Election Commission: తెలంగాణపై సెంట్రల్ ఈసీ స్పెషల్ నజర్.. అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని వేటు వేసిందా..?
Election Commission: ఎన్నికల ప్రక్రియలో భాగంగా మార్పులు జరిగాయా..?
Election Commission: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడానికి నిర్మాణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే హైదరాబాద్‌లో పర్యటించిన కేంద్ర ఎన్నికల బృందం.. రాష్ట్రంలో అధికారుల పని తీరుపై అరా తీసింది. అధికారుల తీరుపై సంతృప్తి చెందని సెంట్రల్ ఈసీ వారిని బదిలీ చేస్తున్నట్టు ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఐదు రోజుల క్రితం ఈసీ బృందం రాష్ట్రంలో పర్యటించిన సమయంలోనే పలువురి ఉన్నతాధికారుల ప్రొఫైళ‌్లను తిరగేసిందని.. అందులో రీమార్కులను సైతం గుర్తించిందని.. పలువురు అధికారుల వ్యవహారాలపై నజర్ వేసినట్టు ప్రచారం జరిగింది. అయితే.. దాని పర్యావసానమే 13 మంది అధికారులపై బదిలీ వేటు పడినట్టు తెలుస్తుంది.
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు విడుదలైన రెండు రోజుల్లోనే కేంద్ర ఎలక్షన్ కమిషన్ తనదైన శైలిలో అధికారులపై చర్యలు తీసుకుంది. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఐఏఎస్, ఐపీఎస్, నాన్-కేడర్ ఎస్పీలపై బదిలీ వేటు వేసింది. వారు ప్రస్తుతం నిర్వర్తిస్తున్న బాధ్యతలను తక్షణం జూనియర్లకు అప్పగించాల్సిందిగా ఆదేశించింది. ఎన్నికలకు సమర్ధులైన, సీనియర్ అధికారుల జాబితాను 24 గంటల వ్యవధిలోనే పంపించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ పోలీసు కమిషనర్లతో పాటు తొమ్మిది జిల్లాల నాన్-కేడర్ ఎస్పీలు, నాలుగు జిల్లాల కలెక్టర్లు, మూడు శాఖల కార్యదర్శులను ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించింది. కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు వచ్చిన నిమిషాల వ్యవధిలోనే చీఫ్ సెక్రటరీ శాంతికుమారి స్పందించి ముగ్గురు పోలీసు కమిషనర్లు, పది జిల్లాల ఎస్పీలను వారిని బాధ్యతల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వారికి ఎలాంటి కొత్త బాధ్యతలు ఇవ్వకుండా హోల్డ్‌లోనే పెట్టారు. ప్రస్తుతం వారు నిర్వహిస్తున్న బాధ్యతలను క్రింద స్థాయి అధికారులకు అప్పగించాలని ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే బాధ్యతలు స్వీకరించినవారంతా.. ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని సూచించారు. సీఎస్ నుంచి జీవో విడుదలైన వెంటనే డీజీపీ సైతం సర్క్యులర్ విడుదల చేశారు.
డీజీపీ సర్క్యులర్‌లో పేర్కొన్న అధికారుల్లో.. హైదరాబాద్ సీవీ. ఆనంద్, వరంగల్ సీపీ ఏవీ. రంగనాధ్, నిజామాబాద్ సీపీ వీ. సిత్యనారాయణ, లతో పాటు.. సూర్యాపేట ఎస్పీ ఎస్. రాజేంద్ర ప్రసాద్, కామారెడ్డి నాన్ కేడర్ ఎస్పీ బి. శ్రీనివాస్ రెడ్డి, సంగారెడ్డి అడిషనల్ ఎస్పీ రమణకుమార్, జగిత్యాల ఎస్పీ ఏ భాస్కర్, మహబూబ్ నగర్ ఎస్పీ కే. నర్సింహా, నాగర్ కర్నూల్ ఎస్పీ కే. మనోహర్, గద్వాల ఎస్పీ కే. సృజన, మహబూబాబాద్ ఎస్పీ జి చంద్రమోహన్, నారాయణపేట ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు, భూపాలపల్లి ఎస్పీ కరుణాకర్‌లను ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించింది. గతంలో జరిగిన ఉప ఎన్నికల సమయంలో కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వివాదాల్లో ఇరుక్కున్నారు. రూలింగ్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించినట్టు వారిపై ఆరోపణలు వచ్చాయి. హుజూర్‌నగర్, మునుగోడు, హుజూరాబాద్ ఉప ఎన్నికల టైమ్‌లో కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు అధికార పార్టీకి పాజిటివ్‌గా పనిచేశారని ఇప్పుడు వేటుకు గురైన అధికారులపై ఫిర్యాదులు వచ్చాయి.
ఉన్నపళంగా ఇంత మంది ఉన్నతాధికారులను బదిలీ చేయడానికి కారణమేంటన్నదే ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తుంది. అయితే.. తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని, వారి కనుసన్నల్లో మెరుగుతున్నారని కేంద్ర ఎన్నికల బృందం హైదరాబాద్ లో మూడు రోజుల పాటు రివ్యూ చేయడానికి వచ్చిన సమయంలో ముగ్గురు అధికారులపై పలు పార్టీల నేతలు ఫిర్యాదు చేశారు. షెడ్యూల్ విడుదల చేసిన రోజు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ కొద్దిమంది అధికారుల తీరు సక్రమంగా లేదని, వారిపైన కంప్లైంట్లు వచ్చాయని, ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ భారీ బదిలీలకు ఇదే ముఖ్య కారణంగా తెలుస్తుంది.
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు ఈ నెల 3-5 తేదీల మధ్యలో రాష్ట్ర పర్యటనకు వచ్చిన సమయంలో విపక్షాలు హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ పోలీసు కమిషనర్లపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశాయి. ఆ ముగ్గురూ ఎన్నికల విధుల్లో కొనసాగితే పారదర్శకత ఉండదని, నిష్పక్షపాతంగా జరగవన్న ఆందోళనను చీఫ్ కమిషనర్ దగ్గర వ్యక్తం చేశారు. ఈ ముగ్గురు సీపీలు అధికార పార్టీకి ఏయే సందర్భాల్లో అనుకూలంగా వ్యవహరించారో కొన్ని ఉదాహరణలను పేర్కొని దానికి తగిన ఆధారాలను ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో ప్రస్తావించినట్లు తెలుస్తుంది. అయితే.. ఎన్నికల సంఘం తాజాగా బదిలీ వేటు వేసిన ఆఫీసర్లపై గతంలోనూ అనేక ఫిర్యాదులు ఉన్నాయి. వారి గత పనితీరుపై ఈసీ రిపోర్టు తెప్పించుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.