వేములవాడలో సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్
Vemulawada: వేములవాడ, చందుర్తి డైరెక్టర్ల ఫలితాలపై వివాదం
Vemulawada: తెలంగాణలోని ఏకైక సహకార విద్యుత్ సరఫరా సంఘ పాలకవర్గం ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్ పార్టీ విజయబావుటా ఎగురవేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 15 డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వేములవాడలో చేపట్టిన ఓట్ల లెక్కింపు తర్వాత ఫలితాల ప్రకటనలో ఎన్నికల అధికారుల తీరు వివాదాస్పదమైంది. విజేతలను ప్రకటించే విషయంలో ఏకపక్షంగా వ్యవహరించారని బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వేములవాడ రూరల్ స్థానంలో బీజేపీ అభ్యర్థి జక్కుల తిరుపతి విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి మమత తొలుత ప్రకటించారు. ఆ ఆపార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. దీనిపై బీఆర్‌ఎస్ నాయకులు రీకౌంటింగ్ కోరడంతో ఓట్ల లెక్కింపు చేపట్టి కొద్ది సేపటి తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థి ఆకుల దేవరాజం గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి.
అలాగే చందుర్తిలో బీజేపీ అభ్యర్థి అల్లాడి రమేశ్ 18 ఓట్ల ఆధిక్యంలో ఉండగా ఎన్నికల ఫలితాలు వెల్లడించకుండా నిలిపివేశారు. రాత్రి 8 గంటల తర్వాత చందుర్తి డైరెక్టర్‌గా బీఆర్‌ఎస్ అభ్యర్థి పి.శ్రీనివాసరావు రెండు ఓట్ల తేడాతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ రెండు ఉదంతాలపై బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కౌంటింగ్ కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులు లాఠీచార్జి చేసి బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
చందుర్తికి చెందిన సహకార విద్యుత్ సంస్థ డైరెక్టర్ అభ్యర్థి అల్లాడి రమేశ్ రీకౌంటింగ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈమేరకుల సహకార ఎన్నికల అధికారులకు వినతిపత్రం సమర్పించారు. అధికారులు ఆ దరఖాస్తును తిరస్కరించారు. ఎన్నికల అధికారులు తొలుత బీజేపీ అభ్యర్థిగెలిచారని ప్రకటించి, ఆతర్వాత బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించడంలో ఆంతర్యమేంటని అల్లాడి రమేశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రీకౌంటింగ్ జరపబోమని రాతపూర్వకంగా రాసిఇవ్వాలని రమేశ్ డిమాండ్ చేశారు. అధికారులు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో రాసివ్వబోమని తేల్చి చెప్పారు.
నిష్పక్షపాతంగా వ్యవహరించి ఎన్నికలు నిర్వహించాల్సిన అధికారులు, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించి ఫలితాలను తారుమారుచేశారని బీజేపీ నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు. అధికారుల పనితీరుపై కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.