Gender Identity - Sexual Identity మధ్య తేడా ఏంటి?
Gender Identity - Sexual Identity: జెండర్ ఐడెంటిటీ అంటే సెక్సువల్ ఐడెంటియే కదా అని చాలా మంది అనుకుంటారు.
Gender Identity - Sexual Identity: జెండర్ ఐడెంటిటీ అంటే సెక్సువల్ ఐడెంటియే కదా అని చాలా మంది అనుకుంటారు. కానీ, అది తప్పు. జెండర్ ఐడెంటిటీ వేరే, సెక్సువల్ ఐడెంటిటీ వేరే. సింపుల్‌గా చెప్పాలంటే, జెండర్ ఐడెంటిటీ అంటే ఒక వ్యక్తి తన లోపల ఏమనుకుంటున్నాడో అది. అంటే, అంతరంగంలో ఒక వ్యక్తి తనను తాను ఆడ లేక మగ అనుకుంటున్నారా లేక రెండూ అనుకుంటున్నారా అన్నదే ఆ వ్యక్తి జెండర్ ఐడెంటిటీ. ఈ గుర్తింపు ఒక్కోసారి కాలంతో పాటు మారవచ్చు కూడా.
జెండర్ ఐడెంటిటీ, జెండర్ ఎక్స్‌ప్రెషన్ రెండూ ఒకటి కాకపోవచ్చు. జెండర్ అంటే లోపల నీవు ఏది అనుకుంటున్నావో అదే నీ జెండర్. ఒక వ్యక్తి జెండర్‌ను ఇతరులు నిర్ధారించలేరు. పుట్టుకతో వచ్చిన లైంగిక లక్షణాలు ఒక్కోసారి వ్యక్తి జెండర్ ఐడెంటిటీకి భిన్నంగా ఉండవచ్చు. అంటే, శారీరంగా స్త్రీ లైంగిక అవయవాలతో జన్మించినా కూడా ఒక వ్యక్తి జెండర్ గుర్తింపు స్త్రీగానే ఉండకపోవచ్చు. పురుష ఐడెంటిటీతో ఉండవచ్చు.
ఈ వివరణ మొదటిసారి విన్నప్పుడు కొంత గందరగోళంగా అనిపించవచ్చు. సెక్స్, జెండర్, జెండర్ ఐడెంటిటీల మధ్య తేడాలు తెలుసుకుంటే మానవ శరీర – మానసిక నిర్మాణంలో ఉన్న వైరుధ్యాలు అర్థమవుతాయి.
సమాజంలో ఇటీవలి కాలంలో LGBTQIA+ గుర్తింపులు పెరుగుతున్నాయి. వ్యక్తులు తమ ఐడెంటిటీ ఇదీ అని చెప్పుకునే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఈ ధోరణి పెరుగుతున్న కొద్దీ ఈ తేడాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే, ఈ సమస్య ఎక్కడో కాదు మనకు తెలిసిన వారిలోనో, స్నేహితుల్లోనో లేక మన ఇంట్లోనో ఎదురుకావచ్చు. అంతెందుకు, సమస్య మీలోనే ఉండవచ్చు. అందుకే, ఈ జెండర్ ఐడెంటిటీ అవగాహన చాలా ముఖ్యం.
ప్రస్తుతం అమెరికాలోని జనాభాలో 3.5 శాతం మంది వయోజనులు తమను తాము లెస్బియన్, గే, లేదా బైసెక్సువల్‌గా ఐడింటిఫై చేసుకున్నారు. 0.3 శాతం మంది తాము ట్రాన్స్‌జెండర్స్ అని చెప్పుకుంటున్నారు. ది విలియమ్స్ ఇనిస్టిట్యూట్ చేసిన ఈ అధ్యయనం ప్రకారం ప్రపంచంలో జెండర్ ఐడెంటిటీ స్పృహ పెరుగుతోంది. మన చుట్టూ ఉన్న మనుషులతో సహనంతో, సామరస్యంతో ఉండడానికి అందరికీ జెండర్ ఐడెంటిటీపై అవగాహన ఉపయోగపడుతుంది. ఈ అవగాహన ఏర్పడితే మనం వివిధ రకాల జెండర్ ఐడెంటిటీల పట్ల మన అభిప్రాయాలు మారిపోతాయి.
సెక్సువల్ ఐడెంటిటీ:
ఒక వ్యక్తి సెక్సువల్ గుర్తింపు అన్నది జీన్స్, పునరుత్పత్తి అవయవాలు, హార్మోన్లను బట్టి నిర్ధారిస్తారు. ఈ నిర్ధారణ సాధారణంగా ఆడ, మగ, ఇంటర్‌సెక్స్ అనే మాటలతో ఉంటుంది.
