Top-6 News of the Day: హర్యానా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల: మరో 5 ముఖ్యాంశాలు

Top-6 News of the Day: హర్యానా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల: మరో 5 ముఖ్యాంశాలు

Update: 2024-08-16 12:46 GMT

Top-6 News of the Day: హర్యానా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల: మరో 5 ముఖ్యాంశాలు

1.హర్యానా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

హర్యానా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం షెడ్యూల్ ప్రకటించింది. హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు ఈ ఏడాది అక్టోబర్ 1న పోలింగ్ నిర్వహిస్తారు. అదే నెల 4న ఓట్లు లెక్కిస్తారు.

హర్యానా ఎన్నికల షెడ్యూల్

ఎన్నికల నోటిఫికేషన్ సెప్టెంబర్ 05

నామినేషన్ల స్వీకరణ సెప్టెంబర్ 12

నామినేషన్ల స్కృూట్నీ సెప్టెంబర్ 13

నామినేషన్ల ఉపసంహరణ సెప్టెంబర్ 16

జమ్మూకశ్మీర్ లో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 18న రాష్ట్రంలోని 24 అసెంబ్లీ స్థానాలకు, సెప్టెంబర్ 25న 26 స్థానాలకు, అక్టోబర్ 1న 40 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. అక్టోబర్ 4న ఓట్లు లెక్కిస్తారు.

2. విశాఖ స్థానికసంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన బొత్స

విశాఖపట్టణం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వంశీకృష్ణ యాదవ్ జనసేనలో చేరడంతో వైఎస్ఆర్ సీపీ ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనపై మండలి చైర్మన్ అనర్హత వేటు వేశారు. ఈ స్థానం ఖాళీ అవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని ఎన్ డీ ఏ కూటమి నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్ సీపీ అభ్యర్ధిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. ఇండిపెండెంట్ గా షఫీఉల్లా నామినేషన్ దాఖలు చేశారు. షఫీఉల్లా తన నామినేషన్ ను విత్ డ్రా చేసుకోవడంతో బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

3.కోడండరామ్, అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం

కోదండరామ్, అమీర్ అలీఖాన్ లు శుక్రవారం ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరిద్దరితో ప్రమాణం చేయించారు. ఈ ఏడాది మార్చి 7న తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు రెండు రోజుల క్రితం స్టే ఇచ్చింది. దీంతో వీరిద్దరి ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియరైంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్ కుమార్, కుర్ర సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా గవర్నర్ కు సిఫారసు చేశారు. అప్పటి గవర్నర్ తమిళిసై ఈ సిఫారసులను తిరస్కరించారు. తదనంతరం అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ కోదండరామ్, అమీర్ అలీఖాన్ ల పేర్లను సిఫారసు చేసింది. గవర్నర్ ఆమోదించారు. అయితే దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ నిర్వహించిన హైకోర్టు యథాతథస్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

4. చంద్రబాబు ఇంటివద్ద దాడి కేసులో విచారణకు హాజరైన జోగి రమేష్

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ఇంటి వద్ద దాడి చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో పోలీసుల విచారణకు మాజీ మంత్రి జోగి రమేష్ హాజరయ్యారు. ఆ సమయంలో ఉపయోగించిన ఫోన్ ను పోలీసులకు ఆయన అందించారు. గంటకు పైగా పోలీసులు ఆయనను విచారించారు. రమేష్ తో పాటు ఆయన డ్రైవర్ తాండ్ర రాముని కూడా పోలీసులు విచారించారు. కక్షపూరితంగానే తనపై చంద్రబాబు సర్కార్ కేసు నమోదు చేసిందని జోగి రమేష్ చెప్పారు.

5. 70వ జాతీయ సినిమా అవార్డ్స్ ను ప్రకటించిన కేంద్రం

70వ జాతీయ సినిమా అవార్డులను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఉత్తమ చిత్రంగా మలయాళానికి చెందిన 'ఆట్టమ్‌' అవార్డు దక్కించుకుంది. ఆనంద్ ఎకర్షి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక బెస్ట్ యాక్టర్ గా కాంతార మూవీకిగాను రిష‌బ్ శెట్టి అవార్డును ద‌క్కించుకున్నారు. తరుచిత్రాంబళం చిత్రానికి గాను నిత్యామీనన్‌, కచ్‌ ఎక్స్‌ప్రెస్ మూవీకి గాను మానసి పరేఖ్‌ ఉత్తమ నటి విభాగంలో అవార్డులను సొంతం చేసుకున్నారు.ఉత్తమ ప్రాంతీయ విభాగంలో తెలుగులో కార్తికేయ 2 మూవీ నిలిచింది. నిఖిల్‌ హీరోగా వచ్చిన ఈ సినిమా పాన్‌ ఇండియా రేంజ్‌లో మంచి కలెక్షన్లను రాబట్టింది.

6. ఒకే వేదికపై జో బైడెన్, కమలాహరీస్

జో బైడెన్, కమలా హరీస్ కలిసి వాషింగ్టన్ శివార్లలోని మేరీల్యాండ్ కమ్యూనిటీ కాలేజీలో డెమోక్రటిక్ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకున్న తర్వాత బైడెన్, హరీష్ లు ఒకేవేదికను పంచుకోవడం ఇదే తొలిసారి. అధ్యక్ష పదవిని హరీస్ చేపడితే అద్భుతంగా పనిచేస్తారని ఆయన చెప్పారు.

Tags:    

Similar News