Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు బంగ్లాదేశ్‌కు షాక్.. షకీబ్ అల్ హసన్‌పై నిషేధం.. కారణం ఇదే
Champions Trophy 2025: 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కావడానికి ఇంకా దాదాపు 5 వారాలే మిగిలి ఉన్నాయి. ఫిబ్రవరి 19న ప్రారంభమయ్యే టోర్నమెంట్‌కు ముందు బంగ్లాదేశ్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు అనుభవజ్ఞుడైన ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ వరుసగా రెండోసారి బౌలింగ్ యాక్షన్ టెస్టులో విఫలమయ్యాడు. దీని కారణంగా అతనిపై విధించిన నిషేధం కొనసాగుతుంది. అంటే అతను ఈ టోర్నమెంట్‌లో బంగ్లాదేశ్ తరపున బౌలింగ్ చేయలేడు. గత నెలలో చెన్నైలోని శ్రీరామ్ చంద్ర సెంటర్ ఫర్ స్పోర్ట్స్ సైన్స్‌లో తన బౌలింగ్ యాక్షన్‌ను స్వతంత్రంగా అంచనా వేయడానికి షకీబ్ టెస్టులో పాల్గొన్నాడని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తెలిపింది. కానీ అతను ఆ సవాలును అధిగమించలేకపోయాడు.
గత సంవత్సరం భారత్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్ తర్వాత షకీబ్ అల్ హసన్ కౌంటీ క్రికెట్ కోసం ఇంగ్లాండ్‌కు వెళ్లాడు. సర్రే తరఫున ఆడుతున్నప్పుడు.. అతని బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదు అందింది. ఆ సమయంలో అతడి బౌలింగ్‌పై నిషేధం విధించారు. ఆ తర్వాత షకీబ్ తన బౌలింగ్ చెక్ చేసుకోవడానికి ఇంగ్లాండ్‌లో ఒక టెస్ట్ ఎదుర్కొన్నాడు. కానీ అతను అందులోనూ విఫలమయ్యాడు.
ఆ తర్వాత అతను స్వతంత్ర దర్యాప్తు కోసం ఇండియాకు వచ్చాడు. కానీ ఇక్కడ కూడా విఫలమయ్యాడు. బౌలింగ్‌పై నిషేధం ఎత్తివేయాలంటే హసన్ తన బౌలింగ్ యాక్షన్ కరెక్టేనని నిరూపించుకోవాల్సి ఉంటుంది. షకీబ్ బౌలింగ్ ద్వారా జట్టుకు తోడ్పడలేకపోయినా, అతను దేశీయ, అంతర్జాతీయ క్రికెట్‌లో బ్యాట్స్‌మన్‌గా ఆడటానికి అర్హుడు. షకీబ్‌పై నిషేధం బంగ్లాదేశ్ జట్టుకు పెద్ద దెబ్బగా మారింది. అతను జట్టులో అత్యంత అనుభవజ్ఞుడైన ఆటగాడు 247 వన్డే మ్యాచ్‌లు ఆడి 7570 పరుగులు చేశాడు. 317 వికెట్లు కూడా తీసుకున్నాడు. దీన్ని బట్టి హసన్ రూపంలో బంగ్లాదేశ్‌కు ఎంత పెద్ద నష్టం వాటిల్లిందో అంచనా వేయవచ్చు.