LSG Captain 2025: లక్నో కెప్టెన్సీకి నలుగురు పోటీ.. రిషబ్ పంత్‌కు ఛాన్స్ వచ్చేనా?
LSG Captain 2025: ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలం ముగిసిన విషయం తెలిసిందే. వేలంలో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ భారీ దాహారలో చరిత్ర సృష్టించాడు. లక్నో సూపర్ జెయింట్స్ ప్రాంచైజీ అతడిని ఏకంగా రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. దాంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా పంత్ రికార్డు నెలకొల్పాడు. లక్నో నుంచి కేఎల్ రాహుల్ బయటికి వచ్చేయడంతో.. పంత్ ఎల్‌ఎస్‌జీ సారథి అని అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే ఎల్‌ఎస్‌జీ ఓనర్ సంజీవ్ గొయెంకా పెద్ద బాంబ్ పేల్చాడు. జట్టులో నలుగురు కెప్టెన్స్ ఉన్నారని, అందులో ఒకరే సారథ్యం వహిస్తారని అన్నాడు.
విండీస్ హిట్టర్ నికోలస్ పూరన్‌ను రూ.21 కోట్లకు రిటైన్ చేసుకున్న లక్నో.. కెప్టెన్సీ అనుభవం ఉన్న ఐడెన్ మార్‌క్రమ్ (రూ.2 కోట్లు), మిచెల్ మార్ష్ (రూ.3.40 కోట్లు)ను వేలంలో కొనుగోలు చేసింది. పంత్ సహా పూరన్ కూడా కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే. దాంతో ఎల్‌ఎస్‌జీలో ఇప్పుడు నలుగురు కెప్టెన్సీకి అర్హత కలిగిన వాళ్లు ఉన్నారు. వీరినే సంజీవ్ గొయెంకా షార్ట్‌లిస్ట్ చేశాడట. అయితే కెప్టెన్ ఎవరనే విషయంపై మాత్రం అతడు క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు టీమ్‌లో నలుగురు లీడర్లు ఉన్నారని, అందరూ గెలవాలనే మనస్తత్వంతో ముందుకు వెళ్తారని సంజీవ్ చెప్పుకొచ్చాడు.
ఆకాష్ చోప్రా యూట్యూబ్ ఛానెల్‌లో సంజీవ్ గొయెంకా మాట్లాడుతూ... 'ఐపీఎల్ 2025 వేలంలో అద్భుతమైన వ్యూహలను అమలు పరిచి సక్సెస్ అయ్యాం. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్, ఫినిషింగ్‌పై దృష్టి సారించాం. 3వ స్థానం నుంచి 8వ స్థానం వరకు జట్టు చాలా బలంగా ఉంది. పేస్ బౌలింగ్ విభాగంలో విదేశీ ఆటగాళ్లకు బదులుగా భారత ప్లేయర్లను తీసుకున్నాం. బ్యాటింగ్‌లో విదేశీ హిట్టర్లను కొనుగోలు చేశాం. ఇప్పుడు రెండు విభాగాల్లో కాంబినేషన్ చాలా బాగుంది. జట్టు పట్ల మేము సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు జట్టు ఎంతో సమతూకంగా ఉంది. మా టీమ్ తరహాలో ఏ టీమ్ కూడా ఇంత బలంగా లేదు. జట్టులో నలుగురు సారథులు ఉన్నారు. రిషభ్ పంత్, నికోలస్ పూరన్, ఐడెన్ మార్‌క్రమ్, మిచెల్ మార్ష్‌లు గెలవాలనే మనస్తత్వం గలవారు అని అన్నారు.
రిషబ్ పంత్‌కు గెలవాలనే తపన ఎంతో ఉంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయాలపాలై మళ్లీ క్రికెట్‌లోకి వచ్చాడు. గతంలో కంటే ఇప్పుడు బాగా ఆడుతున్నాడు. పంత్‌కు 27 ఏళ్లు కాబట్టి.. ఇంకో 10-12 సంవత్సరాలు లక్నోలోనే ఉంటాడని ఆశిస్తున్నా. ఈ జట్టుకు 10కి 10 స్కోర్ ఇస్తా' అని అన్నాడు. లక్నో కెప్టెన్ పంతే అయ్యే అవకాశాలు 100 శాతం ఉన్నాయి.