Asteroid 2024 ON: భూమివైపే దూసుకొస్తున్న అతిపెద్ద గ్రహ శకలం.. డేట్ కూడా ఫిక్స్

Update: 2024-09-02 15:21 GMT

Asteroid 2024 ON: ఆస్ట్రాయిడ్ భూమికి దగ్గరిగా రాబోతోంది అనే వార్త ప్రస్తుతం శాస్త్రవేత్తలలో ఆసక్తినిరేకెత్తిస్తోంది. ఆస్ట్రాయిడ్ అంటే తెలిసిందేగా.. గ్రహ శకలాలనే ఆస్ట్రాయిడ్స్ అని అంటుంటాం. అప్పుడప్పుడు గ్రహ శకలాలు భూమికి దగ్గరిగా రావడం, భూమికి దగ్గరి నుండి వెళ్లిపోవడం అనేది మనం తరచుగా వినే వార్తే. అందులో కొన్ని పెద్ద సైజ్ గ్రహ శకలాలు ఉంటే.. ఇంకొన్ని చిన్న పరిమాణంలో ఉంటాయి. చిన్న పరిమాణంలో ఉండే వాటికి అంతగా ప్రాధాన్యత ఉండదు కానీ.. భారీ సైజ్ గ్రహ శకలాలు భూమి వైపు దూసుకొస్తున్నాయి అన్నప్పుడే ప్రపంచ ఖగోళ శాస్త్రవేత్తల్లో కాస్త కంగారు, హడావుడి మొదలవుతుంది. అలాగే ఈసారి కూడా భూమివైపు దూసుకొస్తున్న గ్రహ శకలం సైజ్ కూడా చాలా పెద్దదేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

రెండు ఫుట్ బాల్ మైదానాల విస్తీర్ణంలో ఉండనున్న ఈ గ్రహ శకలానికి 2024 ON అని పేరు పెట్టారు. సెప్టెంబర్ 15న ఈ భారీ గ్రహ శకలం భూమికి 6,20,000 మైళ్ల దగ్గరిగా వచ్చి వెళ్లిపోతుంది. సంఖ్యాపరంగా వినడానికి ఇది చాలా దూరంగా అనిపించినప్పటికీ.. ఖగోళ శాస్త్రం పరంగా చూస్తే అదేమీ పెద్ద దూరం కాదంటున్నారు శాస్త్రవేత్తలు. ఇంకా చెప్పాలంటే ఇది భూమికి, చంద్రుడికి మధ్య ఉన్న సగటు దూరానికి రెండు రెట్లు మాత్రమే ఉంటుందంటున్నారు.

శాస్త్రవేత్తలకు ఇలాంటివి అంటే కాస్త ఆసక్తి ఎక్కువే కదండి.. అందుకే భూమ్మీద నుండే అప్పుడే ఈ ఆస్ట్రాయిడ్ చుట్టుకొలతలు కూడా వేసేశారు. ఈ గ్రహ శకలం వ్యాసం 720 అడుగులు ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇటీవల కాలంలో భూమికి ఇంత దగ్గరిగా వచ్చిన అతి పెద్ద గ్రహ శకలం కూడా ఇదే అంటున్నారు.

వర్చువల్ టెలిస్కోప్ ప్రాజెక్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం ఉత్తర అర్ధగోళం నుండి ఆకాశంలోకి పరీక్షించి చూస్తే ఈ 2024 ON ఆస్ట్రాయిడ్ కనిపిస్తుంది. పదేళ్లకొకసారి ఆకాశంలో ఇలాంటి అద్భుతం జరుగుతుందని.. ఈశాన్య కాలమానం ప్రకారం సెప్టెంబర్ 15న మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ దృశ్యాన్ని వీక్షించవచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారతీయ కాలమానం ప్రకారం సెప్టెంబర్ 16న అర్ధరాత్రి సరిగ్గా 12 గంటల నుండి ఈ ఖగోళ వింత చూసే అవకాశం ఉంటుందని ఒక అంచనా.

ఈ గ్రహ శకలం సైజ్ గురించి ఇంకా చెప్పాలంటే... ఒక 60 అంతస్తుల భవనం ఎంత పెద్దదిగా ఉంటుందో.. 2024 ON అనే ఈ ఆస్టరాయిడ్ కూడా అంతే పెద్దగా ఉంటుందట. అంతేకాదు.. గంటకు 25000 మైళ్ళ వేగంతో దూసుకొచ్చే ఈ గ్రహ శకలం గమనంలో కొంచెం తేడా వచ్చినా.. జరిగే నష్టం కానీ లేదా ఆ తరువాతి పర్యవసానాలు కానీ ఊహకు అందనివిగా ఉంటాయని ఖగోళ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. 

Tags:    

Similar News