చల్లని గాలులు.. చేపల వంటలూ..మృగశిర ముచ్చట్లు!
మృగశిర కార్తెలో ముంగిళ్ళు చల్లబడును, మృగశిర కురిస్తే ముసలెద్దు రంకె వేయును, మృగశిరకు ముల్లోకాలు చల్లబడును అంటుంటారు మన పెద్దవాళ్లు.
మృగశిర కార్తెలో ముంగిళ్ళు చల్లబడును, మృగశిర కురిస్తే ముసలెద్దు రంకె వేయును, మృగశిరకు ముల్లోకాలు చల్లబడును అంటుంటారు మన పెద్దవాళ్లు.రోళ్లు పగిలే ఎండలను మోసుకొచ్చిన రోహిణి కార్తె ముగిసి.. ముంగిళ్లు చల్లబరిచే మృగశిర మొదలవనున్నది. జూన్ 8వ తేదీ ప్రారంభం అవుతుంది. అయితే ఈ కార్తె మొదటి రోజుకి ఓ ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ప్రతి ఒక్కరూ చేపలు తినడం , చేప మందులు తినడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. అసలు ఈ రోజున చేపమందు కానీ, చేపలు కానీ ఎందుకు తింటారు దీని వెనక ఉన్న ఆరోగ్యరహస్యం ఏంటి నేటి యువతకు అస్సలు తెలియదు. ఆ రహస్యం ఏంటంటే ఈ కార్తెలో ఎక్కువగా మనిషి శరీరంలో మార్పులు జరిగి, ఎక్కువ మంది వ్యాధుల బారిన పడే ప్రమాదమున్నది. గుండె జబ్బు, అస్తమా బాధితులు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే ముప్పు ఉంది. వీటన్నింటిని తట్టుకోవాలంటే ఈ రోజున ఖచ్చితంగా చేపలు తినాల్సిందే. అయితే జబ్బులు వస్తే వైద్యులు దగ్గరకు వెళతారు కానీ మృగశిర రోజు చేపలు తింటే రోగాలు రావా అని అనుకోవచ్చు అయితే అసలు ఈ చేపలకు, మృగ శిరకార్తెకు ఉన్న సంబంధం ఏమిటో, తింటే ఏం ప్రయోజనం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
వ్యాధుల నియంత్రణకు చేపలు
మృగశిర కార్తె ఎండలను పోగొట్టి వానలతో పాటు చల్లని, చక్కని వాతావరణాన్ని తీసుకొస్తుంది. ప్రతి కార్తె ఉన్నట్టు ఈ కార్తె కూడా 15 రోజుల పాటు ఉంటుంది. అయితే ఈ కార్తెలో చేపలు తింటే రోగాలు రావని మృగశిర ప్రారంభంలో చేపలు తినడాన్ని మన పూర్వీకులు మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఆ ఆచారం అలానే వస్తుంది. అసలు ఎందుకు తినాలంటే ఈ కార్తెలో మన శరీరంలో ఉష్ణోగ్రతలు ఎండకాలం తర్వాత వాతావరణం ఎలా చల్లబడుతుందో అదే విధంగా చల్లబడుతుంది. దీంతో చాలా మంది ఆస్తమా, గుండె పోటు, అజీర్తి, జ్వరం, దగ్గు లాంటి జబ్బులకు లోనవుతారు ఈ క్రమంలోనే శనీరంలో వేడి ఉండేందుకు చేపలను తింటారు. దాని ద్వారా రోగాల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ కార్తెలో పూర్వీకులు శాఖాహారులైతే ఇంగువను బెల్లంలో కలుపుకుని గోలిలాగా తయారు చేసుకొని తినేవారు. మాంసాహారులైతే చేపలను ఇంగువ, చింత చిగురుతో కలుపుకుని తినేవారు.
ఇంటింటా చేపల పులుసే..
మృగశిర వచ్చిదంటే చాలు ఆ కార్తె ప్రవేశం రోజు ప్రతి ఇంటా చేపల కూర ఘుమ ఘుమలు గుప్పుమంటాయి. ఒక ఫ్రై, మరో దిక్కు పులుసు చేపల్ కూరలో ఎన్ని రకాల వంటలు ఉంటాయో అన్ని చేసుకుంటూ ఉంటారు. ఆరోజున ఎప్పుడూ తినని కూడా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కనీసం రెండు ముక్కలైనా నోట్లో వేసుకుంటారు. ఇక చేపలు మొత్తంగా ఇష్టం లేని వారు రొయ్యలు, ఎండ్రికాయలతో పులుసు చేసుకొని జుర్రుకుంటారు.
