Supermoon: నేడు ఆకాశంలో అద్భుతం.. రాత్రి కనువిందు చేయనున్న అరుదైన సూపర్ బ్లూ మూన్.. ఎప్పుడంటే?
రక్షా బంధన్ రోజు అందరికీ ప్రత్యేకమైనది. అంతరిక్షంపై ఆసక్తి ఉన్న వారికి మరీ ప్రత్యేకం కానుంది. ఎందుకంటే ఈ ఆగస్టు 19న ఆకాశంలో బ్లూ మూన్ కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
రక్షా బంధన్ రోజు అందరికీ ప్రత్యేకమైనది. అంతరిక్షంపై ఆసక్తి ఉన్న వారికి మరీ ప్రత్యేకం కానుంది. ఎందుకంటే ఈ ఆగస్టు 19న ఆకాశంలో బ్లూ మూన్ కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.అయితే పౌర్ణమి రోజున చంద్రుడు ఎందుకు అంత ప్రత్యేకంగా ఉంటాడు అనే ప్రశ్న చాలామంది మదిలో తలెత్తుతుంది. మరి దాని వెనుక ఉన్న సైన్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
రాఖీ పండుగ రోజు ఆకాశంలో సూపర్ బ్లూ మూన్ కనువిందు చేయనుంది. రోజూ వచ్చే చంద్రుడిలాగా కాకుండా జాబిల్లి ఆగస్టు 19 న పెద్దగా, అత్యంత కాంతివంతంగా కనిపించనుంది. భూమికి అత్యంత సమీపానికి చంద్రుడు వచ్చినపుడు పౌర్ణమి రావడంతో ఆకాశంలో ఈ అద్భుతమైన సూపర్ బ్లూ మూన్ ఆవిష్కృతం కానుంది. ఈ సంవత్సరంలో మొదటి సూపర్ మూన్ ఈ సోమవారం రాబోతోంది.
చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు కొన్నిసార్లు భూమికి దగ్గరగా వస్తుంది. మరికొన్ని సార్లు అది భూమికి దూరంగా కదులుతూ ఉంటుంది. చంద్రుడు భూమికి 90 శాతం సమీపంలో ఉన్నప్పుడు అద్భుతాలు జరుగుతుంటాయి. అలాంటి రోజునే సూపర్ మూన్ ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ రోజున చంద్రుడు పూర్తిగా కనిపిస్తాడు. చంద్రుడు దగ్గరగా ఉండటం వల్ల, అది పరిమాణంలో కొంచెం పెద్దదిగా కనిపిస్తుంది. దాన్ని సూపర్ మూన్ అంటారు.సూపర్ మూన్‌లు సాధారణంగా సంవత్సరానికి 3-4 సార్లు సంభవిస్తాయి.
ఈ ఆగస్టు నెలలో సూపర్ మూన్, బ్లూ మూన్ కలిసి వచ్చే అరుదైన ఖగోళ సంఘటనను చూడటానికి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది దశాబ్దానికి ఒకసారి మాత్రమే జరిగే సంఘటన. ఆగస్టులో వచ్చే పౌర్ణమికి ఇచ్చే సంప్రదాయ నామం 'స్టర్జన్ మూన్' కాబట్టి, ఈ సూపర్ మూన్ బ్లూ మూన్ ను 'స్టర్జన్ మూన్' అని కూడా పిలుస్తారు. ఈ సంవత్సరం వరుసగా రాబోతున్న నాలుగు సూపర్ మూన్ లలో ఇది మొదటిది (తర్వాతవి సెప్టెంబర్ 18 న, అక్టోబర్ 17, నవంబర్ 15 న రానున్నాయి).
చంద్రుడు రోజూ ఒకేలా కనిపించడు. ఒక్కో రోజు ఒక్కోవిధంగా ఉదయిస్తాడు. చంద్రుడు ఎనిమిది దశల్లో ఆకాశంలో కనిపిస్తాడు. కొన్నిసార్లు పూర్తిగా, కొన్నిసార్లు సగం ఇలా కనిపిస్తాడు. చంద్రుని దశల చక్రం ఒక నెల పాటు కొనసాగుతుంది. అందుకే మనం సాధారణంగా సంవత్సరంలో 12 పౌర్ణమి చంద్రులను చూస్తాం.
బ్లూ మూన్‌ను ఎక్కడ... ఏసమయంలో అంటే..
భారతదేశం: ఆగస్టు 19 రాత్రి 8 గంటల నుంచి ఆగస్టు 20 తెల్లవారుజాము 5.32 వరకు.
ఉత్తర అమెరికా: వాళ్ల కాలమానం ప్రకారం ఆగస్టు 19 మధ్యాహ్నం 2:26 ఇడిటి (ఈస్టర్న్ డేలైట్ టైమ్) సూపర్ బ్లూమూన్ కనిపిస్తుంది.
యూరప్: ఆగస్టు 18 సాయంత్రం నుంచి ఆగస్టు 19 రాత్రి వరకు, ఆగస్టు 20 తెల్లవారుజాము వరకు.
ఆఫ్రికా: ఆగస్టు 18 సాయంత్రం నుంచి ఆగస్టు 19 రాత్రి వరకు మరియు ఆగస్టు 20 తెల్లవారుజాము వరకు.
కానీ నాసా ప్రకారం, ఇది ఆదివారం ఉదయం నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు.. సుమారు మూడు రోజుల పాటు నిండుగా కనిపిస్తుంది.
సూపర్ మూన్ ను ఎలా వీక్షించాలి?
ముఖ్యంగా సిటీ లైట్లకు, లైట్ల కాలుష్యానికి దూరంగా ఉన్న చీకటిగా ఉన్న ప్రదేశంలోనుంచి వీక్షించాలి.
హై క్వాలిటీ కెమెరా ఉంటే ఆ దృశ్యాలని బంధించవచ్చు.
ముందుగానే వ్యూయింగ్ స్పాట్ కు వెళ్లి చంద్రుడి వివిధ దశలను మిస్ కాకుండా చూసుకోవాలి.
బైనాక్యులర్లు లేదా టెలిస్కోపులు ఉంటే క్లియర్ గా కనపడుతుంది.
కెమెరాతో చిత్రాలు తీయాలనుకుంటే మంచి లాంగర్ ఎక్స్‌పోజర్ కెమెరా వాడండి.
స్మార్ట్ ఫోన్ వాడితే మ్యాన్యువల్ గానే ఎక్స్‌పోజర్ అడ్జస్ట్ చేసుకోండి.
బయటి వాతావరణం నేరుగా చంద్రుణ్ని చూడ్డానికి సహకరించకపోతే ఏదైనా లైవ్ స్ట్రీమింగ్ చూసి ఆనందించండి.