సూర్యాపేట మార్కెట్‌లో కరోనా సస్పెన్స్ థ్రిల్లర్.. ఎక్కడ తీగలాగితే ఎక్కడ డొంక కదిలింది?
సూర్యాపేట మార్కెట్‌లో కరోనా లింకు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించింది. ఒకరి నుంచి మరొకరికి ఎలా పాకుతూపోయిందో అధికారులకు ఎవ్వరీకి అర్థంకాలేదు. కానీ చాలా చాకచక్యంగా వైరస్‌ను బ్రేక్ చేశారు అధికారులు. కరోనా లింకును చేధించడంలో శభాష్ అనిపించుకున్నారు. వారు కరోనా లింకును వారు చేధించిన విధానం, ఇఫ్పుడు ఒక కేస్ స్టడీగా మారింది. అసలు సూర్యాపేట వైరస్ లింకేంటి? చైన్‌ను ఎలా బ్రేక్ చేయగలిగారు?
సూర్యాపేట మార్కెట్‌లో కరోనా సస్పెన్స్ థ్రిల్లర్. ఒకరి నుంచి మరొకరికి పాకుతూపోయిన వైరస్. ఎవరికి ఎలా సోకిందో అర్థంకాక తర్జనభర్జన. ఆసక్తికరంగా సాగిన కిరాణా వ్యాపారిపై శోధన. చాకచక్యంగా లింకును చేధించిన అధికారులు. సూర్యాపేట అధికారులపై ప్రశంసల జల్లు. సూర్యాపేట యంత్రాంగం ఎలా ట్రేస్ చేసింది?ఎక్కడ తీగలాగితే ఎక్కడ డొంక కదిలింది?
సూర్యాపేట మార్కెట్. తొలి కరోనా కేసు. ఏప్రిల్ 2. సూర్యాపేటలో అప్పటి వరకు కరోనా అలికిడి లేదు. కానీ ఏప్రిల్ రెండో తేదీన తొలిసారి బయటపడింది వైరస్. ఆ కరోనా పాజిటివ్ బాధితుడు కూడా, ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వ్యక్తే. దీంతో వెంటనే అలర్టయిన స్థానిక అధికారులు, ఏమాత్రం ఆలస్యం చెయ్యలేదు. చకాచక అతని కాంటాక్ట్స్‌ను వెతికారు. ఎవరిని కలిశాడు, ఎక్కడ కలిశాడు, ఎంతమందిని కాంటాక్ట్ అయ్యాడు వంటి వివరాలు కూపీలాగారు.
సూర్యాపేటలో హాట్‌స్పాట్‌గా మారిన మార్కెట్ ఇదే. ఇక్కడ మెడికల్ షాపులో పని చేేసే ఒక యువకుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇతనికి ఎలా సోకిందని ఆరా తీస్తే, ఇందాకా చెప్పిన మర్కజ్ వెళ్లొచ్చిన వ్యక్తి ద్వారానే ఇన్‌ఫెక్ట్ అయ్యిందని అధికారులు తెలుసుకున్నారు. దగ్గూ, జ్వరం వుండటంతో మందుల కోసం రెండుసార్లు మెడికల్ షాపుకు వెళ్లి, మందులు కొన్నాడట.
అక్కడితో ఆగలేదు లింకు. తర్వాత నాగారం మండలంలోని ఓ గ్రామంలో ఆరు పాజిటివ్ కేసులొచ్చాయి. వీరంతా మొదటి పాజిటివ్ కేసు వచ్చిన వ్యక్తి అత్తగారింట్లో వారే. ఇక్కడి వరకు ఒకరి నుంచి ఇంకొకరికి ఎలా వచ్చిందో అధికారుల వద్ద పూర్తి డీటైల్స్ వున్నాయి. కానీ అసలు ట్విస్టు ఏంటంటే, మర్కజ్ వెళ్లిన వ్యక్తితో కానీ, మెడికల్ షాపు యువకుడితోగానీ, అసలు ఎలాంటి ట్రావెల్ హిస్టరీ గానీ లేని ఓ కిరాణా షాపు యాజమానికి పాజిటివ్ రావడం, అధికారులను షాక్‌కు గురి చేసింది.
కిరాణా షాపు వ్యక్తికి కరోనా ఎలా వచ్చింది? సవాల్‌గా మారిన ఆ లింకును అధికారులు ఎలా చేధించారు?
