Raksha bandan 2020: రాఖీ పండుగ తో పాటు శ్రావణ పౌర్ణిమ కు ఎన్ని ప్రత్యేకతలో!

Raksha bandhan 2020: శ్రావణ పూర్ణిమ కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. పౌరానికంగా..చారిత్రాత్మకంగా కూడాఈ పండుగ ప్రత్యేకమైనదే!

Update: 2020-07-31 15:13 GMT

బీదాగొప్పా.. కులమూ మతమూ అనే బేధం ఉండదు. వయసుతో సంబంధం లేదు... రాఖీ వచ్చిందంటే చాలు, దేశమంతా అన్నాచెల్లెళ్ళ నబందాల సందడిగా మారిపోతుంది. నువ్వు చల్లగా ఉండాలి సోదరా అంటూ ఆడపడుచులు  రాఖీ కడితే, నీ కోసం నేనున్నాను అన్న అండని సోదరులు అందిస్తారు.

పాశ్చాత్యుల ప్రభావంతో రోజుకో సంబరం వచ్చిపడుతోంది. కానీ రాఖీ అలా కాదు. భాగవతం, భవిష్యపురాణం వంటి ప్రాచీన గ్రంథాలలోనే రాఖీ ప్రసక్తి కనిపిస్తుంది. విష్ణుమూర్తి దగ్గర నుంచీ కృష్ణుని వరకూ ఈ రాఖీని ఆచరించిన ఘట్టాలు వినిపిస్తాయి.

పురాణాలు, ప్రాచీన గ్రంథాలలోనే కాదు.... రాఖీ సంప్రదాయం మన చరిత్రలో అణువణువునా కనిపిస్తుంది. అలగ్జాండర్ మన దేశం మీదకు దండెత్తి వచ్చినప్పుడు, అతడిని పురుషోత్తముడనే రాజు నిలువరించాడు. పురుషోత్తముని చేతిలో తన భర్త హతం అవుతాడనే భయంతో, అలగ్జాండర్ భార్య పురుషోత్తముని పతిభిక్ష వేడుకుంటూ రాఖీని పంపిందట. మొఘల్ పాలనలో చిత్తోడ్ రాజ్యాన్ని ఏలుతున్న కర్నావటి అనే రాణి కూడా అప్పటి మొఘల్ చక్రవర్తి హుమాయున్కి రాఖీని పంపిందని చరిత్ర చెబుతోంది. ఇక రవీంద్రనాథ్ టాగూర్ సైతం స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రజలందరినీ ఒకటిగా ఉంచేందుకు, రక్షాబంధనాన్ని ప్రోత్సహించారట.

శ్రావణపౌర్ణమి రోజున కేవలం రాఖీ మాత్రమే కాదు... ఇతరత్రా ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. జంధ్యం ఆనవాయితీ ఉన్నవారు, ఈ రోజున పాత జంధ్యం స్థానంలో నూతన జంధ్యాన్ని ధరిస్తారు. అందుకనే దీన్ని జంధ్యాల పౌర్ణమి అని పిలుస్తారు. విష్ణుమూర్తి జ్ఞానస్వరూపమైన హయగ్రీవుడు ఉద్భవించిందీ ఈ రోజునే. అంచేత హయగ్రీవ జయంతినీ జరుపుకొంటారు. ఇక బెంగాల్ రాష్ట్రంలో ఝూలన్ పౌర్ణమి పేరుతో, ఈ రోజున రాధాకృష్ణుల విగ్రహాలను ఊయలలో ఉంచి ఊరేగిస్తారు. మరి కొన్ని ఉత్తరాది రాష్ట్రాలలో 'కజరి పౌర్ణమి' పేరుతో గోధుమ నాట్లు వేస్తారు. ఇక సముద్రతీరంలో ఉండేవారు 'నరాళీ పౌర్ణమి' పేరుతో సముద్రదేవునికి కొబ్బరికాయలను సమర్పిస్తారు.

శ్రావణ పౌర్ణమి రోజున ఎన్ని ఆచారాలు ఉన్నా, రక్షాబంధనానికే తొలి ప్రధాన్యత. రాష్ట్రం ఏదైనా, లోకంలో ఎక్కడున్నా.... ఆఖరికి భగవంతుని నమ్మినా నమ్మకున్నా, రాఖీ పండుగ చేసుకుంటే బాగుండు అనుకోని భారతీయుడు ఉండడంటే అతిశయోక్తి కాదేమో! రాఖీ రోజు ఆడామగా అంతా ఉదయాన్నే లేచి తలార స్నానం చేస్తారు. ఆపై సోదరికి ఎదురుగా కూర్చుని రాఖీ కట్టించుకుంటారు. ఈ రాఖీని కట్టేటప్పుడు `యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః | తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల ||` అన్న మంత్రాన్ని చదివితే మంచిదని చెబుతారు. రాఖీ కట్టిన తర్వాత తన సోదరుని సకల విజయాలూ కలగాలని ఆశిస్తూ, అతనికి హారతి ఇచ్చి, నుదుట తిలకాన్ని దిద్ది, తీపిని తినిపిస్తారు. ఇందుకు బదులుగా సోదరులు మనస్ఫూర్తిగా బహుమతులను అందిస్తారు. 

Tags:    

Similar News