Top-6 News of the Day: బీఎస్ఎఫ్ డీజీ నితిన్ అగర్వాల్ పై వేటు: మరో 5 ముఖ్యాంశాలు
Top-6 News of the Day: బీఎస్ఎఫ్ డీజీ నితిన్ అగర్వాల్ పై వేటు: మరో 5 ముఖ్యాంశాలు
1. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డీజీ నితిన్ అగర్వాల్ పై కేంద్రం వేటు
నితిన్ అగర్వాల్ .. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్. ఆయనతో పాటు వై. బి. కురానియా (బీఎస్ఎఫ్ ప్రత్యేక డీజీల, పశ్చిమ)పై కేంద్రం వేటు వేసింది. భారత్ - పాకిస్తాన్ సరిహద్దు వెంట జరిగిన ఉగ్రవాద కార్యకలాపాల నేపథ్యంలో మోదీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. ఇటీవల కాలంలో సరిహద్దు ప్రాంతంలో పాకిస్తాన్ నుంచి చొరబాట్లు పెరిగిపోతున్నాయి. నితిన్ అగర్వాల్ 1989 బ్యాచ్ కేరళ క్యాడర్ అధికారి. కురానియా 1990 బ్యాచ్ ఒడిశా కేడర్ అధికారి.
2. అమెరికా అధ్యక్ష ఎన్నికలు: డెమోక్రటిక్ అభ్యర్ధిగా కమలా హారిస్ పేరు ఖరారు
కమలా హారిస్ పేరును అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు డెమోక్రటిక్ పార్టీ ఖరారు చేసింది. డెమోక్రటిక్ పార్టీ నేషనల్ కమిటీ ఛైర్మన్ జేమ్ హరిసన్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 22న చికాగోలో జరిగే పార్టీ ప్రతినిధుల సభలో హారిస్ లాంఛనంగా నామినేషన్ ను స్వీకరిస్తారు. గత నెలలో అధ్యక్ష ఎన్నికల బరి నుంచి జో బైడెన్ తప్పుకున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో హారిస్ పేరును ఆయన ప్రతిపాదించారు. పార్టీలోని కీలక నాయకులు కూడా హారిస్ కు మద్దతు ప్రకటించారు. శుక్రవారం నాడు వర్చువల్ గా నిర్వహించిన పార్టీ సమావేశంలో హారిస్ పేరును మెజారిటీ నాయకులు బలపర్చారు.
3. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కించపర్చడం వల్లే అలా మాట్లాడా: అసెంబ్లీలో పరుష వ్యాఖ్యలపై దానం నాగేందర్
దానం నాగేందర్ ఈ నెల 2న అసెంబ్లీలో ఉపయోగించిన పరుష పదజాలంపై వివరణ ఇచ్చారు. హైద్రాబాద్ లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. శుక్రవారం అసెంబ్లీలో తనను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పరుషపదజాలంతో దూషించారని చెప్పారు. ఈ వ్యాఖ్యలు మైక్ లో రికార్డు కాలేదన్నారు. ఈ వ్యాఖ్యలను విన్నందునే తాను అలా రియాక్ట్ కావాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. తాను ఉపయోగించిన భాష హైద్రాబాద్ లో వాడుక భాషగా ఆయన చెప్పారు. ఈ వ్యాఖ్యలతో ఎవరికైనా బాధ కలిగిస్తే క్షమాపణలు చెబుతున్నట్టుగా ఆయన తెలిపారు.
4. అక్రమాలకు పాల్పడిన వారిని వదిలేదు: చంద్రబాబు
చంద్రబాబునాయుడు శనివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి శనివారం పార్టీ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు ఆయన సమయం కేటాయిస్తున్నారు. ఈ కార్యక్రమం తర్వాత చంద్రబాబు మీడియాతో చిట్ చాట్ చేశారు. వైఎస్ జగన్ అధికారంలో ఉన్న సమయంలో అక్రమాలకు పాల్పడిన అధికారులను వదిలేదని స్పష్టం చేశారు. రెవిన్యూ సమస్యలపైనే ఎక్కువగా ప్రజల నుంచి వినతులు వస్తున్నాయని ఆయన చెప్పారు. వంద రోజుల్లో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను గాడిలో పెడుతామని ఆయన తెలిపారు.
5. ఐఎస్ఎస్ యాత్రకు శుభాంశు శుక్లా ఎంపిక
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేపట్టే యాత్రకు గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ఇస్రో ప్రకటించింది. అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ. అయితే ఐఎస్ఎస్ యాత్రలో భాగంగా మరోసారి భారతీయలు అంతరిక్షంలో అడుగుపెట్టనున్నారు. అమెరికా సహకారంతో భారత్ ఈ యాత్రను చేపట్టనుంది. శుభాంశు శుక్లా ఏదేని పరిస్థితుల్లో ఈ యాత్రకు దూరంగా ఉండాల్సి వస్తే ఆయన స్థానంలో కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ ను పంపనున్నారు. 2025 లో మానవసహిత అంతరిక్ష యాత్ర ను భారత్ నిర్వహించనుంది. అయితే ఈ ఇద్దరికి అంతరిక్షయానం కోసం శిక్షణ ప్రారంభం కానుంది.
6. ఎల్ ఆర్ఎస్ ప్రక్రియను 3 నెలల్లో పూర్తి చేయాలి: పొంగులేటి
ఎల్ఆర్ఎస్ (లేఔట్ల రెగ్యులరైజేషన్) కింద అక్రమ లే ఔట్లు, ప్లాట్ల క్రమబద్దీకరణను మూడు నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై అధికారులతో రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ కోసం ధరఖాస్తు చేసుకున్నవారి కోసం కలెక్టరేట్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో 25.70 లక్షల మంది ఎల్ఆర్ఎస్ కోసం ధరఖాస్తు చేసుకున్నారని మంత్రి చెప్పారు.