తెలంగాణ బీజేపీలో పదవుల చిచ్చు.. ఒకరిపై ఒకరు మాటల దాడి..

BJP President Post: తెలంగాణ కాషాయ పార్టీలో పదవుల చిచ్చు తారా స్థాయికి చేరింది. కొత్త, పాత నేతల మధ్య రగడ మొదలయ్యింది.

Update: 2024-06-24 06:19 GMT

తెలంగాణ బీజేపీలో పదవుల చిచ్చు.. ఒకరిపై ఒకరు మాటల దాడి..

BJP President Post: తెలంగాణ కాషాయ పార్టీలో పదవుల చిచ్చు తారా స్థాయికి చేరింది. కొత్త, పాత నేతల మధ్య రగడ మొదలయ్యింది. పార్టీలో అంతర్గతంగా కోల్డ్ వార్ జరుగుతుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కొత్త నేతలకు పార్టీ టికెట్లు ఇచ్చారు ఎంపీలు.. ఎమ్మెల్యేలు అయ్యారు. పాత వాళ్లకు పార్టీ పదవులు కట్టబెట్టాలని చర్చ జరుగుతుంది. బీజేపీ అద్యక్ష పదవికి పోటీ పడుతున్న వారు ఎవరికి వారు తమ లాబియింగ్ ముమ్మరం చేసుకుంటున్నారు. ఒకరికొకరు పోటీ పడుతూ ఒకరి ప్రయత్నాలకు ఒకరు గండికొడుతున్నారు. ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకుంటున్నారు. తెలంగాణ బిజెపి పగ్గాలు ఎవరికి చిక్కుతాయనేది ఆసక్తిని పెంచుతోంది.

పార్టీలో రోజు రోజుకు కొత్త పాత నేతల మధ్య పంచాయతీ ముదురుతుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు నియామకం కోసం కీలక నేతలు పోటీ పడుతుండగా ఈటల రాజేందర్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ నుంచి ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు కట్ట బెట్టారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డిని బొగ్గు గనుల శాఖ మంత్రిగా మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాద్యతలు అప్పగించారు. కీలకమైన పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి విపరీతంగా పోటీ పెరిగింది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేస్‌లో ఈటల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో పాత నేతలు కొత్త డిమాండ్ ను తెరమీదకు తీసుకు వస్తున్నారు. దేశం పట్ల, ధర్మంపట్ల అవగానహన ఉండి అగ్రసివ్ గా ప్రజల పక్షాన పోరాటం చేసి పార్టీలోని అందరు నేతలను కలుపుకుపోయే నేతనే బీజేపీ రాష్ట్ర రథసారధిగా ఎంపిక చేయాలని జాతీయ నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎంపిక చేయాలని గోషామల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అధిష్టానానికి సూచించారు.

అధ్యక్ష పదవి రేసులో ఉన్న నేతలు సొంత నేతలపైనా కౌంటర్ అటాక్ చేస్తున్నారు. ఎలాంటి ఫైటర్ కావాలో చెప్పాలంటూ ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. గల్లీ ఫైటర్ కాదు కుంభస్థలం మీద కొట్టే దమ్మున్నోడు కావాలని అంతే వేగంగా ఈటల సమాధానం చెప్పారు. సందర్భం వస్తే జేజమ్మతో అయినా కొట్లాడేటోల్లమంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఐదుగురు ముఖ్యమంత్రులతో కొట్లాడానని ఈటల రాజేందర్ తనదైన శైలిలో కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆర్గనేజేషన్ ఎలా నడపడం పార్టీని ఏ రకంగా బలోపేతం చేయడం పాత నేతలకు బాగా తెలుసనని. పాత నేతలకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే రాష్ట్రంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని బీజేపీ జాతీయ దూతల దగ్గర పాత నేతలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. జాతీయ నాయకత్వం కొత్త నేతలకు అవకాశం కల్పిస్తుందా? లేదా మొదటి నుండి పార్టీలో ఉన్న నేతలకు అవకాశం ఇస్తుందా? కొత్త అధ్యక్షుడు ఎంపికతోనైనా బీజేపీలో అంతర్గత విభేదాలు పరిష్కారం అవుతాయా? లేవా ?అన్నది వేచి చూడవలసిందే.

Tags:    

Similar News