India vs Japan U19 Asia Cup 2024: కెప్టెన్ సెంచరీ.. ఆసియా కప్‌లో బోణీ కొట్టిన భారత్! 211 పరుగుల తేడాతో విజయం
India vs Japan U-19 Asia Cup 2024: యూఏఈలో జరుగుతున్న అండర్-19 ఆసియా కప్ 2024లో భారత్ బోణీ కొట్టింది. పసికూన జపాన్‌పై 211 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
India vs Japan U-19 Asia Cup 2024: యూఏఈలో జరుగుతున్న అండర్-19 ఆసియా కప్ 2024లో భారత్ బోణీ కొట్టింది. పసికూన జపాన్‌పై 211 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. యువ టీమిండియా బౌలర్ల దెబ్బకు 340 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో జపాన్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 128 పరుగులకే పరిమితమైంది.
ఓపెనర్ హ్యూగో కెల్లీ (50; 111 బంతుల్లో) హాఫ్ సెంచరీ చేశాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఛార్లెస్ హింజ్ (35) రాణించాడు. టీమిండియా బౌలర్లలో హార్దిక్ రాజ్, కార్తికేయ, చేతన్ శర్మ తలో రెండు వికెట్లు పడగొట్టారు. గ్రూప్ దశలో భారత్ తన చివరి మ్యాచులో గెలిస్తే.. సెమీ ఫైనల్ చేరుకుంటుంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగుల భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన యువ టీమిండియాకు మంచి ఆరంభమే దక్కింది. గత మ్యాచ్‌లో విఫలమైన వైభవ్ సూర్యవంశీ పర్వాలేదనిపించాడు. 23 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 23 రన్స్ చేశాడు. ఓపెనర్ ఆయుష్ మాత్రే మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 29 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 54 రన్స్ చేశాడు.
ఆండ్రీ సిద్దార్థ్ (37) రాణించగా.. కెప్టెన్ మహ్మద్ అమన్ (122 నాటౌట్; 118 బంతుల్లో 7 ఫోర్లు) సెంచరీ బాదాడు. అమన్‌కు కేపీ కార్తికేయ (57; 50 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) సహకరించాడు. కార్తికేయ అవుట్ అనంతరం నిఖిల్ కుమార్ (17 బంతుల్లో 12)నెమ్మదిగా ఆడాడు. ఇన్నింగ్స్ చివర్లో హార్దిక్ రాజ్ దూకుడుగా ఆడాడు. 12 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లతో 25 రన్స్ చేయడంతో భారత్ భారీ స్కోర్ చేసింది. జపాన్ బౌలర్లలో కీఫర్ యమమోటో లేక్, హ్యూగో కెల్లీ తలో రెండు వికెట్లు తీశారు.
భారీ లక్ష్య ఛేదనలో జపాన్‌కు మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్లు నిహార్ పర్మార్ (10), హ్యూగో కెల్లీలు 50 పరుగుల భాగస్వామ్యం అందించారు. పర్మార్ అనంతరం కెప్టెన్ కోజీ హార్డ్‌గ్రేవ్ అబే డకౌట్ అయ్యాడు. కాసేపటికే కజుమా కటో-స్టాఫోర్డ్ (8), కెల్లీ కూడా పెవిలియన్ చేరడంతో జపాన్ కష్టాల్లో పడింది. చార్లెస్ హింజే (35 నాటౌట్) క్రీజులో ఉన్నా.. అతడికి సహకారం అందించేవారు కరువయ్యారు. తిమోతీ మూర్ (1), ఆదిత్య ఫడ్కే (9), కీఫెర్ యమమోటో-లేక్ (1), మాక్స్ యోనెకావా లిన్ (1)లు త్వరగానే అవుట్ అయ్యారు.
డేనియల్ పాంక్‌హర్స్ట్ (0) నాటౌట్ గా ఉన్నాడు. ఈ విజయంతో భారత్ ఖాతాలో రెండు పాయింట్స్ చేరాయి. పాకిస్తాన్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఇక డిసెంబరు 4న యూఏఈతో తలపడనుంది.