National Technology Day 2024: పోఖ్రాన్‌లో అణు పరీక్షలు చేసినప్పుడు వాజ్‌పేయి ప్రభుత్వం అమెరికాను ఎలా బురిడీ కొట్టించింది?
‘‘ఈ రోజు మధ్యాహ్నం 3.45 గంటలకు పోఖ్రాన్ రేంజ్‌లో భారత్ మూడు అండర్‌గ్రౌండ్ న్యూక్లియర్ టెస్టులు నిర్వహించింది’’ అని 1998 మే 11న నాటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ ఒక ప్రకటన చేశారు.
National Technology Day 2024: ‘ఈ రోజు మధ్యాహ్నం 3.45 గంటలకు పోఖ్రాన్ రేంజ్‌లో భారత్ మూడు అండర్‌గ్రౌండ్ న్యూక్లియర్ టెస్టులు నిర్వహించింది’’ అని 1998 మే 11న నాటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ ఒక ప్రకటన చేశారు. దీనికి రెండు రోజుల తర్వాత అంటే మే 13న భారత్ మరో టెస్టు కూడా భారత్ నిర్వహించింది.
ఇదేమీ సాధారణ ప్రకటన కాదు. భారత్ ఒక అణ్వస్త్ర సామర్థ్యమున్న దేశంగా అవతరించిందని నాడు వాజ్‌పేయీ ప్రకటన చేశారు. మొదటగా 45 కేటీ (కిలోటన్) థెర్మోన్యూక్లియర్ డివైజ్, ఒక 15 కేటీ ఫిజన్ డివైజ్, 0.2 సబ్ కేటీ డివైజ్‌లను విస్ఫోటనం చెందించి న్యూక్లియర్ స్టేట్‌గా భారత్ మారింది. ఈ టెస్టులకు ‘‘ఆపరేషన్ శక్తి’’ అని నామకరణం చేశారు.
అయితే, ఆ తర్వాత మళ్లీ టెస్టులు నిర్వహించకుండా భారత్ తనకు తానుగానే మారిటోరియం విధించుకుంది. నేటికి ఆ పరిణామాలు చోటుచేసుకొని దాదాపు 26 ఏళ్లు గడిచాయి. ఈ నేపథ్యంలో అసలు నాడు ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం.
స్మైలింగ్ బుద్ధ పేరుతో తొలిసారి..
పోఖ్రాన్ టెస్టులేమీ భారత్‌కు తొలి న్యూక్లియర్ పరీక్షలు కాదు. నిజానికి 1974లోనే అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ నేతృత్వంలో ‘స్మైలింగ్ బుద్ధ’ పేరుతో భారత్ తొలి న్యూక్లియర్ పరీక్షలు నిర్వహించింది. అయితే, నాటి పరీక్షలు ఎక్కడ జరిగాయో, ఎప్పుడు జరిగాయో ఇప్పటికీ రహస్యమే.
1974లోనూ కొన్ని పరీక్షలు జరిగాయి. అయితే, ఇవి అణ్వస్త్రాల కోసం నిర్వహించిన పరీక్షలని ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయలేదు. అయితే, 1998నాటి పరీక్షల సమయానికి అమెరికా దగ్గర నిఘా ఉపగ్రహాలు ఉన్నాయి. అవి ఎంత మెరుగైనవంటే భారత సైనికుల బట్టలపై ఉండే గ్రీన్ ప్యాచ్‌లను కూడా లెక్కపెట్టేంత సమాచారం అందించేవి. వీటిని ‘బిలియన్ డాలర్ స్పైస్’గా అప్పట్లో పిలిచేవారు. అయినప్పటికీ పరీక్షలను ముందుగా గుర్తించడంలో అమెరికా సహా చాలా దేశాలు విఫలమయ్యాయి.
ఈ పరీక్షల తర్వాత పోఖ్రాన్ గురించి ప్రపంచం మొత్తానికి తెలిసింది. ఆపరేషన్ శక్తిలో భాగంగా ‘బుద్ధ స్మైలింగ్ ఎగైన్’ కోడ్ నేమ్ పేరుతో రహస్యంగా నిర్వహించిన ఈ పరీక్షలపై చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి.
అత్యంత రహస్యంగా...
సైన్యంలోని 58వ రేజిమెంట్ ఈ పరీక్షలను నిర్వహించింది. దీని కోసం భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బీఏఆర్‌సీ) చీఫ్ అనిల్ కకోద్కర్, మాజీ రాష్ట్రపతి, నాటి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) చీఫ్ అబ్దుల్ కలామ్, డీఆర్‌డీవో అడ్వైజర్ కే సంతానం, సీనియర్ శాస్త్రవేత్త గోపాల్ కౌశిక్‌తోపాటు దాదాపు వంద మంది శాస్త్రవేత్తలు దీని కోసం రహస్యంగా రాత్రిపూట పనిచేశారు. సూర్యకాంతి లేకపోవడంతో స్పష్టమైన ఇమేజ్‌లు అమెరికా శాటిలైట్‌లకు అందడం కష్టమయ్యేది.