అతని లింకు చేధించడానికి అధికారులు అష్టకష్టాలు పడ్డారు. అంతిమంగా చేధించారు. కానీ చేజింగ్ మాత్రం చాలా పకడ్బందీగా చేసి, శభాష్ అనిపించుకున్నారు. సూర్యాపేట మార్కెట్‌లో కిరాణాషాపు నడిపే వ్యక్తికి దగ్గూ, జలుబు, జ్వరం వచ్చింది. ఎందుకైనా మంచిది, ఒకసారి కరోనా టెస్టు చేయించుకుందామని స్వచ్చందంగా, ఏరియా హాస్పిటల్‌కు వెళ్లాడు. అతని అనుమానమే నిజమైంది. నమూనాలు పరీక్షిస్తే పాజిటివ్ అని తేలింది. కిరాణా షాపు నడుపుతున్నాడు కాబట్టి, చాలామంది సరుకులు కొనడానికి వస్తుంటారు, పోతుంటారు. దీంతో ఈయనను కలిసిన 62 మందిని గుర్తించి క్వారంటైన్ చేసి, టెస్టులు నిర్వహించారు. వీరిలో ఎనిమిది మందికి పాజిటివ్ అని తేలింది. వీరిలో ఒకరు ఈయన కుమార్తె కాగా, ఏడుగురు ఈయన కిరాణా దుకాణం ఉన్న మార్కెట్ ప్రాంతంలో, వివిధ వ్యాపారాలు చేసే వారు. అయితే, కిరాణా షాపు యజమానికి కరోనా ఎలా వచ్చిందన్నది అధికారులకు అంతుబట్టలేదు. ఎందుకంటే, తొలుత పాజిటివ్ అని తేలిన మర్కజ్ వెళ్లొచ్చిన వ్యక్తిని ఇతను కలవలేదు. మెడికల్ షాపుకూ వెళ్లలేదు. ఎలాంటి ట్రావెల్ హిస్టరీ కూడా లేదు. మరి కరోనా ఎలా వచ్చిందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
సీసీటీవీ ఫుటేజ్ లింకును కనిపెట్టిందా?
కిరాణా కొట్టు నడిపే వ్యక్తికి కరోనా ఎలా వచ్చిందన్నదానిపై కలెక్టర్, ఎస్పీ సహా స్థానిక అధికారులందరూ రంగంలోకి దిగారు. వీరితో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులూ వున్నారు. అన్ని వివరాలూ ట్రేస్ చేశారు. ఎలాంటి లింకూ దొరకలేదు. ఆఖరి ప్రయత్నంగా, మెడికల్ షాపులో సీసీటీవీ ఫుటేజిని పరిశీలించారు. అక్కడే ఎండు చేపలు అమ్మే మహిళ ద్వారా, కిరాణా షాపు వ్యక్తికి కరోనా సోకిందని తేల్చారు.
కానీ ఆమె ద్వారా ఎలా ఇన్‌ఫెక్ట్ అయ్యిందన్నది మాత్రం, చాలా గమ్మత్తుగా వుంది. ఈ మహిళ మెడికల్ షాపులో మందులు కొనిందట. వ్యాపారం లేక ఖాళీగా ఉండే సమయంలో అష్టాచెమ్మా ఆడటం, తెలిసిన వాళ్లందరి దగ్గరకు వెళ్లి పలకరించడం ఆమె అలవాటు. ఇలాగే అందర్నీ పలకరించుకుంటూ, కిరాణా షాపు వ్యక్తినీ పలకరించింది. అలా ఈమె ద్వారా అతనికి కరోనా సోకింది. కోవిడ్ మహమ్మారి ఎంత ఈజీగా ఒకరి నుంచి ఒకరికి ఎలా సోకుతుందో ఈ ఘటనే ఒక ఉదాహరణ.
సూర్యాపేట మార్కెట్‌లో మర్కజ్ వెళ్లొచ్చిన వ్యక్తి నుంచి మొదలైన వైరస్ వ్యాప్తి, కిరాణా షాపు వ్యక్తి వరకు మధ్యలో చాలామందికి సోకిందని గుర్తించారు అధికారులు. ఇప్పటి వరకు దాదాపు 200మందిని క్వారంటైన్ చేశారు. చాలా పకడ్బందీగా సూర్యాపేట మార్కెట్‌లో కరోనా లింకును చేధించారు అధికారులు. సూర్యాపేట అధికారులపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.