అయితే, ఈ జీవ సంబంధమైన విభజన నలుపు – తెలుపు, రాత్రి – పగలు అన్నట్లుగా రెండే రెండు విభాగాలుగా ఉండదు. ఉదాహరణకు, ఒక వ్యక్తికి ఫీమేల్ జీన్స్ ఉన్నప్పటికీ జీవ నిర్మాణ పరంగా పురుషుడి పునరుత్పత్తి అవయవాలు ఉండవచ్చు. లేదంటే, స్త్రీ-పురుష లైంగిక అవయవాలు రెండూ ఉండవచ్చు. జీన్స్‌తో సంబంధం లేని జెనిటల్స్ ఉండడాన్ని ఇంటర్‌సెక్స్ అంటారు.
జెండర్ అంటే...
ఇక, జెండర్ – సెక్స్ అన్నవి రెండు భిన్నమైన అంశాలు. ఒక వ్యక్తి అంతర్గతంగా ఆడవారి ఫీలింగ్స్‌తో ఉంటూ, పురుష అవయవాలు ఉండడం లేదా స్త్రీ అవయవాలతో పుట్టి పురుషుడి గుర్తింపుతో ఉండవచ్చు. ఇలాంటప్పుడు, జీవ నిర్మాణానికి సంబంధించిన లైంగికత ఆ వ్యక్తి జెండర్ ఐడెంటిటీ వేరుగా ఉంటాయి. తన లోపలి లైంగిక భావనలను ఆ వ్యక్తి తన అవయవ నిర్మణానికి భిన్నంగా వ్యక్తీకరించుకోవచ్చు. ఆ వ్యక్తి ధరించే దుస్తులు, కనిపించే తీరులో ఐడెంటిటీ వ్యక్తీకరణ ఉంటుంది.
సెక్స్‌ను ఎలాగైతే కేవలం రెండు అంశాలుగా విడదీసి చూడలేమో, జెండర్‌ను కూడా అలా రెండు అంశాలుగా పరిమితం చేయలేం. ఆడ, మగ కాకుండా ఇంకా చాలా రకాల జెండర్ గుర్తింపులు ఉన్నాయి. ఇవి వ్యక్తి అంతరంగానికి సంబంధించిన గుర్తింపులు. సాధారణ సమాజంలో మనుషుల వర్గీకరణను స్త్రీ, పురుషులు అనే రెండు వర్గాలుగా చూస్తున్నాం. స్త్రీత్వం అంటే స్త్రీల లక్షణం అని, పురుషత్వం అంటే మగాడి లక్షణం అనే భావన చాలా కాలంగా సమాజంలో ఉంది. కానీ, జెండర్ ఐడెంటిటీ స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు లేదా రెండూ కావచ్చు. ఒక్కోసారి ఏదీ కాకపోవచ్చు. కొద్ది పాటి తేడాలతో జెండర్ స్పృహ అనేది రకరకాలుగా ఉండవచ్చు. వీటిలో కొన్ని రకాల జెండర్ ఐడెంటిటీస్ ఏమిటో తెలుసుకుందాం.
అజెండర్: ఆడ, మగ రెండూ మీ గుర్తింపు కాకపోతే అది అజెండర్ ఐడెంటిటీ. అంటే, ఈ ఐడెంటిటీ ఉన్నవారు తమను తాము స్త్రీగా భావించుకోలేరు. అలాగని, పురుషుడిగానూ భావించుకోలేరు.
ఆండ్రోజైన్: స్త్రీ, పురుష రెండు స్పృహలూ కలిగి ఉండడాన్ని ఆండ్రోజైన్ అంటారు.
బైజెండర్: రెండు రకాల జెండర్ గుర్తింపులు కలిగి ఉన్నవారిని బైజెండర్ అంటారు.
బుచ్: సమాజం దృష్టిలో పురుషత్వం అన్న మాటకు అర్థం చూపించాలనుకునే స్వలింగ సంపర్కురాలైన మహిళ
సిస్‌జెండర్: పుట్టుకతో వచ్చిన జననాంగాలకు అనుగుణంగా తనను తాను గుర్తించుకునే వ్యక్తి.
జెండర్ ఎక్స్‌పాన్సివ్: జెండర్ అన్న పదానికి చుట్టూ ఉన్న సమాజం ఇచ్చే నిర్వచనాలకు అతీతంగా ప్రవర్తించే వ్యక్తి.
