Top-6 News of the Day: కంగనా రనౌత్ కు హైకోర్టు నోటీసులు: మరో 5 ముఖ్యాంశాలు

Top-6 News of the Day: కంగనా రనౌత్ కు హైకోర్టు నోటీసులు: మరో 5 ముఖ్యాంశాలు

Update: 2024-07-25 12:24 GMT

Top-6 News of the Day: కంగనా రనౌత్ కు హైకోర్టు నోటీసులు: మరో 5 ముఖ్యాంశాలు

1. రూ. 2.91లక్షలతో తెలంగాణ బడ్జెట్

మల్లు భట్టి విక్రమార్క రూ. 2,91,191 కోట్లతో 2024-25 ఆర్ధిక సంవత్సరానికి తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ సమర్పించారు. హైద్రాబాద్ నగరానికి బడ్జెట్ లో రూ. 10 వేల కోట్లు కేటాయించారు. వ్యవసాయానికి రూ. 72 వేల కోట్లు ప్రతిపాదించారు. ఈ బడ్జెట్ లో కొత్త పథకాల ప్రస్తావన లేదని బీఆర్ఎస్ విమర్శించింది. రైతు వ్యతిరేక బడ్జెట్ గా ఆ పార్టీ అభిప్రాయపడింది. బీఆర్ఎస్ విమర్శలను కాంగ్రెస్ కొట్టిపారేసింది.


2. శాంతి భద్రతలపై అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేసిన చంద్రబాబు

శాంతిభద్రతలకు విఘాతం కల్గించే వ్యక్తి ఏ స్థాయిలో ఉన్న శిక్షిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. గురువారం ఏపీ అసెంబ్లీలో శాంతిభద్రతలపై శ్వేత పత్రం విడుదల చేశారు. రాజకీయ ప్రేరేపిత కేసులను సమీక్షిస్తామన్నారు. అక్రమ కేసులు పెట్టిన అధికారులను శిక్షించేందుకు సిద్దమన్నారు. శాంతిభద్రతలపై లోతుగా చర్చించేందుకు మరో సమావేశం పెట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు. ఇందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో తనపై 17 కేసులు, పవన్ కళ్యాణ్ పై 7 కేసులు నమోదు చేశారన్నారు. సభలో కేసులున్నవారిని లేచి నిల్చోవాలని కోరగానే పవన్ కళ్యాణ్ తో పాటు మెజారిటీ ఎమ్మెల్యేలు నిలబడ్డారు.


3. కంగనా రనౌత్ కు హిమాచల్ హైకోర్టు నోటీసులు

కంగనా రనౌత్ కు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మండి ఎంపీ స్థానంలో తన నామినేషన్ పత్రాలను అకారణంగా తిరస్కరించారని లాయక్ రామ్ నేగి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ నేపథ్యంలో రనౌత్ కు కోర్టు నోటీసులు పంపింది. ఈ నెల 21 లోపుగా ఈ నోటీసులపై స్పందన తెలపాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. మండి పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్ధి విక్రమాదిత్య సింగ్ పై కంగనా రనౌత్ 74,755 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.


4. కమలా హారిస్ పై ట్రంప్ విమర్శలు

కమలా హారిస్ ను డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధిగా ఇంకా నామినేట్ చేయలేదు. కానీ, పార్టీలో మెజారిటీ నాయకులు ఆమె అభ్యర్ధిత్వానికి మద్దతుపలికారు. దీంతో ఆమె ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మరో వైపు హారిస్ పై రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనల్డ్ ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. ఆమెను తీవ్రమైన వామపక్ష ఉన్మాది అంటూ ఫైరయ్యారు. బైడెన్ వైఫల్యాల వెనుక హారిస్ ఉన్నారన్నారు. హారిస్ కు అధికారమిస్తే దేశం సర్వనాశనం అవుతుందని ఆయన చెప్పారు. తనను మరోసారి అధ్యక్షుడిగా గెలిపించాలని ఆయన కోరారు.


5. అధికారం కోల్పోయిన అసెంబ్లీకి తొలిసారిగా హాజరైన కేసీఆర్

అధికారానికి దూరమైన తర్వాత తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గురువారం కేసీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ బడ్జెట్ ను ప్రభుత్వం ఇవాళ ప్రవేశ పెట్టింది. రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ సహా, మంత్రులు కోరారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బడ్జెట్ పై కేసీఆర్ స్పందించారు. ఈ బడ్జెట్ రైతు వ్యతిరేక బడ్జెట్ గా ఆయన చెప్పారు. కొత్త పథకాల ప్రస్తావన బడ్జెట్ లో లేదన్నారు.


6. నీట్ యూజీ -2024 రివైజ్డ్ ఫలితాల విడుదల: 17కి పడిపోయిన టాప్ ర్యాంకర్లు

నీట్ యూజీ-2024 రివైజ్డ్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గురువారం విడుదల చేసింది. తాజా ఫలితాల ఆధారంగా టాప్ ర్యాంక్ సాధించిన వారి సంఖ్య 17కి తగ్గింది. ఫిజిక్స్ విభాగంలోని ఓ ప్రశ్నకు ఒకే సమాధానం ఉంటుందని నిపుణుల కమిటీ తేల్చడంతో దాని ఆధారంగా ఫలితాలను సవరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఇవాళ పరీక్ష తుది ఫలితాలను విడుదల చేశారు. తుది ఫలితాల్లో 4.2 లక్షల మంది అభ్యర్థులు ఐదు మార్కులను కోల్పోయారు. ఫలితంగా టాప్ ర్యాంక్ సాధించిన వారి సంఖ్య 61 నుంచి 17కి తగ్గింది.

Tags:    

Similar News