T20 World Cup 2021: ధనాధన్ క్రికెట్‌లో అత్యున్నత పోరుకు రంగం సిద్ధం
*రెండో టైటిల్‌పై భారత్ గురి *సమరోత్సాహంలో ఇతర జట్లు *ప్రైజ్‌మనీ విజేతకు రూ. 12 కోట్లు *రన్నరఫ్‌కు రూ. 6 కోట్లు
T20 World Cup 2021: ధనాధన్ క్రికెట్‌లో అత్యున్నత పోరుకు రంగం సిద్ధమైంది. గత వారమే ముగిసిన ఐపీఎల్ ఎప్పటిలాగే క్రికెట్ ప్రేమికులను అలరించగా ఇప్పుడు అంతకు మించిన వినోదం పంచేందుకు ఏకంగా 12 జట్లు సిద్ధమవుతున్నాయి. చాలా కాలం తర్వాత జరగబోతున్న టీ20 ప్రపంచకప్ కోసం నువ్వా నేనా అనే రీతిలో సవాల్ విసిరేందుకు ఎదురుచూస్తున్నాయి. ఫ్రాంచైజీ క్రికెట్‌లా కాకుండా ఆయా ఆటగాళ్లంతా తమ దేశం కోసం మెరుపులు మెరిపించాలనుకుంటున్నారు. అటు మన ఫ్యాన్స్ కూడా ఇప్పుడు కోహ్లీ టీమ్, రోహిత్ టీమ్, రాహుల్ టీమ్ అని కాకుండా అంతా జయహో టీమిండియా అనేందుకు ఆత్రుతగా ఉన్నారు.
2016లో చివరిసారి భారత్‌లో జరిగిన ఈ టోర్నీలో వెస్టిండీస్ విజేతగా నిలిచింది. తాజా టోర్నమెంట్ ఇవాళ్టి నుంచి వచ్చే నెల 14 వరకు యూఏఈలో నిర్వహించనున్నారు. ఆరంభ మ్యాచ్‌ల్లో ఆసీస్-దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్-వెస్టిండీస్ తలపడతాయి. ఈ కప్ భారత్‌లోనే జరగాల్సి ఉన్నా కరోనా కారణంగా వేదికను ఎడారి దేశానికి తరలించారు. దుబాయ్, షార్జా, అబుధాబిలలో 33 మ్యాచ్‌లు జరుగుతాయి.
ఈనెల 17 నుంచే క్వాలిఫయింగ్ మ్యాచ్‌లతో అధికారికంగా టీ20 ప్రపంచకప్ ఆరంభమైంది. ప్రధాన మ్యాచ్‌లు మాత్రం సూపర్-12 పేరిట ఇవాళ్టి నుంచి జరుగుతాయి. ఇందులో ఆరేసి జట్లతో రెండు గ్రూపులుండగా టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్-8గా నిలిచిన జట్లు ఇప్పటికే చోటు దక్కించుకున్నాయి. ఇక మిగిలిన నాలుగు జట్ల కోసం ఒమన్‌లో అర్హత మ్యాచ్‌లు జరిగాయి.
వీటి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో పాటు స్కాట్లాండ్, నమీబియా జట్లు గ్రూప్ 1, గ్రూప్ 2లో చేరాయి. ఇక అసలు సమరంలో ఒక్కో గ్రూప్‌లోని ప్రతీ జట్టు ఐదు మ్యాచ్‌లు ఆడుతుంది. ఆ తర్వాత ఈ రెండు గ్రూప్‌ల నుంచి టాప్-2గా నిలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్ అర్హత సాధిస్తాయి. ఇందులో విజేతలు టైటిల్ కోసం నవంబరు 14న దుబాయ్‌లో బరిలోకి దిగుతాయి.