తెలంగాణలో ఆగస్ట్ 21 టెన్షన్స్.. బీజేపీతో టచ్‌లో ఉన్న నేతలెవరు?
Operation Akarsh: ఆగస్ట్ 21 అమిత్ షా ఎంట్రీ నేపధ్యంలో ఈ డేట్ చుట్టే తెలంగాణ రాజకీయం తిరుగుతోంది.
Operation Akarsh: ఆగస్ట్ 21 అమిత్ షా ఎంట్రీ నేపధ్యంలో ఈ డేట్ చుట్టే తెలంగాణ రాజకీయం తిరుగుతోంది. ఇప్పటికైతే రాజగోపాల్ మాత్రమే. కానీ, మరింత మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్న కమలనాథుల కామెంట్స్ స్టేట్ పాలిటిక్స్‌నే షేక్ చేసేస్తున్నాయి. ప్రధానంగా ఈటల చేతిలో ఉన్న చేరికల లిస్ట్‌లో ఆ నంబర్ డబుల్ డిజిట్‌లో ఉందన్న హింట్స్ ఉత్కంఠను అమాంతం పెంచేస్తోంది. ఇంతకూ, అపర చాణక్యుడి ఎంట్రీతో తెలంగాణ రాజకీయం ఎలాంటి మలుపు తిరగబోతోంది..? కమలనాథులకు టచ్‌లో ఉన్న ఆ కీలక నేతలు ఎవరు..? ఆపరేషన్ ఆకర్ష్ ఒక్కటే రాష్ట్రవ్యాప్తంగా లీడర్లను, కేడర్‌నూ తెస్తుందా..?
తెలంగాణలో కమలం పార్టీకి అంత సీన్ ఉందా..? ముగ్గురంటే ముగ్గురు ఎమ్మెల్యేలున్న పార్టీ అధికారంలోకి రావడం సాధ్యమేనా..? కేడర్ ఉంటే నేతల్లేరు నేతలుంటే కేడర్ లేదు. ఎంత జాతీయ పార్టీ అయితే మాత్రం, ఎంత కేంద్రంలో అధికారంలో ఉంటే మాత్రం అద్భుతం జరుగుతుందని ఆశించడం కూడా అత్యాశే ఇవీ నిన్నటి వరకూ టీబీజేపీపై వినిపించిన విశ్లేషణలు. కానీ, మోడీ, షా లాంటి అపరచాణక్యులకు అసాధ్యాలను సుసాధ్యం చేయడం కష్టమా..? రెండంటే రెండు సీట్లతో మొదలై దేశ రాజకీయాల్ని శాసించే స్థాయికి చేరిన కమలనాథుల వ్యూహాలకు కొదవా..? ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఇప్పటికైతే చేతిలో ఉన్నది ముగ్గురు ఎమ్మెల్యేలే నియోజకవర్గాల్లో గట్టిగా కేడర్ కూడా లేదు. కానీ, రోజుల వ్యవధిలో క్యాండిట్లు, కేడర్ ఆటోమెటిక్‌గా నడుచుకుంటూ వచ్చేలా చేయడమే కమలనాథుల యాక్షన్ ప్లాన్ అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరేందుకు సిద్ధమైన ఆగస్ట్ 21నే మరిన్ని చేరికలతో తెలంగాణలో కమలం పార్టీ టాప్‌లో నిలవడం ఖాయమనే హింట్స్ ఇస్తున్నారు. అయితే, ఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ యాక్షన్, రియాక్షన్లు ఎలా జరుగుతున్నాయి.
