ఆయన ఆ హాట్ సీటు వద్దు బాబోయ్ అని చేతులెత్తేశారు. మరో ముగ్గురు కావాలి కావాలి అంటూ, ఆ చైర్ చుట్టూ మ్యూజికల్ చైర్స్ ఆడుతున్నారు. కానీ పార్టీ హైకమాండ్ మాత్రం, వద్దంటున్నవారిని పక్కనపెట్టడం లేదు కావాలంటున్నవారిని కుర్చీలో కూర్చోబెట్టడం లేదు. ఎందుకీ తర్జనభర్జన..? అసలు ఇప్పటికిప్పుడు కొత్తవారెవర్నీ, ఆ పీఠంపై కూర్చోబెట్టారాదని డిసైడయ్యిందా? అదే ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైందా? ఇదే హైకమాండ్ ఉద్దేశమైతే, ఎందుకలా ఆలోచిస్తోంది?
తెలంగాణ కాంగ్రెస్‌లో, పీసీసీ చీఫ్ మార్పుపై రోజుకో చర్చ చక్కర్లు కొడుతోంది. ఇదిగో కొత్త పీసీసీ, అదిగో కొత్త ప్రెసిడెంట్ అంటూ వార్తలు వస్తున్నా, ఏదీ కార్యరూపం దాల్చడంలేదు. పీసీసీ చీఫ్ మార్పుపై పార్టీ అధిష్టానం తర్జభర్జన పడుతోందన్న విషయం మాత్రం స్పష్టమవుతోంది. ఇప్పటికే హుజూర్ నగర్ ఉపఎన్నికల తరువాత, ప్రస్తుత పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి త్వరలో, తాను పీసీసీ పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. ఈ మాట చెప్పి, దాదాపు ఆరునెలలు గడుస్తోంది. కానీ ఇప్పటి వరకు అధిష్టానం, కొత్త పీసీసీపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. పార్టీ ఇంచార్జ్ కుంతియా సైతం ఇప్పటి వరకు పీసీసీ అధ్యక్ష మార్పుపై ఎలాంటి వాఖ్యలూ చేయలేదు. కనీసం అలాంటి సంకేతాలు కూడ ఇవ్వలేదు. కానీ పార్టీలో సీనియర్లు విహెచ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి లాంటి నేతలు మాత్రం, ఢిల్లీ స్థాయిలో గట్టిగానే పావులు కదుపుతున్నారు.
అయితే పీసీసీ మార్పు విషయంలో అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు అర్థమవుతోంది. ఇప్పటికే పార్టీ అనేక సందర్భాల్లో నష్టపోయింది. కీలక నేతలు పార్టీని వీడటంతో, చాలా నియోజకవర్గాల్లో పార్టి ఉనికి ప్రమాదంలో పడింది. దీంతో ఇప్పటికిప్పుడు పీసీసీని మార్చడం వల్ల పార్టీకి లాభం కంటే నష్టం ఎక్కువనే భావనలో ఉందట అధిష్ఠానం.
కొత్త పీసీసీని నియమంచడం చాలా కష్టమనే భావనలో హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డిలు పీసీసీ అధ్యక్షపదవికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. ఇలాంటి సంధర్భంలో పీసీసీని మార్చి, వీరిలో ఒకరిచ్చినా, ఇద్దరికీ ఇవ్వకుండా మరొకరికి ఇచ్చినా, అసమ్మతి భగ్గుమనడం ఖాయం. పార్టీకి సైతం వీరు దూరంగా జరిగే ప్రమాదముంది. స్టేట్ కాంగ్రెస్ నిలువునా చీలినా ఆశ్చర్యంలేదు. ఇప్పటికే కొన ఊపిరితో వున్న పార్టీకి, ఈ పరిణామం మరింత ఇబ్బంది కలిగించొచ్చు. అందుకే పీసీసీని మార్చి కొత్త కొష్టాలు ఎందుకు తెచ్చుకోవాలి అన్న ఆలోచన చేస్తున్నారట సోనియా గాంధీ.
ఈ పరిణామాల నేపథ్యంలోనే, పీసీసీ పదవి వద్దు బాబోయ్ అంటూ ఉత్తమ్ అల్లంత దూరం జరిగినా, హైకమాండ్ మాత్రం పీఠంపై మరొకరిని కూర్చోబెట్టడానికి వెనకా ముందు ఆడుతోంది. అలాగని పీసీసీ చీఫ్‌ను మార్చకపోయినా, పార్టీకి కొత్త ఊపురాదు. మార్చక తప్పదు. అందుకే ఇప్పటికిప్పుడు మార్చకపోయినా, గ్రేటర్ ఎన్నికల వరకు చూద్దాంలే అన్న ఆలోచనలో వుందట హైకమాండ్. చూడాలి, గాంధీభవన్ పీఠం కొత్తవారిలో ఎవరికి దక్కబోతోందో ఎన్నాళ్లూ అధిష్టానం సాగదీస్తుందో.