Solar Eclipse 2020: ఈరోజు సూర్యగ్రహణం.. ప్రత్యేకతలు ఇవే!
ఆకాశవీధిలో అద్భుతం జరగబోతోంది. అరుదైన వార్షిక సూర్యగ్రహణం కొద్ది సేపట్లో ఆవిష్కృతం కాబోతోంది.
ఆకాశవీధిలో అద్భుతం జరగబోతోంది. అరుదైన వార్షిక సూర్యగ్రహణం కొద్ది సేపట్లో ఆవిష్కృతం కాబోతోంది. సూర్య గ్రహణం అనగానే రాహువు..కేతువు అంటూ పెద్దలు చెప్పే కబుర్లు గుర్తొస్తాయి. అయితే, ఖగోళ శాస్త్రజ్ఞులకు మాత్రం గ్రహణం అనగానే ఎన్నో విషయాలపై వారు చేసే ప్రయోగాలకు ప్రత్యేకరోజుగా ఉంటుంది. ఈసారి వస్తున్న ఈ సూర్య గ్రహణానికి ఓ ప్రత్యేకత ఉంది. సూర్యుడికి, భూమికి మధ్యలో వచ్చే చంద్రుని నీడతో సూర్యగ్రహణం ఏర్పడుతుందనే విషయం తెలిసిందే. అయితే, ఈరోజు గ్రహణ సందర్భంగా సూర్యునికి చాలా దూరంగా చంద్రుడు కదులుతాడు. అందుకే 70 శాతం నీడ మాత్రమె సూర్యునిపై పడుతుంది. దాంతో గ్రహణ సమయంలో ఖగోళ అద్భుతాల్లో ఒకటిగా చెప్పుకునే 'రింగ్ ఆఫ్ పైర్' కనిపిస్తుంది. ఇది చాలా అరుదుగా కనిపించే అద్భుతం. అందుకే శాస్త్రవేత్తలు చాలా ఉత్సుకతతో ఈ సూర్యగ్రహణం కోసం ఎదురుచూస్తున్నారు. సూర్యగ్రహణం మనం నేరుగా చూడగలిగేది కాదు. అంతే కాదు, ఫిల్ములతోనూ.. అద్దాలకు మసిపూసి.. బైనాక్యులర్స్ తోనూ ఇలా రకరకాలుగా సూర్య గ్రహణం చూడాలని ప్రయత్నిస్తారు. అది ప్రమాదానికి దారితీస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఎప్పటి నుంచి ఎప్పటిదాకా..
దేశవ్యాప్తంగా సూర్యగ్రహణం ఉదయం గం.9:15 గంటలకు మొదలై మధ్యాహ్నం 12:10 గంటలకు అత్యున్నత స్థితికి చేరుకొని మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది. అయితే ప్రాంతాలను బట్టి సమయంలో కాస్త మార్పులు ఉంటాయని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. గ్రహణం తెలంగాణలో ఉదయం 10.15 గంటల నుంచి 1.44 గంటల వరకు ఉంటుంది. 51 శాతం గ్రహణం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 10.21 గంటల నుంచి మధ్యాహ్నం 1.49 గంటల వరకు 46 శాతం గ్రహణం ఉంటుంది. విశ్వ వ్యాప్తంగా 3గంటల 33 నిమిషాలపాటు గ్రహణం ఉంటుంది.