రెండు సార్లు భేటీ ఈటలకు బాధ్యతలు ఆ వెంటనే యాక్షన్, రియాక్షన్. ఇంకేముంది రాజగోపాల్‌రెడ్డి రూపంలో ఫస్ట్ ఎంట్రీకి డేట్ ఫిక్స్ అయిపోయింది. అయితే, ఆ ఎంట్రీ జరగబోయేది అమిత్ షా సమక్షంలో సరిగ్గా ఈ ఒక్క విషయమే స్టేట్ అండ్ సెంట్రల్ పొలిటికల్ అటెన్షన్ కారణమవుతోంది. నిజానికి కమలనాథుల ఆపరేషన్ ఆకర్ష్ అసలు లక్ష్యాలు ఇవే. పార్టీలో బలమైన నేతలు, కేడర్ లేకపోవచ్చు. కానీ, రప్పించడం కష్టమేం కాదన్నదే. ఈ విషయంలో ఈటలకు అప్పగించిన బాధ్యతలను సక్సెస్‌ఫుల్‌గా నిర్వర్తించినట్టే కనిపిస్తోంది. జాతీయ సమావేశాల తర్వాత హస్తిన వెళ్లొచ్చిన ఈటల వచ్చీ రావడంతోనే సింగిల్ ప్రెస్‌మీట్‌తో స్టేట్ పొలిటికల్ సినారియోనే మార్చేశారు. 20 ఏళ్లు కలిసి నడిచా అక్కడ అసంతృప్తులెవరో, పార్టీని వీడేదెవరో నాకు తెలీదా అంటూ టీఆర్ఎస్‌ను టార్గెట్ చేశారు. ఇక్కడ మొదలు ఎత్తులకు పై ఎత్తులతో చేరికల గేమ్ పొలిటికల్ థ్రిల్లర్‌కు తీసిపోకుండా కంటిన్యూ అవుతోంది.
నిజానికి ఈటల అధికార పార్టీనే టార్గెట్ చేశారు. కానీ, ఫస్ట్ రిజల్ట్ మాత్రం కాంగ్రెస్ నుంచి వచ్చింది. అదికూడా ఆ పార్టీ సిట్టింగ్ సీట్ అయిన మునుగోడు కావడంతో సీన్ ప్రీక్లైమాక్స్‌లా మారింది. రాజగోపాల్ ఎపిసోడ్‌కు అసలు క్లైమాక్స్ కాషాయ తీర్ధం పుచ్చుకోవడం అయితే అదే బాటలో మరింత మంది నేతలున్నారని కమలనాథులు పదే పదే చెప్పడం ఉత్కంఠ రేపుతోంది. రాజగోపాల్‌రెడ్డి హస్తినలో బీజేపీలో చేరడం కన్ఫర్మ్ చేసుకున్న కొద్ది నిమిషాల్లోనే దాసోజు శ్రవణ్ కూడా హస్తం పార్టీకి హ్యాండ్ ఇస్తున్నట్టు ప్రకటించారు. ఇది సరిపోదన్నట్టు టీఆర్ఎస్ నేత యర్రబెల్లి సోదరుడు బీజేపీ కండువా కప్పుకునేందుకు సిద్ధం అయిపోయారు. ఇలా టీఆర్ఎస్, కాంగ్రెస్ అనే తేడా లేకుండా కమలతీర్థం పుచ్చుకునే నేతల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆ సంఖ్య అమిత్ షా ఎంట్రీ సమయానికి డబుల్ డిజిట్‌లోకి చేరుతుందనే హింట్సే ఉత్కంఠ రేపుతున్నాయి. రాజగోపాల్ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ అయిన తర్వాత మరోసారి మీడియా ముందుకొచ్చిన ఈటల ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే అని ప్రకటించడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
ఈటలే కాదు తరుణ్ చుగ్‌దీ అదే మాట రాజగోపాల్ రెడ్డి, దాసోజు ఎంట్రీ కేవలం ట్రైలర్ మాత్రమే అని తేల్చేశారు. తాజాగా బండి సంజయ్‌తో కలిసి దాసోజు శ్రవణ్ తరుణ్‌ని కలిశారు. ఆ భేటీ తర్వాతే బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ఆసక్తికర కామెంట్లు చేశారు. తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయం అనీ, అందుకే ఇతర పార్టీల నేతలంతా తమవైపే వస్తున్నారని వ్యాఖ్యానించారు. తమపార్టీలో చేరే నేతలకు సంబంధించిన ఫుల్ అప్‌డేట్స్ త్వరలోనే ఉంటాయని బాంబ్ పేల్చారు.
