Wriddhiman Saha: కీపింగ్‌లో ధోనీ స్థానాన్ని రీప్లేస్ చేసిన ఆటగాడు క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు

Update: 2024-11-04 13:04 GMT

Wriddhiman Saha's retirement: భారత వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ వృద్ధిమాన్ సాహా అన్ని రకాల క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ సీజన్ తనకు చివరిదని ప్రకటించాడు. నలభై సంవత్సరాల సాహా టెస్టుల్లో బెస్ట్ వికెట్ కీపర్‌గా ప్రశంసలు అందుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఆడింది తక్కువే అయినా.. తన ఆటతీరుతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. సోషల్ మీడియా వేదికగా క్రికెట్‌కు రిటైర్‌మెంట్ చెబుతున్నట్టు ప్రకటించాడు. క్రికెట్‌లో అద్భుతమైన ప్రయాణానికి సహకరించిన ప్రతీ ఒక్కరికీ సాహ కృతజ్ఞతలు తెలిపాడు. సాహా భారత్ తరపున 40 టెస్టులు ఆడాడు. మూడు సెంచరీల సాయంతో 29.41 సగటుతో 1353 పరుగులు చేశాడు. ఎంఎస్ ధోనీ రిటైర్‌మెంట్ అనంతరం కీపర్‌గా సేవలందించాడు.

సాహా టెస్టు క్రికెట్‌లో 3 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు చేశాడు. టీమిండియాలో అత్యుత్తమ వికెట్ కీపింగ్ స్కిల్స్ కలిగిన ఆటగాడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. 2008 నుంచి ఐపీఎల్ ప్రతి సీజన్‌లో సాహ పాల్గొన్నాడు. లీగ్‌లో అతను 170 మ్యాచ్‌లలో 127.57 స్ట్రైక్ రేట్‌తో 2,934 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇది కాకుండా అతను భారత్ తరపున 9 వన్డేలు కూడా ఆడాడు. అందులో 13.67 సగటుతో 41 పరుగులు చేశాడు.

ధోని, రిషబ్ పంత్‌లతో కలిసి టీమిండియా కీపింగ్ బాధ్యతలు నిర్వహించాడు. చివరిసారిగా వృద్ధిమాన్ సాహా 2021లో న్యూజిలాండ్‌తో టెస్టు మ్యాచ్ ఆడాడు. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, టీమ్ మేనేజ్‌మెంట్ పంత్‌కి బ్యాకప్‌గా కేఎస్ భరత్‌‌పై దృష్టి సారించి సాహాను జట్టు నుంచి తొలగించాలని నిర్ణయించుకుంది. క్రికెట్‌లో చిరస్మరణీయ ప్రయాణం తర్వాత ఈ రంజీ సీజన్‌ తనకు చివరిదని.. బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహించడం గౌరవంగా ఉందన్నారు. తనకు మద్దతు తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలిపాడు.

మెగా వేలంలో తన పేరు నమోదు చేసుకోని సాహా రంజీ ట్రోఫీలో బెంగాల్ తరపున ఆడటం ఖాయమని అనుకున్నారు. ఇటీవల విడుదల చేసిన రిటెన్షన్ జాబితాలో గుజరాత్ టైటాన్స్ అతడిని నిలబెట్టుకోలేదు. సాహా కూడా మెగా వేలంలోకి వచ్చేందుకు పేరు నమోదు చేసుకోలేదు. ఎంఎస్ ధోని రిటైర్మెంట్ తర్వాత సాహా టెస్ట్ క్రికెట్‌లో భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు. టెస్టుల్లో భారత వికెట్ కీపర్లు సాధించిన సెంచరీల విషయంలో ధోనీ, రిషబ్ పంత్ తర్వాత సాహా మూడో స్థానంలో నిలిచాడు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్లో బెంగాల్‌కు 15 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించాడు. సీనియర్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధికారితో వివాదం కారణంగా సాహా తాత్కాలికంగా బెంగాల్ టీమ్‌ను వదిలి వెళ్లాల్సి వచ్చింది. రెండేళ్లు త్రిపుర తరపున ఆడాడు. గత సీజన్‌లో మళ్లీ బెంగాల్ జట్టులో చేరాడు. మాజీ బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ చొరవతో చివరి సీజన్ కోసం బెంగాల్ జట్టులోకి తిరిగి వచ్చాడు.

Tags:    

Similar News