పోషకవిలువలు
చేపలు ఉత్తమ పోషకాల్ని అందిస్తాయి. గుండెజబ్బుతో బాధపడుతున్నవారు చేపల్ని తినడం మంచిది. వీటిల్లో 18-20 శాతం మాంసకృత్తులు ఉంటాయి. ఇవి తేలిగ్గా అరుగుతాయి. వీటి మాంసకృత్తుల్లో మనకవసరమైన ఎనిమిదిరకాల అమైనో యాసిడ్లు లభిస్తాయి. ముఖ్యంగా గంధకం కలిగిన లైసీన్, మిథియోనిన్, సిస్టీన్ అమైనోయాసిడ్లు లభిస్తాయి. చేపల... రకం, వయస్సును బట్టి వీటిలో కొవ్వు 0.2 నుండి 20 శాతం వరకూ ఉంటుంది. కానీ, దీనిలో ఉండే కొవ్వు నాణ్యమైనది (పోలి అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్). దీనిలో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్లు పిల్లల పెరుగుదలకు అవసరం. ఇవి గుండెజబ్బుల్ని కలిగించవు. పిండంలో మెదడు పెరుగుదలకు ఈ కొవ్వు దోహదపడుతుంది. దీనివల్ల నెలలు నిండకుండానే ప్రసవించే ప్రమాదం తగ్గుతుంది. చేప కొవ్వు ద్వారా ఎ, డి, ఇ, కే విటమిన్లు మన శరీరానికి తేలికగా అందుతాయి. సూక్ష్మ పోషకాలైన విటమిన్ ఎ, డి చేపల్లో పుష్కలం. థయామిన్, రిబోఫ్లేవిన్, నియోసిన్లు చేపల్లో అధికంగా ఉంటాయి.
ఆకుకూరల ద్వారా లభించే విటమిన్ ఎ కన్నా చేపల్లో ఉన్న విటమిన్ ఎ తేలిగ్గా అందుతుంది. ఇది మంచి కంటిచూపుకు దోహపడుతుంది. చేపల కాలేయంలో ఉండే విటమిన్ డి ఎముకల పెరుగుదలకు కీలకం. ఆహారంలో ఉన్న కాల్షియాన్ని స్వీకరించడానికి, వినియోగానికి విటమిన్ డి అవసరం. థయామిన్, నియోసిన్, రిబోఫ్లేమిన్ ఆహారంలో శక్తి వినియోగానికి, విడుదలకు అవసరం. తాజా చేపల్ని తిన్నప్పుడు విటమిన్ సి కూడా అందుతుంది. సముద్రపు చేపల్లో అయోడిన్ అధికంగా ఉంటుంది. చేపల్లో ఇనుము, కాల్షియం, జింకు, భాస్వరం, ఫ్లోరిన్లు బాగా ఉపయోగపడే రూపంలో ఉంటాయి. చిన్న చేపల్ని (చేతి పరికెలు) ముల్లుతో సహా తిన్నప్పుడు కాల్షియం, భాస్వరం, ఐరన్ అధికంగా లభిస్తాయి. కానీ, ముల్లు తీసేసి తింటే ఇవి తక్కువగా లభిస్తాయి. గట్టి ఎముకలకు, పళ్లకు ఫ్లోరిన్ అవసరం. రక్తవృద్ధికి హీమోగ్లోబిన్ అవసరం.
ఇందుకు ఇనుము బాగా తోడ్పడుతుంది. ఇది చేపల్లో విరివిగా లభిస్తుంది. అయోడిన్ మెదడు ఎదుగుదలకు దోహదపడుతుంది. ఇది చేపల్లో పుష్కలంగా లభిస్తుంది. ఇది లోపస్థాయిలో ఉన్నప్పుడు గాయిటర్ అనే జబ్బు వస్తుంది. మానసిక ఎదుగుదల లేకుండా పోతుంది. జింక్ అత్యవసర ఎంజైమ్‌ల ఉత్పత్తికి, నిరోధకశక్తి పెరుగుదలకు, ఆరోగ్యకర చర్మానికి అవసరం. మృగశిర కార్తెలో ఏ చేపలను ఏ రూపంలో తిన్నా మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ప్రస్తుతం కొవిడ్-19 నేపథ్యంలో స్థానికంగా దొరికే నాణ్యమైన పెద్ద చేపలను ఇంగువ, చింత చిగురుతో కలిపి వండుకుని తినడం చాలా మంచిదని పలువురు మేధావులు చెబుతున్నారు.