క్రికెట్, బిలియార్డ్స్ లాంటి స్పోర్ట్స్‌తో నాడు అమెరికా ఉపగ్రహాలను అధికారులు, శాస్త్రవేత్తలు బురిడీ కొట్టించారు.
‘‘మేమంతా కలిసి క్రికెట్ ఆడేవాళ్లం. వచ్చేవాళ్లంతా క్రికెట్ చూడటానికే వచ్చినట్లుగా పైనుంచి చూసేవారికి వారికి భ్రమకల్పించే వాళ్లం. పోఖ్రాన్‌లో ఏదో రహస్యంగా జరుగుతుందని అనుమానం రాకుండా చూసేందుకు అలా చేసేవాళ్లం’’ అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో గోపాల్ కౌశిక్ చెప్పారు.
పరీక్షల కోసం ఉపయోగించిన నీరు బయటకు వస్తే, చుట్టుపక్కల మట్టి రంగు మారుతుంది. ఫలితంగా ఉపగ్రహాలకు ఇట్టే తెలిసిపోతుంది. అందుకే చాలా పైప్‌ల ద్వారా నీటిని ఇసుకలోని కింద పొరలకు పంపించేవారు. దీంతో పైపొరలు రంగు మారకుండా అలానే ఉండేవి. కమ్యూనికేషన్ వ్యవస్థలను కూడా బురిడీ అయితే, కేవలం శాటిలైట్‌లను మాత్రమే కాదు. కమ్యూనికేషన్ వ్యవస్థలనూ మెరుగ్గా భారత అధికారులు తప్పుదోవ పట్టించారు.
భూగర్భ మార్గాలకు ‘వైట్ హౌస్’, ‘విస్కీ’, ‘తాజ్ మహల్’ లాంటి పేర్లతో పిలుచుకుంటూ కమ్యూనికేషన్ వ్యవస్థలకు అసలు పేర్లు తెలియకుండా జాగ్రత్త పడేవారు. వ్యక్తుల పేర్ల విషయంలోనూ చాలా జాగ్రత్త పడేవారు. ఉదాహరణకు అబ్దుల్ కలామ్‌కు మేజర్ జనరల్ పృథ్వీ రాజ్ అనే పేరును పెట్టారు. అలానే అధికారుల అందరి పేర్లూ మార్చారు.
రక్షణ మంత్రికి కూడా తెలియకుండా.. ఈ మిషన్‌కు సంబంధించిన రహస్య సమాచారం సీనియర్ అధికారులకు కూడా లీక్ కాకుండా జాగ్రత్త పడేవారు. ఉదాహరణకు వాజ్‌పేయీ, అబ్దుల్ కలాం, కొందరు సీనియర్ అధికారులతో జరిగిన సమావేశానికి నాటి రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండేస్‌కు కూడా సమాచారం ఇవ్వలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి.
అయితే, పరీక్షలకు ముందు ఆయనతోపాటు ఎల్‌కే అడ్వాణీ, ప్రమోద్ మహాజన్, జస్వంత్ సింగ్, యశ్వంత్ సిన్హా లాంటి కొందరు సీనియర్ మంత్రులకు సమాచారం ఇచ్చినట్లు మీడియాకు వెల్లడించారు. వాజ్‌పేయీ చెబితేనే... భారత్ విజయవంతంగా ఈ పరీక్షలు నిర్వహించిందని వాజ్‌పేయీ చెబితేనే సీఐఏతోపాటు ప్రపంచ దేశాలకు తెలిసింది.
అయితే, భారత్‌పై అమెరికా సీఐఏ పదేపదే నిఘా పెడుతోందని న్యూయార్క్ టైమ్స్ అప్పట్లో ఒక సుదీర్ఘమైన ఆర్టికల్ ప్రచురించింది. దీనిలోని సమాచారంతో భారత్ అధికారులు మరింత అప్రమత్తం అయ్యుండొచ్చని సీఐఏ అప్పట్లో తెలిపింది.
మొత్తానికి ఈ టెస్టులను పసిగట్టడంలో అమెరికా నిఘా గూఢచర్య సంస్థ సీఐఏ పూర్తిగా విఫలమైందని నాటి అమెరికా సెనేటర్ రిచర్డ్ షెల్బీ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సీక్రెట్‌లను దాచడంలో భారత్ నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలని ఆయన అన్నారు.