ఈటల నుంచి బండి సంజయ్ వరకూ ప్రతి బీజేపీ నేతా చేరికలపై చేస్తున్న కామెంట్లే రాష్ట్ర రాజకీయంలో ఉత్కంఠ రేపుతున్నాయి. నిజానికి మునుగోడు ఉపఎన్నిక అనేది బీజేపీకి చాలా ఇంపార్టెంట్. కమలనాథులు అనుసరిస్తున్న ఆపరేషన్ ఆకర్ష్‌కు వేగంగా అడుగు పడేందుకు ఈ ఉపఎన్నిక వేదికగా మారిందనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు. ఇలాంటి ఓ ఉపఎన్నిక రిజల్ట్ స్టేట్ పొలిటికల్ సినారియోను ఎలా మార్చబోతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రధానంగా ఇక్కడ బీజేపీ గెలిస్తే రాష్ట్రవ్యాప్తంగా కావాల్సినంత కేడర్‌ను తెచ్చిపెట్టే అవకాశముంది. బీజేపీ నేతలు చెబుతున్నట్టు టీఆర్ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయం ఔనో కాదో తేల్చేది మునుగోడు ఫలితమే. మునుగోడు విజయంతో అధికార పార్టీపై జనంలో వ్యతిరేకత ఉందని నిరూపించే అవకాశంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్‌కు సీనే లేదని చెప్పడానికి వీలుంటుంది. సరిగ్గా ఇలాంటి అంచనాలతోనే కమలనాథులు ఆపరేషన్ ఆకర్ష్‌కు మునుగోడును వేదిక చేసుకుంటున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఇలాంటి సమయంలోనే టీబీజేపీ నేతలు చేరికల లిస్ట్‌పై హింట్స్ ఇస్తున్నట్టు కనిపిస్తోంది. దీనికితోడు అమిత్ షా లాంటి నేత ఎంట్రీ అంటే ఆ అంచనాలే వేరు. ఆగస్ట్ 21న అమిత్ షా సమక్షంలో రాజగోపాల్‌రెడ్డితో పాటు, దాసోజు శ్రవణ్, టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన ప్రదీప్‌రావు, ఉద్యమనేత రాజయ్య యాదవ్, నర్సాపూర్ మునిసిపాలిటీ టీఆర్‌ఎస్ నేత మురళీయాదవ్‌తో పాటు మరికొందరు రిటైర్డు ఐఎఎస్‌లు, ఐపీఎస్‌లు కూడా బీజేపీలో చేరే అవకాశం ఉందని పార్టీ చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. కానీ, అసలు చేరికల లిస్ట్‌లో మాత్రం ఆ నంబర్ డబుల్ డిజిట్‌లో ఉందని చెప్పకనే చెప్పారు. దీంతో ఇటు టీఆర్ఎస్ అటు హస్తం పార్టీల్లో ఉత్కంఠ అమాంతం పెరిగిపోతోంది. నిజానికి అందరి చూపు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై కూడా ఉంది. ఇందుకు కారణం రేవంత్‌పై డైరెక్ట్ వార్ ప్రకటించడమే.
నిజానికి వెంకట్‌రెడ్డి పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చినా పరిస్థితులు మాత్రం వేరేలా కనిపిస్తున్నాయి. తాజా చండూర్ సభలో ఉంటారో ఊడుతారో తేల్చుకోడంటూ అద్దంకి చేసిన ఆవేశపూరిన ప్రశంగాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అద్దంకి వ్యాఖ్యలపై సీనియర్లు సీరియస్ అయినా పరోక్షంగా ఏదో ఒకటి తేల్చుకోండి అన్న సంకేతాలు పంపినట్టే ఉందనే విశ్లేషనలులేకపోలేదు. దీంతో ఆగస్ట్ 21న కాకపోయినా ఆ తర్వాత అయినా వెంకట్‌రెడ్డి హస్తానికి హ్యాండ్ ఇవ్వడం ఖాయమనే విశ్లేషణలున్నాయి. అదే జరిగి తమ్ముడి బాటలో నడిచేందుకే సిద్ధపడితే నల్గొండ బీజేపీ అడ్డాగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్క నల్గొండ మాత్రమే కాదు ఖమ్మం, వరంగల్ సహా ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే స్ట్రాటజీతో కమలనాథులు ముందుకెళుతున్నారనే విశ్లేషణలున్నాయి. మొత్తంగా.. ఈటల చేతిలో ఉన్న చేరికల లిస్టులో ఎవరెవరు ఉన్నారన్నది ఇప్పటికైతే మిలియన్ డాలర్ల సస్పెన్స్‌గానే ఉంది. ఒక్కమాటలో కలిసొచ్చే కాలంలో నడిసొచ్చే కొడుకు అన్న నానుడి అక్షరాలా బీజేపీకి యాప్ట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.