iPhone Electric Shock issue: ఈ ఐఫోన్ వాడుతున్నారా? అయితే మీకో 'షాకింగ్' న్యూస్!
iPhone Electric Shock issue: మీరు కొత్త iPhone 16ని ఉపయోగిస్తున్నారా? లేదా ఈ మొబైల్‌ని కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ షాకింగ్ న్యూస్ మీకోసమే. చాలా మంది ఐఫోన్ 16 వినియోగదారులు తమ ఫోన్‌లు ఛార్జింగ్ చేస్తున్నప్పుడు విద్యుత్ షాక్ వస్తోందని ఫిర్యాదు చేశారు. ఛార్జింగ్ చేస్తున్నప్పుడు కొత్త యాక్షన్ బటన్, కెమెరా కంట్రోల్ బటన్‌ను ఉపయోగిస్తున్నప్పుడు ఈ సమస్య ఏర్పడుతోందని చెబుతున్నారు. ఆండ్రాయిడ్ పోలీస్ రీసెంట్ రిపోర్టులో ఈ సమస్య గురించి సమాచారాన్ని అందించింది. విశేషమేమిటంటే ఒరిజినల్ ఛార్జర్, యాక్ససరీస్ వాడుతున్నప్పుడు కూడా ఈ సమస్య ఎదురవుతోంది.
యాపిల్ కమ్యూనిటీ పేజీలో ఆండ్రాయిడ్ పోలీస్‌లోని నివేదికల ప్రకారం.. ఫోన్‌ని కొనుగోలు చేసిన వారం తర్వాత, ఛార్జింగ్ సమయంలో విద్యుత్ షాక్‌లు రావడం ప్రారంభించినట్లు ఒక వినియోగదారు తెలిపారు. అయితే ఈ సమస్య ఛార్జింగ్ సమయంలో మాత్రమే కనిపిస్తుందని మరికొందరు వినియోగదారులు చెప్పారు. అంతే కాదు ఒరిజినల్ ఛార్జింగ్ కేబుల్ వాడిన తర్వాత కూడా ఈ సమస్య కనిపిస్తోందని ఇంకొందరు యూజర్లు చెబుతున్నారు.
కంపెనీ ఈ సమస్యను పరిష్కరించే వరకు ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్‌ని ఉపయోగించవద్దని స్వయంగా యాపిల్ కంపెనీనే చెప్పినట్లు తెలుస్తోంది. మీరు కెమెరా, యాక్షన్ బటన్‌లను తాకినప్పుడు షాక్ వస్తుందంటున్న నేపథ్యంలో ఛార్జింగ్ చేసేటప్పుడు ఫోన్‌ను ఉపయోగించవద్దని... తద్వారా మీరు ఈ సమస్యను నివారించడమే కాకుండా బ్యాటరీ జీవితాన్ని కూడా మెరుగుపరుస్తుందని కంపెనీ చెప్పినట్లు సమాచారం. ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్‌ను ఉపయోగించకూడదని కంపెనీ స్వయంగా సూచించింది.
విద్యుత్ షాక్ సమస్య ఎక్కువైతే, వెంటనే ఫోన్‌ని యాపిల్ సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లండి. మొబైల్ వారంటీలో ఉన్నట్లయితే, యాపిల్ దానిని ఉచితంగా రిపేర్ చేస్తుంది. త్వరలో కంపెనీ ఈ సమస్యకు సంబంధించి పెద్ద అప్‌డేట్‌ను కూడా షేర్ చేసే అవకాశాలున్నాయని యాపిల్ మొబైల్ యూజర్స్ ఆశిస్తున్నారు.
ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఫోన్‌ను పొడి, సురక్షితమైన ప్రదేశంలో ఉంచి ఛార్జింగ్ చేయండి. మీరు సాధారణ ఛార్జర్‌కు బదులుగా వైర్‌లెస్ ఛార్జింగ్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఇది కాకుండా, పవర్ సాకెట్‌ను కూడా చెక్ చేయండి. పవర్ సాకెట్‌లో ఏదైనా లోపం ఉందా? మీరు ప్లాస్టిక్ లేదా సిలికాన్ కేస్‌ని ఉపయోగించడం ద్వారా కూడా ఈ విద్యుత్ షాక్ సమస్యను నివారించవచ్చని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు.