Gukesh Income: చెస్ ఆటతో అమెరికా ప్రెసిడెంట్ కంటే ఎక్కువే సంపాదించిన గుకేష్

Update: 2025-01-11 12:19 GMT

Gukesh Income: చెస్ ఆటతో గుకేష్ ఎంత సంపాదించారో తెలుసా?

Gukesh earnings in 2024: ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం వింటే మీరు కూడా మీ ఇంట్లో చిన్న పిల్లలకు అర్జెంట్‌గా చెస్ నేర్పించేయాలని అనుకుంటారు. ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్ గెలిచిన గుకేష దొమ్మరాజు వరల్డ్ వైడ్ న్యూస్ హెడ్‌లైన్స్‌లో నిలిచారు. ఎందుకంటే ఇప్పటివరకు ఈ టైటిల్ గెలిచిన పిన్న వయస్కుడు కూడా గుకేష్ కావడం విశేషం. అది ఆయనకు వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్‌తో పాటు అదనపు క్రేజ్ తీసుకొచ్చింది. అంతేకాదు... 2024 లో చెస్ ఆడటం ద్వారా ఆరు అంకెల ఆదాయం సంపాదించిన వారి జాబితాలోనూ గుకేష్ టాప్ పొజిషన్ సొంతం చేసుకున్నారు.

2024 లో గుకేష్ ఎంత సంపాదించారో తెలుసా?

2024 లో సింగపూర్‌లో జరిగిన వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ పోటీల్లో టైటిల్ గెలుచుకోవడం ద్వారా గుకేష్ 1.35 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ సొంతం చేసుకున్నారు. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 11.34 కోట్లు అన్నమాట. అది కాకుండా ఆ ఏడాదిలో జరిగిన మొత్తం 8 పోటీల్లో పాల్గొని గెలవడం ద్వారా మొత్తం 15,77,842 డాలర్ల ప్రైజ్ మనీ గెలిచారు. ఆ మొత్తాన్ని ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేస్తే రూ. 13. 6 కోట్లు అవుతుంది. ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ పోటీల్లో నెగ్గి మరో 49,452 డాలర్లు సంపాదించారు. ఇండియన్ కరెన్సీలో ఇది నలభై రెండున్నర లక్షలకు సమానం.

ఇదంతా కూడా కేవలం టోర్నమెంట్స్‌లో గెలిచి ప్రైజ్ మనీ ద్వారా సంపాదించిదే. ఇది కాకుండా ఈ పోటీల్లో విజయం సాధించినందుకు ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు అందించిన పారితోషికం ఇక వేరేగా ఉంది.

రూ. 5 కోట్లు ప్రకటించిన తమిళనాడు

చెన్నైకి చెందిన గుకేష్ వరల్డ్ చెస్ చాంపియన్‌గా నిలవడంతో తమ రాష్ట్రానికి పేరు తీసుకొచ్చాడంటూ తమిళనాడు సర్కారు ఈ యువ కెరటానికి రూ. 5 కోట్ల నగదు పురస్కారం ప్రకటించింది. దీంతో కలిపి ఇప్పటివరకు గుకేష్ గతేడాది సంపాదించిన మొత్తం 19 కోట్ల వరకు చేరుకుంది.

గుకేష్ చేతిలో ఫైనల్స్‌లో ఓడిపోయిన చైనా చెస్ ఆటగాడు డింగ్ లిరెన్ కూడా 2024 లో 1 మిలియన్ డాలర్లకుపైనే సంపాదించారు. ఇక్కడ ఇంకా చెప్పుకోవాల్సిన మరో విషయం ఏంటంటే... గుకేష్, డింగ్ ఇద్దరూ కూడా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఏడాది మొత్తం అందుకున్న పారితోషికం కంటే కూడా వీళ్లే ఎక్కువ సంపాదించారు.

అమెరికా అధ్యక్షుడి పారితోషికం ఎంతంటే..

అమెరికా అధ్యక్షుడికి ఏడాదికి 4 లక్షల డాలర్ల జీతం ఉంటుంది. అదనంగా ప్రయాణాల కోసం మరో లక్ష డాలర్లు, ఇతరత్రా ఖర్చుల కోసం 50 వేల డాలర్లు ఇస్తారు. ఇవేకాకుండా 19000 డాలర్లు ఎంటర్‌టైన్మెంట్ బడ్జెట్ కింద చెల్లిస్తారు. ఇవన్నీ కలిపి కూడా 5 లక్షల 70 వేల డాలర్లు మించవు. కానీ గుకేష్, డింగ్ ఇద్దరూ కూడా 2024 లో చెస్ పోటీల్లో పాల్గొని 10 లక్షల డాలర్ల కంటే ఎక్కువే సంపాదించారు.

చెస్.కామ్ వెల్లడించిన వివరాల ప్రకారం 2024 లో చెస్ ఆడటం వల్ల ఎక్కువ సంపాదించిన వారి జాబితాలో గుకేష్‌ది నెంబర్ 1 ర్యాంక్ కాగా చైనా ఆటగాడు డింగ్‌ది రెండో ర్యాంక్. ఆ తరువాత ఈ జాబితాలో ముగ్గురు భారతీయులకు చోటు దక్కింది. 1 కోటి 74 లక్షల సంపాదనతో 9వ స్థానంలో గ్రాండ్ మాస్టర్ రమేష్ బాబు, 1 కోటి 06 లక్షలతో 13వ స్థానంలో గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి, ఆ తరువాత 1 కోటి 03 లక్షల ప్రైజ్ మనీతో 15వ స్థానంలో మరో గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి ఉన్నారు. ఆడుతుపాడుతూ, దేశాలు చుట్టేస్తూ అమెరికా అధ్యక్షుడి కంటే ఎక్కువ సంపాదించారంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా!! అదీ వారి ప్రతిభకు దక్కిన గుర్తింపు. 

Tags:    

Similar News