మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి తెర.. చివరి రోజు రణరంగంగా ప్రచారం..

Campaign: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి తెర పడింది.

Update: 2022-11-01 12:43 GMT

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి తెర.. చివరి రోజు రణరంగంగా ప్రచారం..

Campaign: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి తెర పడింది. ఆఖరు ప్రచార ఘట్టంలో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు కర్రలతో దాడులు చేసుకున్నారు. ప్రచారం చివరిరోజు జరిగిన ఈ ఘటన తప్ప దాదాపు నెల రోజుల ప్రచారమంతా ప్రశాంతంగానే జరిగింది. ఆఖరు రోజు టీఆర్ఎస్, బీజేపీలు భారీ ర్యాలీలతో హోరెత్తించాయి. కాంగ్రెస్ అభ్యర్థి మహిళా గర్జన నిర్వహించారు. అభివృద్ధికే ఓటర్లు మొగ్గు చూపుతారని టీఆర్ఎస్‌ నేతలు ఆశలు పెట్టుకోగా ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకోవడం తమకు కలిసొస్తోందని బీజేపీ లెక్కలు వేసుకుంటోంది. అటు కాంగ్రెస్ నేతలు మహిళా సెంటిమెంట్ ను నమ్ముకున్నారు.

ఇక 3వ తేదీ గురువారం రోజున మునుగోడు ఉపఎన్నిక కోసం పోలింగ్‌ ఏర్పాట్లను ముమ్మరం చేసినట్లు ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. మంగళవారం సాయంత్రం 6 గంటల తర్వాత పార్టీలు ప్రచారాన్ని నిలిపివేయాలని, స్థానికేతరులు నియోజకవర్గాన్ని వదిలి వెళ్లిపోవాలని సూచించారు. ఆయా పార్టీల ప్రతినిధులు మీడియా సమావేశాలు, ఇంటర్వ్యూలు వంటివి ఇవ్వకూడదని, సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ప్రచారం చేయకూడదని హెచ్చరించారు. అదేవిధంగా ఎస్‌ఎంఎస్‌లపైనా నిషేధం విధించినట్లు చెప్పారు. దీనికి అనుగుణంగా నెట్‌వర్క్‌ ప్రొవైడర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం పేర్కొన్న నిబంధనలు కచ్చితంగా పాటించి, పోలింగ్‌ ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు.

నియోజకవర్గంలో మొత్తం 298 పోలింగ్‌ కేంద్రాలకు గాను అర్బన్‌ పరిధిలో 35, రూరల్‌ పరిధిలో 263 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో 105 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించారు. అక్కడ భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే కొత్తగా ఓటు హక్కు పొందినవారికి తొలిసారిగా ఆధునీకరించిన ఓటరు గుర్తింపు కార్డులను మంజూరు చేశారు. ఇప్పటికే ఓటరు స్లిప్పులను పంపిణీ చేశామని, ఇంకా అందనివారు ఆన్‌లైన్‌ ద్వారా పొందొచ్చని ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. అదేవిధంగా అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేసినట్లు వివరించారు.

మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 2లక్షల 41 వేల 855 మంది మంది ఓటర్లుండగా వారిలో పురుషులు లక్షా 21 వేల 720 మంది.. మహిళా ఓటర్లు లక్షా 20 వేల 128 మంది ఉన్నారు. ఇతరులు ఏడుగురు ఓటర్లున్నారు. పాతికేళ్ల లోపు ఓటర్లు 37 వేలకు పైబడి ఉండగా 80 ఏళ్లు దాటిన వృద్ధులు 2వేల 576 మంది ఉన్నారు. ఇక మొత్తం ఓటర్లలో 50 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటర్లు 5వేల 686 మందికిగాను 730 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్‌ జరుగుతుంది. మాక్‌ పోలింగ్‌ దృష్ట్యా గంట ముందుగానే ఏజెంట్లు రావాలని ఎన్నికల అధికారి వికాస్ రాజ్ విజ్ఞప్తి చేశారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌, ముగ్గురు ఇతర ఆఫీసర్లు ఉంటారు. మొత్తం 1,192 మంది సిబ్బంది అవసరం ఉండగా.. 300 మందిని అదనంగా తీసుకున్నారు. వీరితోపాటు 199 మంది మైక్రో అబ్జర్వర్లు అందుబాటులో ఉంటారని వికాస్ రాజ్ చెప్పారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో బూత్‌లెవల్‌ ఆఫీసర్లు ఉంటారని, అన్నిచోట్లా మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వికాస్ రాజ్ చెప్పారు. ఓటర్ల ఫిర్యాదుల కోసం సి-విజిల్‌ యాప్‌ను అందుబాటులోకి తేవడం విశేషం. పోలింగ్‌ కేంద్రం నుంచే గంటకోసారి ఓటింగ్‌ శాతాన్ని అప్ డేట్ చేస్తామంటున్నారు ఎన్నికల అధికారులు.

మొత్తంగా చూస్తే మునుగోడు ఉపఎన్నికలో బహిరంగ వ్యాఖ్యానాలకు తెరపడింది. ఇక ఇప్పుడు తెరచాటుగా ఏం జరుగుతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. తెరచాటు కార్యకలాపాలను అడ్డుకునేందుకు ఎన్నికల అధికారులు ఇప్పటికే పటిష్టమైన చర్యలు తీసుకోవడం విశేషం.

Tags:    

Similar News