Amit Shah: నేడు తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. బీజేపీ ముఖ్య నేతలతో భేటీ
Amit Shah: 9.40 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి తిరిగి ఢిల్లీకి పయనం
Amit Shah: నేడు తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ తరువాత మొదటి సారి తెలంగాణలో పర్యటించబోతున్నారు అమిత్ షా. ఆదిలాబాద్‌లో జన గర్జన బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్‌లో మేధావులతో అమిత్‌షా సమావేశం అవుతారు. ఆ తర్వాత బీజేపీ ముఖ్యనేతలతో అమిత్ షా భేటీ కానున్నారు. ఎన్నికల వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు అమిత్ షా.
మధ్యాహ్నం ఒంటి గంట 45 నిమిషాలకు బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు అమిత్ షా చేరుకుంటారు. 2 గంటల 35 నిమిషాలకు ప్రత్యేక హెలికాప్టర్ లో ఆదిలాబాద్ చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు ఆదిలాబాద్ సభలో పాల్గొననున్నారు. 4 గంటల 15 నిమిషాలకు ఆదిలాబాద్ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు బయలుదేరనున్నారు. 5 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న అమిత్ షా.. సాయంత్రం 6 గంటలకు ఇంపీరియల్ గార్డెన్‌లో మేధావులతో సమావేశమవుతారు. రాత్రి 7 గంటల 40 నిమిషాలకు ఐటీసీ కాకతీయలో బీజేపీ ముఖ్యనేతలతో అమిత్ షా సమావేశమవనున్నారు. రాత్రి 9 గంటల 40 నిమిషాలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు.
ఇక ఆదిలాబాద్‌లో నిర్వహించే జన గర్జన సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు బీజేపీ నేతలు. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లా కేంద్రం కాషాయమయం కాగా.. సభ విజయవంతం కోసం నేతలు యత్నిస్తున్నారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావ్ సహా అగ్రనేతలంతా భారీ జనసమీకరణ దిశగా ముందుకెళ్తున్నారు. ఇక తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలుకావడంతో.. దూకుడుగా వెళ్లాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. సభలతో కాషాయ సేనలో సమరోత్సాహం నింపాలనుకుంటున్నారు. కమలం పార్టీ కీలక నేతలందరినీ ప్రచార పర్వంలో దింపాలని నిర్ణయం తీసుకున్నారు.
ఎన్నికల షెడ్యూల్ తర్వాత కేంద్రహోం మంత్రి అమిత్ షా తొలి పర్యటనకు బీజేపీ సర్వం సిద్ధం చేసింది. ములుగులో 900 కోట్ల రూపాయలతో గిరిజన యూనివర్శిటీని కేంద్రం ఏర్పాటు అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సభను ఉపయోగించుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు. ఉత్తర తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో జోష్ పెంచేందుకు ఈ సభ దోహదపడుతుందని కాషాయ పార్టీ నేతలు లెక్కలు వేస్తున్నారు. ఇక సభ అనంతరం హైదరాబాద్ ఇంపిరియల్ గార్డెన్ లో నిర్వహించే మేధావుల సదస్సులో అమిత్ షా ప్రసంగిస్తారు.
తిరిగి ఢిల్లీ ప్రయాణానికి ముందు అమిత్ షా... ఐటీసీ కాకతీయ హోటల్ లో పార్టీ రాష్ట్ర ముఖ్య నేతలతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. దాదాపు రెండు గంటల పాటు నిర్వహించే ఈ సమావేశంలో.. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్యనేతలతో చర్చించే అవకాశముంది. ఇప్పటికే ఎన్నికల ఎఫైర్స్ కోసం 14 కమిటీలు వేసిన పార్టీ నాయకత్వం వాటి పనితీరుపై చర్చించే అవకాశముంది. అభ్యర్థుల ఎంపిక, మ్యానిఫెస్టో, బలమైన అభ్యర్థుల అన్వేషణ , కేంద్ర నేతల బహిరంగ సభలు.. BRS, కాంగ్రెస్‌లను ఇరుకున పెట్టే విధంగా ప్రచార వ్యూహాలు రచించాలని నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే ప్రధాని మోడీ బహిరంగ సభలతో తెలంగాణలో జోష్ రావడంతో, ఇక అమిత్ షా పర్యటన పార్టీ నేతల్లో మరింత జోష్ నింపనుంది.