జెండర్ ఫ్లూయిడ్: సామాజిక కట్టుబాట్ల ప్రకారం జెండర్ ప్రవర్తనను మార్చుకోగలగడం.
జెండర్ ఔట్‌లా: సమాజం నిర్దేశించిన జెండర్ నిర్వచనాల్ని తిరస్కరించేవారు
జెండర్ క్వీర్: మీకు నిర్దేశించిన లైంగికతకు అనుగుణంగా సమాజం ఆశించే దానికి భిన్నంగా జెండర్ ఐడెంటిటీ కలిగి ఉండడం. జెండర్ కాంబినేషన్ ఉన్నవారిని కూడా క్వీర్ అనవచ్చు.
నాన్-బైనరీ: ఆడ, మగ కాని జెండర్ స్పృహ కలిగి ఉండడం. ట్రాన్స్‌జెండర్‌గా భావించుకునే వారు కూడా.
ఆమ్నీ జెండర్: అన్నిరకాల జెండర్ అనుభవాలు కలిగి ఉండడం.
పాలీజెండర్: ఒకటి కన్నా ఎక్కువ జెండర్ అనుభవాలు కలిగి ఉండడం
ట్రాన్స్ జెండర్/ ట్రాన్స్: పుట్టుకతో వచ్చిన జననాంగాలకు భిన్నమైన జెండర్ స్పృహ కలిగి ఉండడం. అంటే, మగ బిడ్డగా పుట్టినా ఆడతనంతో పెరగడం లేదా అమ్మాయిగా పుట్టి మగవాడి మనస్తత్వంతో ఎదగడం. దీన్నే ట్రాన్స్ అంటే అటూ ఇటూ అని అర్థం చేసుకోవచ్చు. నాన్ బైనరీ లేదా స్పష్టమైన జెండర్ స్పృహ లేని వారిని కూడా ట్రాన్స్ అని వ్యవహరిస్తుంటారు.
జెండర్ స్పృహ – జెండర్ వ్యక్తీకరణ... ఈ రెండింటి మధ్య తేడా ఏంటి?
పుట్టుకతో ఉన్న లైంగికతకు భిన్నమైన జెండర్ ఐడెంటిటీ ఉన్నప్పుడు వ్యక్తుల వేషధారణలో తమ అంతర్గత స్పృహకు సంబంధించిన వ్యక్తీకరణ ఉంటుంది. జెండర్ ఎక్స్‌ప్రెషన్ అంటే జెండర్ ఐడెంటిటీని ప్రదర్శించడం అని చెప్పవచ్చు. అన్ని రకాల జెండర్ ఐడెంటిటీలను రకరకాలుగా వ్యక్తీకరించవచ్చు. ఆ వ్యక్తీకరణను బట్టి ఇతరులు వారిని అర్థం చేసుకుంటారు.
జెండర్ స్పృహను బట్టే ఇటీవలి కాలంలో జెండర్ అసర్షన్ సర్జరీలు చేయించుకునే ధోరణి మొదలైంది. అంటే, తమ అంతరంగ లైంగికతను బట్టి శరీరంలో మార్పులు చేయించుకునే శస్త్ర చికిత్స. ఇలాంటి, తమ లైంగికత ధ్రువీకరించుకున్నవారు తమకు లభించిన కొత్త లైంగికత ప్రకారం పేర్లు మార్చుకుంటారు.
జెండర్ గుర్తింపుల గురించి తెలుసుకోవడం, ఇతరులతో చర్చించడం చాలా ముఖ్యం. దీనివల్ల, సమాజంలోని విభిన్న జెండర్ స్పృహల పట్ల చిన్నచూపు పోతుంది. మనుషుల్ని సమానంగా గౌరవించే సంప్రదాయంలో ఇది కూడా కీలకమైన అంశం. చివరగా, జెండర్ ఐడెంటిటీ అంటే పుట్టుకతో వచ్చిన జననాంగాలకు సంబంధించినదే అయి ఉండాల్సిన పని లేదు. మిమ్మల్ని మీరు ఎలా లైంగికంగా ఎలా భావించుకుంటున్నారు అన్నదే ఇక్కడ ముఖ్యం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే,. జెండర్ ఐడెంటిటీ అన్నది కాలక్రమంలో మారిపోవచ్చు కూడా.
ఏది ఏమైనా, జెండర్ స్పృహ అన్నది పూర్తిగా వ్యక్తిగత విషయం. అంతర్గతంగా ఏ లైంగిక స్పృహ బలంగా ఉందో గుర్తించడమే ఇక్కడ ముఖ్యమైన విషయం. అదే జెండర్ ఐడెంటిటీ.