CSK vs MI 2025: 10 ఏళ్ల తర్వాత చెన్నై జెర్సీలో అశ్విన్ వికెట్.. ముంబైపై సీఎస్‌కే విజయం!

CSK vs MI 2025: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ఐపీఎల్ 2025 సీజన్‌ను ఘనంగా ప్రారంభించింది. తమ హోం గ్రౌండ్ చెపాక్‌లో ముంబై ఇండియన్స్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయంతో ఆరో టైటిల్‌పై కన్నేసిన సీఎస్‌కే తొలి అడుగు వేసింది. అయితే ఈ విజయంలో ఒక ప్రత్యేకత ఉంది. దాదాపు 10 ఏళ్ల తర్వాత రవిచంద్రన్ అశ్విన్ చెన్నై జెర్సీలో వికెట్ తీశాడు.
స్పిన్నర్ల ఆధిపత్యం
చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై స్పిన్నర్లు ముంబై బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. ముంబైని 155 పరుగులకే పరిమితం చేయడంలో అఫ్గాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ కీలక పాత్ర పోషించాడు. అతను 4 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.
అశ్విన్ అద్భుతం
అంతర్జాతీయ క్రికెట్‌కు ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్ ఐదో ఓవర్‌లోనే బౌలింగ్‌కు వచ్చాడు. ఆ ఓవర్ నాలుగో బంతికి ముంబై బ్యాట్స్‌మెన్ విల్ జాక్స్‌ను ఔట్ చేశాడు. అశ్విన్ వికెట్ తీయగానే చెపాక్‌లోని సీఎస్‌కే అభిమానుల ఆనందానికి అవధుల్లేవు.
10 ఏళ్ల నిరీక్షణకు తెర
చెన్నైకి చెందిన అశ్విన్ 2008లో సీఎస్‌కే తరఫునే ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు. 2015 వరకు సీఎస్‌కేలోనే ఉన్నాడు. రెండు టైటిళ్లు గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. చెన్నైపై రెండేళ్ల నిషేధం పడిన తర్వాత అతను ఇతర జట్లకు ఆడాడు. 2015 సీజన్‌లో ఆర్‌సీబీపై క్వాలిఫయర్ 2లో చివరిసారిగా సీఎస్‌కే తరఫున వికెట్ తీశాడు. దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్లీ సీఎస్‌కే జెర్సీలో వికెట్ తీసి అభిమానుల జ్ఞాపకాలను గుర్తు చేశాడు.ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే విజయం సాధించడంతోపాటు అశ్విన్ వికెట్ తీయడం కూడా అభిమానులకు మరింత ప్రత్యేకంగా మారింది.