మోహన్ శిశ్యుడిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టి 70వ దశకంలో యువజన కాంగ్రెస్ నాయకుడిగా కొనసాగారు. 1982లో తాను ఎంతగానో అభిమానించే ఎన్టీ రామారావు పార్టీ పెట్టడంతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. 1983 ఎన్నికల్లో తన రాజకీయ గురువు మదన్ మోహన్‌పైనే పోటీచేసి గట్టి పోటీనిచ్చి 877 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అయినా వెనకకు తిరగలేదు. 1985లో తెలుగుదేశం తరఫున సిద్దిపేట నుంచి రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. ఇది కేసీఆర్ రాజకీయ జీవితంలో తొలి విజయం. ఆ తరువాత 1989, 1994, 1999, 2001 ఉప ఎన్నికలు ఇలా 2018 వరకు వరుసగా గెలుస్తూ వస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్ని జిల్లాలు మారినా, ఏ నియోజకవర్గం నుంచి పోటి చేసినా తెలంగాణ ప్రజలు అక్కున చేర్చుకుని అఖండ విజయాన్ని అందించారు.

1987-88 కాలంలో రాష్ట్ర మంత్రి గా, 1992-93లో పబ్లిక్ అండర్ టేకింగ్ చైర్మెన్ గా 1997-98లో రవాణా శాఖ మంత్రిగా పనిచేసి తన సత్తా చాటారు. 1999-2001 కాలంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర శాసనసభ డిప్యూటి స్పీకర్ పదవి కట్టబెట్టినా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి విద్యుత్ చార్జీలు తగ్గించాలని తెలంగాణ ప్రజలు చేసిన పోరాటానికి మద్దతుగా ప్రత్యేక తెలంగాణ జెండా చెతబట్టారు. 2001 ఏప్రిల్ 21 నాడు టీడీపీ సభ్యత్వానికి, డిప్యూటి స్పీకర్ పదవికి రాజీనామా చేసారు. 2001 ఏప్రిల్ 27న నూతనంగా ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశాడు.

తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో ఉద్యమ నేతకే ప్రజలు అధికారం కట్టబెట్టారు. తెలంగాణ సాధనలో ఆయన పాత్రను గుర్తించిన ఓటర్లు కాంగ్రెస్ ను కాదని కేసీఆర్ ను గెలిపించారు. 119 అసెంబ్లీ సీట్లను టీఆర్ఎస్ 63 స్థానాలు గెలుచుకుని సాధరణ మేజారిటిని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండో సారి విజయదుందుబి మోగించి విపక్షాలను చిత్తు చేసి అధికార పీఠంపై కూర్చుకున్నారు.

ప్రజల నాడిని పట్టుకోవడంలో విపక్షాలను చిత్తు చేయడంలో చక్కటి వ్యూహకర్తగా కేసీఆర్ పేరు గాంచారు. తెలంగాణలో అమలవతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ పథకాలను అధ్యయనం చేసేందుకు ఎన్నో రాష్టాలు క్యూ కడుతున్నాయి. ఇదే అదనుగా జాతీయ రాజకీయాలను శాసించేందుకు కేసీఆర్ బయలు దేరారు. ప్రాంతీయ పార్టీల కూటమిని ఏకం చేసే దిశలో ఫెడరల్ ఫ్రంట్ కు ప్రాణం పోసారు. 66 వ జన్మదినం జరుపుకుంటున్న శుభ సందర్భాన కేసీఆర్ మరిన్ని విజయాలు సాధించాలని Hmtv మనసారా కోరుకుంటుంది. కేసీఆర్ సార్..వన్స్ అగైన్ హ్యాపి బర్త్ డే.

Tags:    

Similar News