Team India: టీమిండియా ఓటమిలోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ముగ్గురు ఆటగాళ్లు
ఓడిపోయిన జట్టులో కొందరు ఆటగాళ్ల ప్రదర్శన కూడా గుర్తుండిపోయేలా ఉంది. గతంలో కూడా ఇలా ఒక జట్టు ఓడిపోయినప్పటికీ.. అందులో కొంతమంది ఆటగాళ్లు బెస్ట్ పర్‌ఫార్మెన్స్ ఇవ్వడం అనేది అనేక సార్లు జరిగిందే. అలాంటి మ్యాచ్‌ల్లో ఒకరిద్దరు ఆటగాళ్ళు లేదా ఎవరో ఒక ఆటగాడు జట్టును గెలిపించేందుకు ఒంటరి పోరాటం చేసి పోరాడి ఓడారనేలా తమదైన ముద్ర వేస్తుంటారు. గతంలో భారత జట్టుకు కూడా ఇలా చాలాసార్లు జరిగింది.
పూణె వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఓడినా.. వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. దీంతో ప్రస్తుతం సుందర్ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓడిపోయిన మ్యాచ్‌లో భారత్ తరపున 3 అత్యుత్తమ బౌలింగ్ గణాంకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
3. బాపు నాదకర్ణి vs ఆస్ట్రేలియా (1964) - 11/122..
భారత క్రికెట్ జట్టు దివంగత మాజీ స్పిన్ బౌలర్ బాపు నాదకర్ణి తన కెరీర్‌లో చాలా ప్రత్యేకమైన ప్రదర్శన ఇచ్చాడు. భారత్ తరపున 41 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఈ వెటరన్ ఆటగాడు ఓడిపోయిన మ్యాచ్‌లో అద్భుతమైన గణాంకాలు నమోదు చేశాడు. 1964లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో బాపు 122 పరుగులిచ్చి 11 వికెట్లు పడగొట్టాడు. ఓడిన టెస్టు మ్యాచ్‌లో భారత్‌కు ఇది మూడో అత్యుత్తమ బౌలింగ్.
2. వాషింగ్టన్ సుందర్ vs న్యూజిలాండ్ (2024) – 11/115..
టీమ్ ఇండియా తరుపున స్టార్ ఆల్ రౌండర్ ఆటగాడు వాషింగ్టన్ సుందర్ మూడేళ్ల తర్వాత పునరాగమనం చేసి సంచలనం సృష్టించాడు. న్యూజిలాండ్‌తో పూణెలో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో సుందర్‌కు భారత్ జట్టులో అవకాశం లభించింది. ఈ మ్యాచ్‌లో సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సుందర్ 7 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీశాడు. మొత్తం మ్యాచ్‌లో 115 పరుగులు వెచ్చించి 11 వికెట్లు పడగొట్టాడు.
1. జవగల్ శ్రీనాథ్ vs పాకిస్తాన్ (1999) – 13/132..
భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జవగల్ శ్రీనాథ్ తను పిచ్‌లో ఉన్నప్పుడు ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. ఈ బౌలర్ భారత్‌కు భారీ సహకారం అందించాడు. 1999లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌లో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో శ్రీనాథ్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు తీశాడు. శ్రీనాథ్ మొత్తం మ్యాచ్‌లో 132 పరుగులకు 13 వికెట్లు పడగొట్టాడు. అయితే, ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఇండియా ఓడిపోయినప్పటికీ జవగల్ శ్రీనాథ్ బౌలింగ్ మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయేలా మిగిలిపోయింది.